
యువకుడి దుర్మరణం
మృతుడు మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజీత్‌రెడ్డి కుమారుడు
హైదరాబాద్: ఓఆర్‌ఆర్‌పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(ORR Accident) మూసారంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజిత్‌రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి(19)(Kanishk Reddy) దుర్మరణం పాలయ్యాడు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్‌లోని స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై బెంజ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళుతుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై గొల్లపల్లె కలాన్ వద్ద కారు ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు.
రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు..
ఆలస్యమైంది ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేయగా.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రముఖుల పరామర్శ...
కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్‌రెడ్డి, సునరితారెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ ఫతుల్లాగూడ మహాప్రస్థానం హిందూ శ్మశాన వాటికలో కనిష్క్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.