ప్రతీకాత్మక చిత్రం
ఆడ పిల్ల పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. అవును మా అమ్మ పుట్టింది..కాదండీ అంతా మా నాన్న పోలిక. ఉప్పొంగిన తల్లిదండ్రుల ఆప్యాయత ఇది. క్రమేణా వీరి అమృతమంటి ప్రేమతోపాటు పసిబిడ్డా ఎదిగింది ఆడపిల్లగా.. ఇదిగో భయం.. అమ్మ అనురాగం ఆందోళన పడింది.. మమకారం నిండిన నాన్న గుండె బరువెక్కింది. ‘మంచి సంబంధం వచ్చింది. ఎన్ని రోజులు ఉంచినా ఆడ పిల్ల మనపిల్ల కాదే’.. ‘అవునండీ. ఆ...డపిల్లే.. పిల్ల చదువు మరి’.‘.ఆడ పిల్లకు చదువెందుకే’ .. రేనండీ’.. అదిగో బాల్యం మెడలో పడిన తాళి ఆలిని చేసింది. మెట్టినింట బానిసగా మార్చేసిన అజ్ఞానకేళి వెర్రిగా నవ్వింది.
గుంటూరు(ఎస్‌వీఎన్‌కాలనీ): జిల్లాలో బాల్య వివాహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి పేదరికం, అజ్ఞానం, ప్రేమ పెళ్లిళ్లు, మూఢ నమ్మకాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ వద్ద నమోదైన ఫిర్యాదుల్లో 7 నుంచి 11వ తరగతిలోపు, 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సామాజిక పరిరక్షణ పేరుతో బాల్య వివాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది.
శాఖల మధ్యసమన్వయలోపం
పసితనానికి మాంగల్య బంధం పడటానికి ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమే. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఉండేది గ్రామ పంచాయతీలకే. వీరు కనీసం తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిం చడం లేదు. పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఇందుకు కారణ. సర్పంచ్‌లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ సెక్రటరీలతోపాటు ఉన్నతాధికారులు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడం లేదు. తాంబూలాలు మార్చుకుని తీరా వివాహానికి సిద్ధమైన రోజు గ్రామంలో ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థలకు, ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారమిస్తున్నారు. ఆ సమయంలో అధికారులు స్పందించి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా డబ్బులు పోగు చేసుకుని పెళ్లికి సిద్ధమైన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు.
సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. వీరిలో 58 శాతం 19 ఏళ్లు కూడా నిండకుండానే తల్లులవుతున్నారు. యంగ్ లైవ్స్ ఇండియా, చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఫౌండేషన్, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ సంయుక్త అ«ధ్యయనంలో వెల్లడైన చేదు నిజా లివి. 15 ఏళ్ల తరువాత కూడా చదువును కొనసాగించిన అమ్మాయిలతో పోల్చితే ఈలోపు చదువు ఆపేవారే ఎక్కువగా బాల్య వివాహాలకు లోనవుతున్నారు. బాల్య వివాహాల్లో పురుషుల కేవలం 2 శాతం మాత్రమే.
బాల్య వివాహానికి హాజరయ్యే వారూ శిక్షార్హులే
బాల్య వివాహానికి హాజరయ్యే వారందరూ శిక్షకు అర్హులేనని చట్టం చెబుతోంది. తమిళనాడులో ఓ బాల్య వివాహంలో పెళ్లి వీడియో ద్వారా దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు వివాహ వయసు నిర్ణయించింది. అతిక్రమిస్తే నేరానికిగాను రెండేళ్లు కారాగార శిక్ష, లక్ష జరిమానా విధిస్తుంది. పెళ్లి చేసిన, పెళ్లి చేసుకున్న, పౌరహిత్యం జరిపిన, వేదిక ఇచ్చిన, ప్రోత్సహించిన సంస్థలకూ శిక్ష వర్తిస్తుంది. చట్టంలో వధువుకు, వధువు తల్లికి, తండ్రికి శిక్ష వర్తింపు మినహాయింపు ఉంటుంది.
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
బాల్య వివాహాలు ఆపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, పురోహితులు ఇందుకు ముఖ్యపాత్ర పోషించాలి. పెళ్లి రోజు వరకు రాకుండా ముందస్తుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. లేదంటే అధికారులకు సమాచారమివ్వాలి. మా వంతుగా అంగన్‌వాడీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.– శ్యామసుందరి, పీడీ ఐసీడీఎస్
Comments
Please login to add a commentAdd a comment