
పదిలో పన్నెండు
- టెన్త్ ఫలితాల్లో జిల్లాకు 12వ స్థానం
- జిల్లాలో 90.52 శాతం ఉత్తీర్ణత
- బాలికలదే పైచేయి
- జిల్లాలో 47,215మంది ఉత్తీర్ణత
- పది పాయింట్లు సాధించిన విద్యార్థులు 363మంది
- జూన్ 16 నుంచి సప్లిమెంటరీ
- ఫీజు చెల్లింపునకు మే 30 తుదిగడవు
సాక్షి, విజయవాడ/న్యూస్‌లైన్ మచిలీపట్నం : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. పదికి పది పాయింట్లు సాధించిన జిల్లాల్లో మూడో స్థానం పొందింది. మొదటి స్థానంలో రంగారెడ్డి, రెండో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలవగా మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచి తన ఉనికిని మరోమారు చాటుకుంది.
ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది కన్నా స్వల్పంగా మెరుగుపడింది. మెత్తంమీద జిల్లాలో 90.52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 450 ప్రైవేటు, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల నుంచి 52,160 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు. వీరిలో 47,215 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 27,005 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా, 24,378 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 25,155మంది హజరుకాగా, 22,837మంది పాస్ అయ్యారు. ఈఎడాది జిల్లాలో పదికి పది పాయింట్లు 363మంది విద్యార్థులు సాధించారు.
స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం
గతేడాది కన్నా ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. 2012-13 విద్యా సంవత్సరంలో 90.29 శాతంతో రాష్ట్ర స్థాయిలో పదో స్థానం సాధించిన జిల్లా.. 2013-14 విద్యా సంవత్సరంలో 90.52శాతం ఉత్తీర్ణత సాధించింది. ఉత్తీర్ణత 0.23 శాతం పెరిగినా రాష్ట్రస్థాయిలో 12వ స్థానానికి దిగజారింది. 2011-12 విద్యా సంవత్సరంలో 51,137 మంది పరీక్షలకు హాజరు కాగా, 45,389 ఉత్తీర్ణులయ్యారు. 88.76 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్రస్థాయిలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది.
68 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
జిల్లాలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 68 ఉన్నాయి. 95శాతానికి పైగా ఉత్తీర్ణ సాధించిన పాఠశాలలు వందకు పైగా ఉన్నాయి. ఈ ఫలితాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రీ-వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000
జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీలు తీసుకోవాలనుకునేవారు 12రోజులలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో డి.దేవానందరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చొప్పున చలానా లేదా డీడీ తీయాల్సి ఉంటుందన్నారు. రీ-వెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీ తీసుకునేందుకు దరఖాస్తు చేసే సమయంలో హాల్‌టికెట్ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా జత చేయాలని డీఈవో సూచించారు.
ఈ దరఖాస్తులన్నీ డీఈవో కార్యాలయంలోనే స్వీకరిస్తామని ఆయన చెప్పారు. జూన్ 16 నుంచి 27వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 30వ తేదీపు ఆయా పాఠశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు.
ఇంటర్నెట్ సెంటర్ల వద్ద సందడి..
పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో గురువారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు.