Better healing
-
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
అరుదైన వ్యాధికి వైద్యం.. శిశువుకు ప్రాణం
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు) : కోవిడ్‌తో పాటు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్–మిస్క్(ఎంఐఎస్–సీ)తో బాధపడుతున్న 900 గ్రాముల బరువైన శిశువుకు మెరుగైన వైద్యం అందించి వ్యాధిని నయం చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్యాధి నుంచి కోలుకున్న అతి చిన్న శిశువుగా వైద్యులు పేర్కొన్నారు. విశాఖలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. ఆస్పత్రిలో గురువారం ఈ కేసు వివరాలను చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్‌కిశోర్ మీడియాకు వెల్లడించారు. విశాఖకు చెందిన తేజస్వి గర్భంలోని బిడ్డ ఎదుగుదల, రక్త సరఫరా సరిగా లేకపోవడంతో సిజేరియన్ చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్) అయితే ఆ శిశువు కేవలం 900 గ్రాముల బరువే ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువు ఎడమ కాలులో ఇస్కీమిక్ మార్పుల వలన రక్త సరఫరా నిలిచినట్టు గుర్తించారు. శిశువు కోవిడ్‌తో పాటు ఎలివేటెడ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్లను కలిగి ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అతి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి రావడం అరుదు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువుకు మూడు రోజులు అత్యాధునిక వైద్యం అందించారు. 36 రోజుల అత్యవసర చికిత్స అనంతరం శిశువు సాధారణ స్థితికి చేరుకోవడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం) -
‘గాంధీ’ ఫైల్స్ గంటల్లో క్లియర్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. శనివారం గాంధీఆస్పత్రిని సందర్శించిన ఆయన సుమారు రెండు గంటల పాటు కలియతిరిగి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించారు. ►డ్రైనేజీ, ఫైర్‌ఫైటింగ్ సిస్టం, వాటర్ లీకింగ్తోపాటు ప్రధానమైన సమస్యలను సూపరింటెండెంట్ రాజారావు ఆయనకు వివరించారు. ►డ్రైనేజీ పైప్లైన్లు పాడైపోవడంతో మురుగునీరు ఆస్పత్రి సెల్లార్‌ను ముంచెత్తుతుందని, సెల్లార్లో డైట్ క్యాంటిన్, మెడికల్ ఫార్మసీ, దోబీఘా ట్, ఫిజియోథెరపీ తదితర సేవలు అందిస్తున్నామని డాక్టర్ రాజారావు వివరించారు. ►భవన సముదాయం నిర్మించి 18 ఏళ్లు కావడం తో లీకేజీలతో తరుచు విద్యుత్ షార్ట్సర్యూ్కట్ జరిగి విలువైన వైద్యపరికరాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, గోడలు, పైకప్పులు పెచ్చు లు ఊడి పురాతనభవనాన్ని తలపిస్తుందన్నారు. ►ఫైర్‌ఫైటింగ్ సిస్టం కోసం దశాబ్ధకాలంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని, సీసీ కెమెరాల నిర్వహణ ఫైల్ పెండింగ్‌లో ఉందని, ఆస్పత్రి ప్రాంగణంలోని సుమారు 10 దుకాణాలు ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కోర్టును ఆశ్రయించి ఇబ్బంది పెడుతున్నారని. సుమారు రూ.3 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆస్పత్రి తరుపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని నియమిస్తే కోర్టు వాజ్యాలు పరిష్కారం అవుతాయని కోరారు. ►సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రోజుకు 39 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంతోపాటు 650 వెంటిలేటర్ పడకలు కలిగిన గాంధీ భవన సముదాయంలో శానిటేషన్, సె క్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బందిని మరిం త పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. సంబంధిత ఫైల్స్ తీసుకుని తన వద్దకు వస్తే తన పరిధిలో ఉన్న సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరిస్తారనని, మరికొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్తానని కలెక్టర్ శర్మన్ అన్నారు. వైద్యసేవలపై ఆరా... పలు విభాగాల్లోని వార్డులను సందర్శించిన కలెక్టర్ శర్మన్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సెల్లార్, డ్రైనేజీ వ్యవస్థ, పంప్‌హౌస్, ఆక్సిజన్ ప్లాంట్స్, డైట్ క్యాంటీన్లను పరిశీలించారు. బ్లాక్ ఫంగస్, కోవిడ్ వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ కోవిడ్ యాంటిజెన్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లతోపాటు సీటీ స్కానింగ్ చేయించుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీలు నర్సింహారావునేత, శోభన్‌బాబు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ఎంఓ–1 నరేందర్‌కుమార్, ఆఫీస్, నర్సింగ్ సూపరింటెండెంట్లు విజయ్‌భాస్కర్, మంగమ్మలతోపాటు వైద్యులు, సిబ్బంది, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు. -
రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్
కొడుకు వైద్యంతో పాటు కూతురి పెళ్లి కూడా జరిపిస్తానని హామీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, గాయకుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కొడుకు అజయ్‌కి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా రాజన్న ప్రజల్లో చైతన్యం కలిగించారు. ‘తెలంగాణ వచ్చేదాకా తెగించి మాట్లాడుడే’ లాంటి పాటలెన్నో రాశాడు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కూడా కల్పించింది. అయితే ఇటీవల ఆయన కొడుకు అజయ్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఎంటెక్ చదివిన కూతురు శ్వేత వివాహం కూడా నిశ్చయమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంను కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి కూతురు పెళ్లి జరిపిస్తానని, ఆర్థిక సహాయం కూడా అందిస్తానని, కుమారుడి వైద్య ఖర్చులన్నీ భరిస్తానని రాజన్నకు హామీ ఇచ్చారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: పల్లె, పట్టణ, నగరంలోని పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలని, ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ శ్రీనాథరెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం నిర్వహించారు. తొలుత స్నాతకోత్సవ ప్రాధాన్యత, స్విమ్స్ అభివృద్ధి గురించి వర్సిటీ వీసీ డాక్టర్ భూమా వెంగమ్మ తన ప్రసంగంలో వివరించారు. విశిష్ట అతిథిగా వచ్చిన శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు చేసిన దిశానిర్దేశం మేరకు మనదేశంలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వైద్య విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య వృత్తిలోని వారు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందని తెలిపారు. అందులో భాగంగా స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు వైద్య పరిశోధనలను ప్రశంసించారు. వైద్య రంగంలోని ప్రొఫెసర్లు నుంచి నర్సుల వరకు సమష్టిగా అంకితభావంతో కృషి చేస్తేనే వైద్య వృత్తికి సార్థకత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రోగులతో వైద్యుని స్వావలంబన, స్నేహపూర్వక పలకరింపు మెరుగైన ఫలితాలు ఇస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో వైద్య రంగంతో మిగిలిన అన్ని రంగాలను పోల్చుకుంటూ వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైందని, ఈ వృత్తిలో కొనసాగేవారిపై ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. రోగికి డాక్టర్‌పై నమ్మకం కలిగేలా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. వైద్య వృత్తిలో నిత్యం రోగుల సేవలో తరించే నర్సులకున్నంత ప్రాధాన్యత మరెవరికీ ఉండదని అభిప్రాయపడ్డారు. అనంతరం వైద్య విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, వైద్యశాఖ కార్యదర్శి ఎల్వీ.సుబ్రమణ్యం, స్విమ్స్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు, డీన్ డాక్టర్ రాజశేఖర్, ఆర్ఎంవోలు గోవిందనారాయణ, వెంకటకోటిరెడ్డి, పబ్లిక్ రిలేషన్స్ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ వై.వెంకటరామిరెడ్డి, చీఫ్ డైటీషియన్ సునీత, స్విమ్స్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కోబాకు భూపాల్ పాల్గొన్నారు.