లక్ష్మీపురం(గుంటూరు): తల్లీదండ్రుల ముద్దు మురిపాలు తీరకుండానే ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్లిపీటలు ఎక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కనబెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహ బంధంలోకి నెట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఎన్నిచట్టాలు చేసినా, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బాల్యవివాహాలను అరికట్టలేకపోతున్నారు. సహకరించని ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు ముఖ్యంగా పిల్లలను బాల్యవివాహాల వైపు దారి తీస్తున్నాయి. బాల్య వివాహాల వల్ల ప్రధానంగా చిన్నతనంలోనే గర్భిణులు కావడంతో గర్భంలో ఉన్న బిడ్డ బరువు సరిపోక, పోషకాహారం సరిగా లేక తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. బాల్య వివాహలకు ప్రోత్సహించే వారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ఇలా..
ది ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజస్ రూల్స్ 2012 రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుంది, భారతదేశ పౌరులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలికంగా నివసిస్తున్న, విదేశీయులందరికీ, వారి కుటుంబాలకు, అమలు జరిపే సంస్థలకు ప్రభుత్వానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రధానంగా జిల్లా కలెక్టర్ జిల్లా మొత్తానికి సీఎంపీవో (చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారిగా) వ్యవహరిస్తారు. డివిజనల్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ సీఎంపీవోగా వ్యవహరిస్తారు. ప్రాజెక్ట్ స్థాయిలో 3 నుంచి 5 మండలాల్లో బాలల అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారులుగా ఉన్నవారు సీఎంపీవోగా పని చేస్తారు. మండల స్థాయిలో తమ కింద ఉన్న గ్రామాల్లో తహసీల్దార్లు సీఎంపీవోలుగా పని చేస్తారు. గ్రామాలలో ఐసీడీఎస్ పర్యవేక్షణ అ«ధికారులు సీఎంపీవోలుగా పని చేస్తారు. గ్రామ స్థాయిలో పంచాయితీ రాజ్ శాఖలో పని చేసే పంచాయితీ సెక్రటరీలు, రెవెన్యూ శాఖలో పని చేసే గ్రామపాలన అధికారులు సీఎంపీవోలుగా పనిచేస్తారు.
విస్తృత అధికారాలు..
ఈ చట్టం కింద బాల్య వివాహాల నిరోధక అధికారులు ఒక పోలీసు అధికారికున్న అధికారాలతో పాటు, దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉంటారు. కేసుల్లో ఇద్దరి కుటుంబాలను పిలిపించే అధికారం సాక్షులను పిలిపించి వారి నివేదికలను రికార్డు చేసే అధికారం, నేరం చేసిన వారిపై కేసులు పెట్టే అధికారం ఉంటుంది. ఆ నివేదికలపై ఆధారపడే వాటిని సాక్షాధారాలుగా పరిగణించి తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. ఈ చట్టానికి లోబడి బాల్య వివాహా నిరోధక అధికారులు, తాము చేసే పనుల్లో పోలీసులు సహాయ, సహకారాలతో తమ విధులను నిర్వర్తించాలి. అందుకు పోలీసులు తమ సహకారాన్ని తప్పక అందించాలి. ప్రతి ఒక్క బాల్య వివాహ నిషేధ అధికారి తన పరిధిలో జరుగుతున్న, జరగబోతున్న బాల్య వివాహం ఆపడానికి వెంటనే పోలీసులకు, ఉన్నతా«ధికారులకు తెలియజేయాలి. ఈ విషయంపై చర్య తీసుకొని అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
ప్రతి గ్రామంలో ఓ కమిటీ..
ప్రతి గ్రామంలోనూ ఈ చట్టాన్ని దాని నియమ నిబంధనలను అమలు చేయడానికి పర్యవేక్షణ చేయడానికి సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో అధ్యక్షుడిగా గ్రామ సర్పంచి, సభ్యులుగా గ్రామ కార్యదర్శి, రెవెన్యూ శాఖ గ్రామపాలనాధికారి, స్థానిక స్కూల్ టీచర్, గ్రామ సమాఖ్య, స్వయం సహాయక సంఘం సభ్యులు, ఎన్నికైన మహిళా పంచాయతీ సభ్యురాలు, ఏఎన్‌ఎం, స్థానికంగా పని చేస్తున్న స్వచ్ఛంధ సంస్థ, యువ సమాఖ్య సభ్యుడు, స్త్రీ సభ్యురాలు, గ్రామాధికారులు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, కన్వీనర్‌గా ఉంటారు.
బాల్య వివాహం జరిగితే తీసుకునే చర్యలు..
వివాహానికి హజరైన వారు, సహాయపడిన వారు, ప్రోత్సాహించిన వారు, వివాహాన్ని జరిపించిన వారు, నిర్వహించిన వారు, మద్దతు ఇచ్చిన వారు, వివాహం ఏర్పాట్లకు బాధ్యత వహించిన వారందరితో పాటు వివాహం జరిపించే ఆ సామాజిక వర్గ పండితులను అందరి పేర్లతో ఒక నివేదికను సిద్ధం చేసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ సంక్షేమ సంఘం అందుబాటులో లేనట్లయితే ఆమె, అతని భద్రత, సంరక్షణ గురించి సరైన నిర్ణయం తీసుకోవడం కోసం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందుహజరుపరచాలి.
తప్పుడు ఆధారాలతో బాల్య వివాహాలుచేస్తే చర్యలు తప్పవు..
బాల్యవివాహాలు చేసే వారు ప్రధానంగా ఆధార్‌కార్డుపై ఉండే వయస్సు ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఆధార్ నమోదు కార్డుపై తేదీలను వయస్సును మారుస్తున్నారు. అందుకే కచ్చితంగా పదోతరగతి ఉత్తీర్ణత అయిన సర్టిఫికెట్‌పై ఉండే వయస్సు ప్రకారం మైనర్, మేజర్ అనేది చూడవచ్చని అధికారులు చెబుతున్నారు.
బాల్యవివాహాలను అడ్డుకుంటాం
గుంటూరు జిల్లాలో ఏప్రిల్ నెలలోను సుమారు 15 బాల్య వివాహాలను అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చాం. గ్రామాల్లో పెద్దలు, పంచాయతీ కార్యదర్శి, అధికారులు అందరు కలిసి బాల్య వివాహలను ప్రోత్సహించకూడదు. చిన్న వయస్సులో వివాహం జరిగి గర్భశ్రావం అయితే రక్తహీనతతో మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చదువుతో పాటువారి భవితవ్యంపై గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.-శ్యామసుందరి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖా ప్రాజెక్ట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment