చిలుకూరు, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ పల్స్‌పోలియోను 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు విడతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయిలో 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. అలాగే కేంద్రంలో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 20,21 తేదీలలో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 5ఏళ్ల లోపు 3,69,905 మంది పిల్లలను గుర్తించారు. 100 శాతం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాకు 5లక్షల వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి. వీటిని రెండు రోజుల్లో మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయనున్నారు.
అదనంగా 33 కేంద్రాల ఏర్పాటు
ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 3004 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 2971 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది మరో 33 కేంద్రాలను అదనంగా పెంచారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు ,స్వచ్చంద్ర సేవా సంస్థలు వారు, ఉపాధ్యాయులు మొత్తం 11,884మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారి, జిల్లా అధికారులతో 6 జిల్లా కోర్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరు ఆ రోజు కేంద్రాలను పరిశీలిస్తారు. వీరితో పాటు జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో ఆయా ఎస్‌పీహెచ్‌ఓ(ప్రత్యేక వైధ్యాదికారులు)లు పరిశీలిస్తారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల్లో వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు ఏర్పాటు చేశారు.
పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అమోస్, జిల్లా వైద్యాదికారి
పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలి. ఇప్పటికే పల్స్‌పోలియోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 5 ఏళ్ల లోపు పిల్లలు 3,69,905 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వారికి పోలియో చుక్కలు వేసేందుకు సుమారుగా 12 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులు బాద్యతగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలి.
19న పల్స్‌పోలియో
Published Fri, Jan 17 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement