సాక్షి, ఏలూరు : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 24వ రోజైన శుక్రవారం దీక్షలు, ర్యాలీలు, బంద్‌లతో హోరెత్తింది. ఏలూరులో 23 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళనలు చేసిన న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను న్యాయ శాఖ సీమాంధ్ర 13 జిల్లాల జేఏసీ చైర్మన్ ఎం.రమణయ్య ప్రారంభించారు. అట వీ, సంక్షేమ శాఖల ఉద్యోగులు దీక్షలు మొదలుపెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కోటదిబ్బలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని రోడ్లు దిగ్బంధం చేశారు. సీఆర్‌ఆర్ కళాశాల దీక్షా శిబిరం వద్ద విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేశారు.
కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాలులో ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఎల్ విద్యా సాగర్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీంతో కాన్ఫరెన్స్ హాలు నుంచి వారు వెళ్లిపోయారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్ లో రెండో రోజు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 16 ఆటో యూని యన్లు రిలయన్స్, మార్కు పెట్రోలు బంకుల వద్ద, జయలక్ష్మి ధియేటర్ వద్ద రోడ్డపై వంటా వార్పు కార్యక్రమం చేపట్టాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తోట గోపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగాయి. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసు ఆధ్వర్యంలో నారాయణపురం లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
నిడదవోలులో సుమారు 8 వేల మంది విద్యార్థులు ఓవర్‌బ్రిడ్జిని దిగ్బంధం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన కుమారుడు జీఎస్ నాయుడుకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య గంటన్నరపాటు మాటల యుద్ధం జరిగింది. పెనుగొండలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం కాపు యువత ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిళ్ల ర్యాలీ జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్యసంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్, చింతలపూడిలో వెఎస్సా ర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయ కర్త కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాజారావును పరామర్శించారు. మట్టా సురేష్‌కు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, పలువురు నాయకులు, ముస్లిం సోదరులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజారావు, సురేష్ ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు.
భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేశారు. భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్షలకు మద్దతుగా ప్రకాశంచౌక్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన శిబిరానికి మాగంటి బాబు వెళ్ళి సంఘీబావం తెలిపారు. స్థానిక కోర్టు వద్ద ఎంపీలను కుక్కలతో పోలుస్తూ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు భీమవరం వచ్చిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు.
కొవ్వూరులో వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టిన రిలే దీక్షలు తాళ్లపూడి, చాగల్లు మండలాల్లో ఐదో రోజుకు, కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో నాలుగో రోజుకు చేరాయి. చాగల్లు దీక్షకు వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేన్‌రాజు హాజరై సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. పాలకొల్లులో పశుసంవర్థక శాఖ, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, అంగర రామమోహన్ పాల్గొన్నారు.
స్వరం పెంచిన విద్యార్థి లోకం
Published Sat, Aug 24 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement