
12 శాతం జీఎస్‌టీ నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ తగ్గించకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలను నిరాశపర్చింది. కరోనా నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేక సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై గ్రేటర్ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ బడ్జెట్‌తో ధరలు మరింత పెరుగుతాయని నగర వ్యాపారుల అంచనా.
డ్రైఫ్రూట్స్‌పై తగ్గని జీఎస్‌టీ
ఇప్పటీకే కరోనా ప్రభావంతో గ్రేటర్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఇమ్యూనిటీ కోసం ఎక్కువగా డ్రైఫ్రూట్స్ వాడుతున్నారు. గతంలో పోలిస్తే కరోనాతో డ్రైఫ్రూట్స్ వాడకం దాదాపు 60 శాతం పెరిగింది. ఈ బడ్జెట్‌లో ఇప్పటికే డ్రైఫ్రూట్స్‌పై కొనసాగుతున్న 12 శాతం జీఎస్‌టీ నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ తగ్గించకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
తగ్గేవి ఇవే..
వస్త్రాలు, తోలు వస్తువులు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్ చవక అవుతాయి. వ్యవసాయ పరికరాల ధరలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ చార్జర్ల ధరలు దిగివస్తాయి.
పెరిగేవి ఇవే..
మూలధన వస్తువులు, ముడి ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాల ధరలు మరింత పెరిగాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు పెరగనున్నాయి.
(చదవండి: సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేకుంటే ఛలానా? అర్థం ఉందా?)