తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: పల్లె, పట్టణ, నగరంలోని పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలని, ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ శ్రీనాథరెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం నిర్వహించారు. తొలుత స్నాతకోత్సవ ప్రాధాన్యత, స్విమ్స్ అభివృద్ధి గురించి వర్సిటీ వీసీ డాక్టర్ భూమా వెంగమ్మ తన ప్రసంగంలో వివరించారు.
విశిష్ట అతిథిగా వచ్చిన శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు చేసిన దిశానిర్దేశం మేరకు మనదేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వైద్య విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య వృత్తిలోని వారు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందని తెలిపారు.
అందులో భాగంగా స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు వైద్య పరిశోధనలను ప్రశంసించారు. వైద్య రంగంలోని ప్రొఫెసర్లు నుంచి నర్సుల వరకు సమష్టిగా అంకితభావంతో కృషి చేస్తేనే వైద్య వృత్తికి సార్థకత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రోగులతో వైద్యుని స్వావలంబన, స్నేహపూర్వక పలకరింపు మెరుగైన ఫలితాలు ఇస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో వైద్య రంగంతో మిగిలిన అన్ని రంగాలను పోల్చుకుంటూ వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైందని, ఈ వృత్తిలో కొనసాగేవారిపై ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. రోగికి డాక్టర్‌పై నమ్మకం కలిగేలా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. వైద్య వృత్తిలో నిత్యం రోగుల సేవలో తరించే నర్సులకున్నంత ప్రాధాన్యత మరెవరికీ ఉండదని అభిప్రాయపడ్డారు. అనంతరం వైద్య విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, డిగ్రీ పట్టాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, వైద్యశాఖ కార్యదర్శి ఎల్‌వీ.సుబ్రమణ్యం, స్విమ్స్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు, డీన్ డాక్టర్ రాజశేఖర్, ఆర్‌ఎంవోలు గోవిందనారాయణ, వెంకటకోటిరెడ్డి, పబ్లిక్ రిలేషన్స్ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ వై.వెంకటరామిరెడ్డి, చీఫ్ డైటీషియన్ సునీత, స్విమ్స్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కోబాకు భూపాల్ పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందాలి
Published Sat, Oct 26 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement