చోడవరం, న్యూస్‌లైన్: సీఎం పర్యటనపై కొండంత ఆశ పెట్టుకున్న చెరకు రైతుకు నిరాశే మిగిలింది. సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రాజు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు తమ ప్రసంగాల్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, రైతుల ప్రోత్సాహకం గురించే ఎక్కువగా మాట్లాడారు. చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ కో-జనరేషన్ నుంచి వచ్చే విద్యుత్ అమ్మకంలో తక్కువ ఆదాయం వస్తోందని ప్రైవేటు సంస్థకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.
గతేడాది రోలుగుంట సమావేశంలో వారం రోజుల్లో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు ముందు ఇక్కడికి రావడంతో ఏదో ప్రకటిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. అయినా సీఎం మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా చెరకు రైతుల గురించి ప్రస్తావించలేదు. జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీల పరిధిలో 50వేల మంది సభ్యరైతులకు సంబంధించిన సమస్యను కనీసం పట్టించుకోకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జిల్లాకు వరాల జల్లు
చోడవరం రచ్చబండ కార్యక్రమంలో సీఎం13,500 లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. పాయకరావుపేటలో ఎస్సీ హాస్టల్ రూ.80లక్షలతో, అరుకులోయలో గిరిజన ఆశ్రమ పాఠశాల, ఉద్యోగుల క్వార్టర్లను రూ.4.25కోట్లు, వేచలం-ఖండివరం వంతెన రూ.5 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాల సముదాయాన్ని ఆవిష్కరించారు. జిల్లాకు రూ.262 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
విమ్స్ అభివృద్ధికి రూ.135 కోట్లు, శారద, వరహా, పెద్దేరు, తాండవ నదీ గట్లు పటిష్టానికి, శాశ్వత పరిష్కారానికి రూ.114కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. చోడవరంలో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి రూ.50లక్షలు, పట్టణంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.కోటి ఇస్తున్నామన్నారు. చోడవరం సీహెచ్‌సీ 30పడకల ఆస్పత్రిని 50పడకల స్థాయికి పెంచుతున్నామన్నారు.
సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు , చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజులు,మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీలు పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ చెరకు రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, కన్నబాబురాజు, ముత్యాలపాప, చింతలపూడి వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చెరకు రైతులకు నిరాశే..
Published Sat, Nov 16 2013 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement