సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 5,658 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 12.26 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. గురువారం ఆరంభమవుతున్న ఈ పరీక్షలు వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9.30-12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఆరంభమయ్యే సమయానికంటే 45 నిమిషాల ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అరగంట ఆలస్యమైనా తొలి రెండు రోజులు పరీక్షలకు అనుమతిస్తారు. అదే పనిగా ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఒకే స్కూలు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు.