సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో టేకు కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు మహారాష్ట్ర, మరోవైపు గోదావరి, ప్రాణహిత నదులు సరిహద్దులుగా ఉన్న ఈ జిల్లా నుంచి విలువైన టేకు కలప స్మగ్లింగ్ అవుతున్నా... అడ్డుకునే యంత్రాంగం లేకుండా పోయింది. సైకిళ్లు, మోటారు సైకిళ్లు మొదలుకొని కార్లు, వ్యాన్లు, ఎడ్లు వంటివన్నీ అడవుల నుంచి టేకు రవాణాకు సాధనాలుగా మారాయి. గోదావరి, ప్రాణహిత నదుల గుండా టేకు కలప దుంగలనే తెప్పలుగా మార్చి ఆవలి ఒడ్డుకు చేరుస్తున్నారు. అడపాదడపా కలప స్మగ్లర్లను పట్టుకొని, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
అడవి నుంచి కలప ఉమ్మడి జిల్లా సరిహద్దులను దాటకుండా చుట్టూరా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, అవి నామమాత్రంగానే మిగిలాయి. కలప అక్రమ రవాణాదారులతో అటవీ సిబ్బంది చేతులు కలపడం వల్లనే ఆదిలాబాద్ అడవుల్లో టేకుకు రక్షణ లేకుండా పోతుందనేది నగ్న సత్యం. ఇటీవల జన్నారంలో ఆదివాసీ వ్యక్తి భీంరావు తలపై బలంగా మోది చనిపోయాడని వదిలేసిన ఉదంతంలో అల్లర్లు చెలరేగగా, కలప స్మగ్లర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. ఎలుక శ్రీను, లచ్చయ్యగౌడ్ అనే వ్యక్తులు కలప అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని సత్తయ్యగౌడ్ అనే అటవీ శాఖ ఉద్యోగికి తెలుపగా, ఆ విషయాన్ని సదరు ఉద్యోగి స్మగ్లర్ల చెవిన వేయడంతో ఈ దాడి జరిగింది.
జన్నారంలో అధికారుల అండతోనే..
జన్నారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులే స్మగ్లర్లకు పరోక్షంగా కలప తరలింపునకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందన్‌పల్లి రేంజ్‌లోని ఇందన్‌పల్లి, కలమడుగు బీట్ అధికారులను మూడు నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఐదు నెలల క్రితం ఉడుంపూర్ రేంజ్ కల్లెడ సెక్షన్ నుంచి వాహనం ద్వారా టేకు దుంగలను ఎనిమిదిసార్లు దర్జాగా తరలించగా తొమ్మిదవసారి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక బీట్ పెక్షన్ అధికారిని సస్పెండ్ చేశారు. తాజాగా ఆదివాసీ యువకుడు భీంరావుపై జరిగిన హత్యాయత్నంలో వాచర్ సత్తయ్యగౌడ్‌ను అరెస్టు చేశారు. ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ సెక్షన్‌లో పని చేస్తున్న ఓ అధికారి çకలపతో ఫర్నిచర్ చేయించి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రాణహిత నది నుంచి నెలకు రూ.అరకోటి విలువైన కలప...
పూర్వ ఆదిలాబాద్‌కు తూర్పు ప్రాంతమైన కోటపల్లి, వేమనపల్లి మండలాలు ఒకప్పుడు టేకు కలపకు పెట్టింది పేరు. కలప స్మగర్లు జిల్లాలో టేకును లేకుండా చేశారు. దాంతో సరిహద్దులోని మహారాష్ట్రపై కన్నేశారు. మహారాష్ట్ర నుంచి గత ఐదేళ్లుగా నెలకు సుమారు రూ.50 లక్షలకు పైగా టేకును మంచిర్యాల జిల్లా మీదుగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. కలప రవాణాకు అడ్డు వచ్చిన అధికారులపై దాడులు చేస్తున్నారు. ప్రాణహిత నదిలో కలప దుంగలను తెప్పలుగా కట్టి ఎగువ ప్రాంతంలో వదిలేస్తే దిగువ ప్రాంతాలైన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం, వేమనపల్లి మండలం సుంపుటం గ్రామాలకు చేరుకుంటుంది. జలమార్గం గుండా వచ్చిన కలపను అక్కడి నుంచి స్మగ్లర్లు వాహనాల్లో చెన్నూరు, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడం ఇప్పటికీ సాగుతోంది.
చెన్నూరులో ‘బాపు’రే...
మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా వెనుక చెన్నూరుకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి హస్తం ఉంది. మాజీ సర్పంచ్ కూడా అయిన ఈ నాయకుడి కనుసన్నల్లోనే మహారాష్ట్ర నుంచి చెన్నూరుకు నదీ మార్గంలో టేకు యథేచ్ఛగా వచ్చి చేరుతుందని సమాచా రం. సరిహద్దు ప్రాంతంలో పని చేస్తున్న ఫారెస్ట్ అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎక్కడికక్కడ ముడుపులు చెల్లించి కలపను అక్రమ రవాణా సాగిస్తాడనే పేరుంది.
ఇచ్చోడలో అధికార, ప్రతిపక్ష నేతలు..
ఇచ్చోడ కలప స్మగ్లింగ్ రాకెట్ ఓ కాంగ్రెస్ నాయకుడి కనుసన్నల్లో సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇచ్చోడ కలప డిపోలో మాయమైన టేకు దుంగలు ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో దొరకడంతో కేసులు కూడా నమోదయ్యాయి. కేశపట్నం గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కలప రవాణాలో కీలకంగా పనిచేస్తున్నాడు. ఇతనిపై ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రెండు నెలల కిత్రం కలప రవాణాకు పాల్పడుతుండగా అడ్డొచ్చిన అటవీశాఖ సిబ్బందిపై దాడిచేసిన సంఘటనలో కేసు నమెదు చేశారు. మండల కేంద్రంలో నివాసముంటున్న సదరు వ్యక్తి ఖరీదైన కారులో తిరుగుతూ అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద పెద్ద మొత్తంలో ముట్టచెప్పి కలప వాహనలను జిల్లా సరిహద్దులు దాటిస్తాడని ప్రచారంలో కూడా ఉంది. ఇదే కేసులో ఇతని వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. కేశవపట్నం గ్రామానికే చెందిన మరో అధికార పార్టీ నాయకుడు అనుచరులతో కలిసి అక్రమ కలప రవాణా చేస్తుండగా స్దానిక పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. అయితే నియోజకవర్గ నేత కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
జన్నారంలో అధికారులపై దాడులు
కలప రవాణాకు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓవైపు ఉండగా... అడవుల్లో జరుగుతున్న కలప స్మగ్లింగ్‌ను అడ్డుకుని దాడికి గురైన వారు మరికొందరు ఉన్నారు. 2014లో కామన్‌పల్లి బీట్‌లో పని చేస్తున్న బీట్ అధికారి సీతారాంను దేవునిగూడకు చెందిన కొందరు కలప దొంగలు కొట్టి గాయపరిచారు. ఈ సంఘటనలో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. 2016 నవంబర్ 12 న కవ్వాల్ బంగారు తాండా బీట్ అధికారి కిరణ్‌పై దేవునిగూడకు చెందిన కొందరు కలప స్మగ్లర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. అయితే స్మగ్లర్లకు కిరణ్ వెళ్లిన విషయం తెలిపింది అటవీశాఖలో పని చేస్తున్న ఓ వ్యక్తి అని ఆరోపణలు వినవచ్చాయి.
అక్రమ రవాణా మార్గాలు ఇవే..
► ఏజెన్సీ ప్రాంతంలోని తాటిగూడ, దంపూర్, ఎర్రబండ, మంగి, గుండాల, కొమ్ముగూడ, దండెపల్లి, పాత మామిడిపల్లి, తిర్యాణి, దేవాపూర్ మీదుగా మంచిర్యాలకు, అక్కడి నుంచి ఇందారం చెక్‌పోస్టు కళ్లు కప్పి పూర్వ కరీంనగర్ జిల్లాలోకి రవాణా చేస్తున్నారు.
► కవ్వాల్, కొత్తూరుపల్లి, కిష్టాపూర్, ఇందన్‌పల్లి, కలమడుగు, నార్లాపూర్‌లలో సేకరించిన టేకు కలపను ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ట్రక్కుల ద్వారా లక్సెట్టిపేట గుండా ధర్మపురి, జగిత్యాల ద్వారా రవాణా చేస్తున్నారు.
► కల్లెడ, దోస్త్‌నగర్, ఉడుంపూర్, బీజీపూర్, గండిగోపాలపూర్ ద్వారా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు దాటిపోతోంది.
►ఇచ్చోడ ప్రాంతంలో కలప స్మగ్లర్లు బోథ్ మండలం ఘన్‌పూర్ నుంచి మహారాష్ట్రకు, అలాగే బైంసా, బాసర నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్నారు.
►కలప స్మగ్లింగ్‌కు సంబంధించి కేశవపట్నం, గుండాల, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాలకు చెందిన 230 మందిపై ఇచ్చోడ పోలీస్టేష్టన్లలో కేసులు నమోదయ్యాయి. నేరడిగొండ, గుడిహత్నూర్, పోలీస్టేషన్లలో కూడా మరో 50 మంది కలప స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment