* 13వ ఆర్థిక సంఘం నిధులపై కన్ను
* తాము సూచించిన పనులే చేపట్టాలని సర్పంచ్‌లకు హుకుం
* తేడా వస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ హెచ్చరికలు
* అభివృద్ధి పనులు తామే చేయించామని చెప్పుకునే ప్రయత్నం
భీమవరం : జిల్లాకు విడుదలైన 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేల కన్ను పడింది. తాము చెప్పిన పనులే చేపట్టాలని వారు సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే చెక్ పవర్ రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లాలో 884 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం కింద రూ.64 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సర్పంచ్‌లు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు.
జిల్లాలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేని పరిస్థితి. దీంతో స్థానికంగా ఇప్పటికే వారిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలైన ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు తామే చేయించామని చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు శతథా ప్రయత్నిస్తున్నారు. తమ అధికారాన్ని ఉపయోగించుకుని సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లను నయానో భయానో బెదిరించి తాము సూచించిన పనులే చేపట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.
మండలాల వారీగా సమావేశాలు
నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మండలాల వారీగా మండల పరిషత్ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శిలు, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌లు తమను కాదని ఇష్టానుసారంగా పనులు చేపడితే చెక్ పవర్‌ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. డెల్టాలోని ఒక ఎమ్మెల్యే ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని పదే పదే సర్పంచ్‌లకు నొక్కి చెప్పారు. తమను కాదని సర్పంచ్‌లకు అధికారులు సహకరిస్తే వారి సంగతి చూస్తానని బెదిరించడంతో సమావేశంలో పాల్గొన్నవారు ఖిన్నులయ్యారు.
అదే నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మరో నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మాది.. మేం ఏం చేసినా చెల్లుతుంది. ఏ సర్పంచైనా వచ్చిన నిధులతో మేం చెప్పినట్టు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలూ వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా సర్పంచ్‌లంతా పంచాయతీలకు నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులపై అధికారమంతా ఆయా గ్రామ పంచాయతీలకే ఉంటుందని వీటిపై ఎమ్మెల్యేల పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిధులతో చేపట్టే పనులు ఆయా గ్రామసభలు తీర్మానం అనుసరించి చేపట్టాల్సి ఉంటుందని దీనిపై ఎమ్మెల్యేలకు ఏ విధమైన సంబంధం లేదని సర్పంచ్‌ల ఛాంబర్ జిల్లా నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు, సర్పంచ్‌ల మధ్య వివాదం నెలకొంది.
ఎమ్మెల్యేలా.. మజాకా
Published Sat, Nov 15 2014 1:51 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement