బాలికపై ఓ కామాంధుడు నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన బుధవారం వెలుగు చూసింది.
చింతలపూడి(పశ్చిమగోదావరి జిల్లా): బాలికపై ఓ కామాంధుడు నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని డగ్లస్ మెమోరియల్ హోం (శరణాలయం)లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 12 ఏళ్ల బాలిక నాలుగేళ్లుగా ఆశ్రయం పొందుతోంది.
స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. డీఎంసీ హోం సంరక్షకుడు శ్యామన్‌సన్‌బాబు ఆమెపై కన్నేశాడు. నెల రోజులుగా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మాట వినకపోతే కొట్టడం, దుర్భాషలాడటం, అర్ధరాత్రి నిద్రలేపి ఆయన ఉంటున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నెల రోజుల్లో అనేకసార్లు తనను గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొంది.
ఈ నెల 24న కూడా బాలికపై అత్యాచారం చేయగా, బుధవారం ఆమె హోమ్ నుంచితప్పించుకుని చింతలపూడి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లలపై అత్యాచార నిరోధక చట్టం(ఫోక్స్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదానాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.