- మంత్రాలయం లేదా సచివాలయ నిర్మాణానికి రూ. 1,001 కోట్లు
- రాజ్‌భవన్‌కు రూ. 90 కోట్లు
- సీఎం నివాసం, క్యాంపు ఆఫీసుకు రూ. 90 కోట్లు
- 2019 నాటికి కేపిటల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి
- 2024 నాటికి మిగతా నిర్మాణాలన్నీ పూర్తి
- ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం మున్సిపల్ శాఖ అంచనాలు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణంలో కేపిటల్ కాంప్లెక్స్ సెక్టార్ అత్యంత కీలకమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. కేపిటల్ సెక్టార్ సుమారు 600 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రతిపాదించింది. తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా రంగాల వారీగా అయ్యే వ్యయంపై ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం అంచనాలను రూపొందించింది. కీలకమైన కేపిటల్ కాంపెక్ల్ నిర్మాణాన్ని 2019 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది.
రాజధానిలోని మిగతా రంగాల నిర్మాణాలను 2024 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేపిటల్ కాంప్లెక్స్‌లో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, హైకోర్టు కాంప్లెక్స్, సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్ర అతిథిగృహాలు, యుటిలిటీ బ్లాక్, సెక్యూరిటీ ఆవాసం ఉంటాయి. కాంప్లెక్స్ బ్లాకుల్లో ఒకదాని నుంచి మరోదానికి నడిచి వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేస్తారు. కేపిటల్ కాంప్లెక్స్‌కు దగ్గరలోనే ఉద్యోగులందరికీ ప్రభుత్వ గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
కేపిటల్ కాంప్లెక్స్ బ్లాకులు వీలైనంత ఎక్కువ ఎత్తులో ఉంటాయి. రాష్ట్ర ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా అత్యాధునిక వసతులతో, కళ్లు చెదిరిపోయేలా నిర్మించాలని సంకల్పించారు. అసెంబ్లీని తగినన్ని సీట్లతో పాటు రెండు ఆడిటోరియంలు, స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, మంత్రులు, సీఎస్, ఇతర అధికారుల కార్యాలయాలతో నిర్మిస్తారు.
ఎగ్జిబిషన్ హాల్, వెయిటింగ్ రూమ్, మీడియా రూమ్, సెక్యూరిటీ ఆఫీస్, సమావేశ మందిరం, మెడికల్ కేంద్రం, లైబ్రరీలతో పూర్తి హంగులతో అసెంబ్లీ నిర్మిస్తారు. అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణాలకు 1,125 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, అలాగే మంత్రాలయం లేదా సచివాలయ నిర్మాణానికి 1,001 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయాల నిర్మాణాలకు 90 కోట్ల రూపాయల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేశారు.
రాజధానిలో వివిధ రంగాల వసతులు, నిర్మాణాలకు మున్సిపల్ శాఖ రూపొందించిన అంచనాలివి.. (రూ.కోట్లలో)