ఆ కుటుంబంలో 11 మంది డాక్టర్లు
కుప్పం: కుప్పం మండలానికి చెందిన గోనుగూరు వాసి టెంకాయల మునస్వామి,మనెమ్మ మనుమళ్లు, మనుమరాళ్లు 11 మంది వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. మునస్వామికి శ్రీనివాసులు, చౌడప్ప, షణ్ముగం ముగ్గురు కుమారులు, విమలమ్మ, రాజేశ్వరి కుమార్తెలు ఉన్నారు. వారందరికీ 13 మంది కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరిలో 11 మంది వైద్యవృత్తిని ఎంపిక చేసుకుని సేవలు అందిస్తున్నారు. మునస్వామి కుటుంబంలోని మోహన, శిల్పలు గైనకాజిస్టులు కాగా, మహేష్ సర్జన్‌గా, మంజునాథ్ ఆర్థోఫిడిషన్‌గా సేవలు అందిస్తున్నారు.
అలాగే స్రవంతి, సుభాష్, చంద్రకళ, ఉదయ్‌కువూర్, బాలాజీలు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చదువుతున్నారు. కిరణ్ ఎంబీబీఎస్, అరుణ్‌కుమార్ బీడీఎస్ చదువుతున్నారు. వీరిలో మంజునాథ్ మాత్రం కుప్పం వందపడకల ఆస్పత్రిలో ఆర్థోపిడిషన్‌గా పనిచేస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన తమ కుటుంబంలో నుంచి ఇంతమంది వైద్యులు కావడానికి పేదవారికి సేవ చేయాలన్న లక్ష్యం కారణమని వారు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి కుటుంబంలోను శుభకార్యాలకు అందరూ కలుస్తారని, అయితే మా కుటుంబసభ్యులందరూ ఒక చోట కలవాలంటే చాలా కష్టం అన్నారు. ఎందుకంటే వైద్యవృత్తిలో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.