నైజీరియాలో తెలుగు యువకుడు కిడ్నాప్
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన యువకుడు నైజీరియా దేశంలో కిడ్నాప్ అయ్యూడు. అతని స్నేహితుల నుంచి మంగళవారం ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన టంగుటూరి శేషయ్య, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు(26) ఎంబీఏ పూర్తి చేసి రెండున్నరేళ్లుగా నైజీరియాలోని మెరిట్ నైజీరియా లిమిటెడ్‌కు చెందిన లెగసీ అనే నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్టోబర్ 7వ తేదీన అతనికి నిశ్చితార్థం జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరావు అక్టోబరు 30 తేదీన తిరిగి నైజీరియా వె ళ్లాడు. అతనితోపాటు మరో ఇద్దరు పాకిస్తానీయులు ఒకే గదిలో ఉంటున్నట్టు సమాచారం. వారం రోజుల క్రితం (నవంబరు 26) రాత్రి ఇంటిలో ఉండగా ఈ ముగ్గురు కిడ్నాప్ కాగా ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. చివరకు మంగళవారం స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. శ్రీనివాసరావును నైజీరియా తీసుకువెళ్లిన వ్యక్తిని ఫోన్‌లో విషయం అడుగగా తనకు కూడా ఇప్పుడే తెలిసిందని చెప్పినట్టు బంధువులు తెలిపారు. వెంటనే జిల్లా ఎస్పీని కలసి తమ కుమారుడ్ని విడిపించాల్సిందిగా వారు కోరారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణతో మాట్లాడారు. నైజీరియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడి సత్వరం విడుదలయ్యేలా చూడాలని కోరారు. శ్రీనివాసరావు ఉంటున్న భవనానికి చుట్టూ నలుగురు సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తుంటారని తెలుస్తోంది. అటువంటి భద్రత ఉన్న భవనంలో ఉండేవారు కిడ్నాప్ అవ్వటం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తానీయుల కోసం వచ్చిన ఆగంతకులు వారితో ఉంటున్న శ్రీనివాసరావును కూడా పొరపాటున తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.