సాక్షి, కడప :
జిల్లాలో సమైక్య ఉద్యమానికి విరామం ఉండటం లేదు. అప్రతిహతంగా సాగుతున్న పోరుతో జిల్లా అట్టుడుకుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, వినూత్న రీతిలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.రాష్ట్రాన్ని విడదీసి సీమాంధ్ర భవిష్యత్తును అగమ్యగోచరం చేయవద్దంటూ ఆందోళనకారులు నినదిస్తున్నారు. 41 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం సమైక్యపోరు 54వ రోజు పూర్తి చేసుకుంది.
కడపలో వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. కడపలో మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వాణిజ్యపన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సమైక్య పరిరక్షణవేదిక, వృత్తి విద్య కళాశాలల సమాఖ్య దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రొద్దుటూరులో 10 వేల మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి సా యంత్రం 5వరకు దీక్షలు చేపట్టారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
జమ్మలమడుగులో ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో బోయినపల్లెకు చెందిన గౌడ పెంచలయ్య ఆధ్వర్యంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పద్మ శాలీయులు తోట బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో కవలకుంట్లకు చెందిన 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చైతన్య స్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేపట్టారు. రోడ్డుపైనే ఓం అనే ఆకారంలో నిరసన తెలియజేశారు. ఎన్జీఓలు రోడ్లపైనే నిలబడి ఆందోళన చేశారు.
కమలాపురం పట్టణంలో రోడ్లపైన వాహనాలను నిలిపి సమైక్యాంధ్ర స్టిక్కర్లు అంటించి నిరసన తెలిపారు.
మైదుకూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
పులివెందులలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
రాయచోటిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
పొద్దుటూరులో 10 వేల మంది విద్యార్థులతో దీక్షలు
Published Tue, Sep 24 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement