Check power cancel
-
పార్టీ మారలేదని...
పొదలకూరు: పార్టీ మారలేదని వేధింపులకు గురిచేస్తూ మంత్రి సోమిరెడ్డి తన చెక్‌పవర్ రద్దు చేయించారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్పంచ్, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తెనాలి నిర్మలమ్మ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా టీడీపీలో చేరాలని మంత్రి పరోక్షంగా సంకేతాలు ఇస్తూ వచ్చారన్నారు. అయితే తాము ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. దీంతో దళిత మహిళా సర్పంచ్‌నైన తనపై వేధింపులను మొదలు పెట్టి, టీడీపీకి చెందిన ఎంపీటీసీ, వార్డుసభ్యులతో డీపీఓకు ఫిర్యాదు చేయించి డీఎల్పీఓ వద్ద విచారణ జరిపించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు తేల్చినా మంత్రి నెలరోజులుగా జిల్లా స్థాయి అధికారిపై ఒత్తిడి తెచ్చి చెక్‌పవర్ రద్దు చేయాల్సిందిగా ఆదేశించారన్నారు. ఈ క్రమంలో డీపీఓ ఉత్తర్వులు ఇచ్చినట్టు తమకు తెలిసిందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షలు,ఇతర నిధులు రూ. 51 లక్షలు దుర్వినియోగం చేశామని చూపుతూ చెక్‌పవర్ రద్దు చేసినట్టు ఉత్తర్వుల్లో చూపారన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుకు సంబంధించి ప్రతి అంశంపై రికార్డులను చూపామని, తాను ప్రతిదీ పరిశీలించి సంతకం చేశానన్నారు. రూ.51 లక్షల్లో విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారని చూపుతూ చెక్‌పవర్ తొలగించారన్నారు. ఇది రాజకీయకక్ష సాధింపులో భాగమన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ సర్పంచ్ అవినీతిని నిరూపిస్తే తాను కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచ్ భర్త డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ పొదలకూరులో మూడు దశాబ్దాలుగా తాను పేదల డాక్టర్‌గా పేరు సంపాదించుకున్నట్టు తెలిపారు. తాను సంపాదించుకోవాలంటే ప్రాక్టీసు ద్వారా ఎప్పుడో రూ.కోట్లు ఆర్జించవచ్చన్నారు. పేదలకు సేవచేసిన భాగ్యంతో ప్రజలు 2,300 ఓట్ల మెజారిటీ అందించారన్నారు. ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని అవినీతికి పాల్పడే ప్రశ్నేలేదన్నారు. ఉపసర్పంచ్ సోమా అరుణ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలా.. మజాకా
* 13వ ఆర్థిక సంఘం నిధులపై కన్ను * తాము సూచించిన పనులే చేపట్టాలని సర్పంచ్‌లకు హుకుం * తేడా వస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ హెచ్చరికలు * అభివృద్ధి పనులు తామే చేయించామని చెప్పుకునే ప్రయత్నం భీమవరం : జిల్లాకు విడుదలైన 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేల కన్ను పడింది. తాము చెప్పిన పనులే చేపట్టాలని వారు సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే చెక్ పవర్ రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లాలో 884 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం కింద రూ.64 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సర్పంచ్‌లు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేని పరిస్థితి. దీంతో స్థానికంగా ఇప్పటికే వారిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలైన ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు తామే చేయించామని చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు శతథా ప్రయత్నిస్తున్నారు. తమ అధికారాన్ని ఉపయోగించుకుని సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లను నయానో భయానో బెదిరించి తాము సూచించిన పనులే చేపట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. మండలాల వారీగా సమావేశాలు నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మండలాల వారీగా మండల పరిషత్ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శిలు, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌లు తమను కాదని ఇష్టానుసారంగా పనులు చేపడితే చెక్ పవర్‌ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. డెల్టాలోని ఒక ఎమ్మెల్యే ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని పదే పదే సర్పంచ్‌లకు నొక్కి చెప్పారు. తమను కాదని సర్పంచ్‌లకు అధికారులు సహకరిస్తే వారి సంగతి చూస్తానని బెదిరించడంతో సమావేశంలో పాల్గొన్నవారు ఖిన్నులయ్యారు. అదే నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మరో నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మాది.. మేం ఏం చేసినా చెల్లుతుంది. ఏ సర్పంచైనా వచ్చిన నిధులతో మేం చెప్పినట్టు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలూ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్పంచ్‌లంతా పంచాయతీలకు నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులపై అధికారమంతా ఆయా గ్రామ పంచాయతీలకే ఉంటుందని వీటిపై ఎమ్మెల్యేల పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిధులతో చేపట్టే పనులు ఆయా గ్రామసభలు తీర్మానం అనుసరించి చేపట్టాల్సి ఉంటుందని దీనిపై ఎమ్మెల్యేలకు ఏ విధమైన సంబంధం లేదని సర్పంచ్ల ఛాంబర్ జిల్లా నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు, సర్పంచ్ల మధ్య వివాదం నెలకొంది.