ప్రయాణికులకు టికెట్లు జారీ చేసే టిమ్స్ మెషిన్‌ను డ్రైవర్ చేతిలో పెట్టి కండక్టర్ విధులనూ చేయించాలనే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు టికెట్లు జారీ చేసే టిమ్స్ మెషిన్‌ను డ్రైవర్ చేతిలో పెట్టి కండక్టర్ విధులనూ చేయించాలనే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇద్దరి విభిన్న బాధ్యతలు ఒక్కరికే అప్పగించడం మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. బస్సులో కండక్టర్ విధులనూ డ్రైవర్లే నిర్వహించాలంటూ ఒత్తిడి చేయవద్దని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2011లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఇదే అంశంపై నెల్లూరుకు చెందిన డి.ప్రభుకిషోర్, మరో 14 మంది పిల్ దాఖలు చేశారు. వీటినీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించేందుకు సంబంధిత న్యాయవాది హాజరు కాకపోవడంతో ఆ సంస్థ అప్పీల్‌ను కొట్టివేసింది. పిల్‌పై పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్‌ఏకే మైనుద్దీన్ వాదనలు వినిపిం చారు. సింగిల్ జడ్జి తీర్పును పరిశీలించిన ధర్మాసనం దాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.