ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
పెద్ద కూతురి ప్రేమ పెళ్లితో మనస్తాపం
చిన్నకుమార్తెతో కలసి
దంపతుల ఆత్మహత్య
నాగర్ కోయిల్‌లో విషాదం
ఓ యువతి ప్రేమ వివాహం ఆ కుటుంబ సభ్యులను కుంగదీసింది. చివరకు ముగ్గురిని బలి తీసుకుంది. ఈ పెళ్లి గురించి ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలనడంతో అవమానం భరించలేని దంపతులు, రెండో కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్ కోయిల్‌లో బుధవారం వెలుగు చూసిన ఈ విషాద ఘటన వివరాలు.
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ సమీపంలోని చెట్టికులంకు చెందిన రవీంద్రన్ (55) కూలీ. ఆయనకు భార్య శాంతి, పిల్లలు సుభాషిణి(23), కార్తీక(18)ఉన్నారు. భార్య శాంతి స్థానికంగా ఓ సూపర్ మార్కెట్లో పనిచే స్తోంది. దంపతులు ఇరువురు కూలీలైనప్పటికీ, తమ పిల్లల్ని మాత్రం విద్యా వంతుల్ని చేశారు. రేయింబవళ్లు శ్రమించి సుభాషిణిని బీఎస్సీ చదివించారు. కార్తీక ప్లస్ టూ పరీక్షలు రాసింది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రేమ పెళ్లి చేసుకున్న సుభాషిణి ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. బీఎస్సీ పూర్తి చేసిన సుభాషిణి ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమైంది.
మాని మడైలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునే సమయంలో ఆ సెంటర్ యజమాని గోవిందన్ ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని సుభాషిణి తల్లిదండ్రులు చూశారు. సుభాషిణిని మందలించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని లేని పక్షంలో తామే ఓ మంచి వాడిని చూసి పెళ్లి చేస్తామని హితవు పలికారు. ప్రేమ వలలో పడ్డ సుభాషిణి పట్టించుకోకుండా గత వారం వెళ్లిపోయింది. ప్రియుడు గోవిందన్‌తో కలసి మదురైలో ప్రత్యక్షమైంది. అక్కడ ఈ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులతోపాటు చెల్లెలు కార్తీకను కుంగదీశాయి. దీంతో బుధవారం ఉదయం ఆ కుటుంబ సభ్యులు కూడా విగతజీవులయ్యారు.
బుధవారం ఉదయం శాంతి సోదరుడు పెరుమాల్ చెట్టికులంకు రావడంతోనే ఆ ముగ్గురు మరణించిన విషయం వెలుగు చూసింది. తలుపు ఎంతగా తట్టినా సోదరి తెరవక పోవడంతో అనుమానం వచ్చిన పెరుమాల్ ఇరుగు పొరుగు వారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ల నుంచి కూడా సరైన సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగుల కొట్టగా, శవాలు కుళ్లిన వాసన వచ్చింది. లోనికి వెళ్లి చూడగా ఓ గదిలో శాంతి, కార్తీక ఉరి వేసుకుని వెలాడుతుండటం కనిపించింది. దీంతో ఒక్క సారిగా ఆ పరిసరాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. మరో గదిలో రవీంద్రన్ సైతం ఉరివేసుకుని వేలాడుతుండడం బయట పడింది. మృత దేహాల నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో వీరు మరణించి ఒక రోజుకు పైగా అవుతోన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాల్ని మార్చురీకి తరలించారు. రేయింబవళ్లు కష్టపడి పెంచినందుకు ఆ కుటుంబానికి పెద్ద కుమార్దె మంచి బహుమతే ఇచ్చి వెళ్లిందని ఇరుగు పొరుగు వారు శాపనార్థాలు పెట్టారు.