సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా 74 రోజుల్లో రాష్ట్ర రాజకీయం ఏంటో తేటతెల్లం కానుంది. మార్చి 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. గత వారంలో రోజులుగా నిన్నా.. నేడూ అంటూ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ ఉండగా ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
నేటి నుంచి జిల్లా రాజకీయం జెట్‌స్పీడ్‌ను అందుకోనుంది. అభ్యర్థుల ప్రకటన, ప్రచారం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవ్వగా.. రేపటి నుంచి ఇది మరింత ఊపందుకోనుంది. ఇక పల్లెపల్లెన ప్రచారం హోరెత్తనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లా అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు.
18 నుంచి నామినేషన్ల స్వీకరణ..
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినట్లుగా మార్చి 18న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 25 వరకు ఈప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం..
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగానికి సంబంధించిన అంశాలపై నేడు కలెక్టర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.
సీఎం, ప్రధాని ఫొటోలు తీసేయాల్సిందే..
ఎన్నికల నియమావళి(కోడ్) రాష్ట్రంలో ఆదివారం నుంచి సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. ఎన్నిక షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సంఘం ‘కోడ్’లోని ఏడో నిబంధనను అమల్లోకి తేవడంతో వీటన్నింటికీ బ్రేక్ పడింది.
షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అంతటా అమల్లోకి ఇక వచ్చినట్లే. దీంతో ప్రభుత్వ భవనాలపై ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, గోడలపై రాతలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు అన్నింటినీ 24 గంటల్లో తొలగించాలి.
ప్రభుత్వ వెబ్‌సైట్‌లలోనూ సీఎం, ప్రధాన మంత్రి ఫొటోలు తొలగించాల్సిందే. ప్రజా ఆస్తులైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలు, రహదారుల వెంట వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్‌లను 48 గంటల్లో తొలగించాలి. ఇక ప్రైవేటు ఆస్తులపై ఉన్న వాటిని 2 గంటల్లో తొలగించేయాలి.
Comments
Please login to add a commentAdd a comment