
జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటుకు నిర్ణయం
ప్రభుత్వానికి సైబరాబాద్ ఉన్నతాధికారుల ప్రతిపాదనలు
ఏటా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎక్కడో విదేశాల్లో నక్కి, కమీషన్ల ఆశ చూపించి మధ్యవర్తులు, షెల్ కంపెనీలతో సైబర్ నేరస్తులు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. కొత్తగా ఐదు సైబర్ క్రైమ్ రాణాల (Cyber Crimes Police Stations) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కమిషనరేట్ పరిధిలో జోన్‌కు ఒకటి చొప్పున ఉండేలా కసరత్తు చేస్తున్నారు.
అత్యధికంగా ఇక్కడే..
రాష్ట్రంలో అత్యధికంగా నైబర్ నేరాలు నమోదయ్యే పోలీసు యూనిట్లలో సైబరాబాద్ కమిషనరేట్ (cyberabad commissionerate) తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి కీలకమైన ఐటీ కారిడార్‌తో పాటు అంతర్జాతీయ సంస్థలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. వీటికి తోడు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థలూ ఇక్కడే ఉన్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది కమిషనరేట్‌లో 11,914 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితులు రూ.7,93,18,94,102 సొమ్మును పోగొట్టుకున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 30– 35 కేసులు నమోదవుతున్నాయి.
అరెస్టులు 5 శాతం కంటే తక్కువే..
ప్రస్తుతం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. రూ.50 వేల కంటే తక్కువ పోగొట్టుకుంటే స్థానిక స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. అంతకుమించి అయితే సైబర్ క్రైమ్ రాణాలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) కేసులలో డబ్బు రికవరీ సగటున 30 శాతం మించడం లేదు. నేరగాళ్ల అరెస్టులు సగటున 5 శాతం కూడా ఉండటం లేదు.
చదవండి: RRR వరకు హెచ్‌ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
గతేడాది సైబరాబాద్‌లో కేవలం 372 కేసుల్లో 534 మంది నేరస్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలిగారు. కేవలం ఒకే పోలీస్ స్టేషన్ ఉండటంతో ఈ సమస్య వస్తోంది. జోన్‌కు ఒకటి చొప్పున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటే కేసుల పరిష్కారం పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.