ఎనిమిది రోజులైనా లభించని శ్రీనివాస్ ఆచూకీ
గుంటూరు: నైజీరియాలో కిడ్నాప్ కు గురైన శ్రీనివాస రావు (26) ఆచూకీ ఇంకా లభించలేదు. చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గతవారం నైజీరియాలో కిడ్నాప్ కు గురయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
టంగుటూరి శేషయ్య, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు ఎంబీఏ పూర్తి చేసి రెండున్నరేళ్లుగా నైజీరియాలోని మెరిట్ నైజీరియా లిమిటెడ్‌కు చెందిన లెగసీ అనే నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్టోబర్ 7వ తేదీన అతనికి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే అతను గుంటూరుకు వచ్చాడు. అనంతరం ఆ కార్యక్రమాన్ని ముగించుకుని శ్రీనివాస్ అక్టోబర్ 30 వ తేదీన నైజీరియా వెళ్లాడు. అతనితో పాటు ఉంటున్న ముగ్గురు పాకిస్థానీయులు కూడా కిడ్నాప్ కు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచడం మాత్రం కలవరపెడుతోంది.