సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో కూడా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో బెల్టు షాపులు నడుస్తున్నాయి. చివరకు మెడికల్ షాపుల్లో సైతం మద్యం అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో బెల్టుషాపులపై దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు మద్యం వ్యాపారులు, అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. మద్యం షాపులు, బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారు. బెల్టు షాపులపై పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ విభాగం శుక్రవారం పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీంతో అధికార పార్టీ నేతలు, మద్యం సిండికేట్లకు చిర్రెత్తుకొచ్చింది. ‘మామూళ్లు ఇవ్వలేదనే దాడులు చేస్తున్నారంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తాం.. తర్వాత మీ ఇష్టం’ అంటూ ఎక్సైజ్ అధికారులను బెదిరించారు. ఫిర్యాదు ఆధారంగా తమను ఎక్కడ సస్పెండ్ చేస్తారోననే భయంతో అధికారులు సెలవుపై వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఆ షాపు వైపు చూస్తే తాట తీస్తా..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం తిర్లంగి గ్రామంలోని ఓ పాన్ షాపులో బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. దీని వల్ల తమ గ్రామంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోందని ఆ గ్రామస్తులు ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి.. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. వీరికి ఎక్కడి నుంచి మద్యం సరఫరా అవుతుందో ఆరా తీసి సంబంధిత మద్యం షాపును సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. వెంటనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ మద్యం షాపుపై కేసు నమోదు చేస్తే తాట తీస్తానని ఆ మంత్రి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ప్రజల ఇబ్బందుల కన్నా మద్యం సిండికేట్ నిర్వాహకుడైన తన అనుచరుడి అక్రమ వ్యాపారమే ప్రధానమని ఆ మంత్రి బెదిరింపులకు దిగడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు.
ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనూ..
ఎక్సైజ్ మంత్రి జవహర్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో సంక్రాంతి సీజన్‌లో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వేలం పాటలు నిర్వహించారు. కొందరు రూ.లక్షల్లో వేలం పాడి బెల్టు షాపులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో బెల్టు షాపుల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఒకరు ఎక్సైజ్ అధికారులను బెదిరించినట్లు తెలిసింది.
- గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో బెల్టు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేశారు. చివరకు మెడికల్ షాపుల్లో సైతం మద్యం అమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇక్కడ మద్యం దందా జరుగుతున్నట్లు తెలిసింది. కాగా, ఇక్కడి బెల్టు షాపులపై మహిళల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసేందుకు వెళ్లగా.. సీనియర్ ఎమ్మెల్యే వారిని తీవ్ర స్థాయిలో బెదిరించారు.
- చిత్తూరు జిల్లాలో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు మద్యం సిండికేట్లు ఓ మంత్రిని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఆ మంత్రి చూసీ చూడనట్లు వదిలేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
మార్జిన్ ఇవ్వట్లేదుగా..
మద్యం వ్యాపారం చేసినందుకు ప్రభుత్వం వ్యాపారులకు 7 శాతం మార్జిన్ ఇస్తుంటుంది. అంటే రూ.వంద మద్యం అమ్మితే వ్యాపారికి ఏడు రూపాయలు దక్కుతాయి. ఈ మార్జిన్ శాతం పెంచాలని వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేశారు. దీన్ని కూడా టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకొని అధికారులను బెదిరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు ప్రభుత్వం ఎక్కువ కమీషన్ ఇవ్వట్లేదని, అందువల్ల అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డు వెళ్లొద్దని ఎక్సైజ్ అధికారులను హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment