జిల్లాలో 125 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: గంటా
విశాఖపట్నం: హదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 125 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి ఆపద సంభవించిన వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో 11 మండలాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. నావీ, పోలీసుల సహాయం తీసుకుంటున్నామన్నారు. పరిస్థితులను బట్టి నెవీ బోట్లను ఉపయోగించుకుంటామన్నారు. తుపాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయని గుర్తు చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశంముందన్నారు. విలేకరి ఎంసెట్ పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ సెకెండ్ కౌన్సెలింగ్పై ముందుకెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని గంటా తెలిపారు.