నెలరోజుల్లో నష్టపరిహారం ఇవ్వాలి
Published Thu, Dec 5 2013 3:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: తుపానుల వలన నష్టపోయిన రైతులకు నెలరోజుల లోపు నష్టపరిహారం ఇవ్వాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందజేసే అధికారం కట్టబెట్టాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు విజయరామరాజు డిమాండ్ చేశారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో బుధవారం నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపానులకు నష్టపోయిన రైతులకు ఏడాది తర్వాతగాని పరిహారం అందడం లేదన్నారు. అందువల్ల వారిని ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయించాలని కోరారు.
కోనసీమలో కొబ్బరి తోటల్లో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వెంటనే వాటికి కూడా నష్టపరిహారాన్ని అందించాలని, అరటితోటలకు కూడా ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో రైతులను ఆదుకునేందుకు జిల్లా రైస్ మిల్లర్స్ కొంత నిధులు ఇచ్చేవారని, అవి కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుల నుంచి వసూలు చేస్తున్న సెస్ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరిపోతుందని, అలా కాకుండా ఎక్కడ వసూలు చేసిన సెస్ అక్కడ రైతులకు నష్టపరిహారంగా అందివ్వాలన్నారు.
రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు మెంటే పద్మనాభం మాట్లాడుతూ తుపానుల కారణంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఏ విధంగా నష్టపరిహారం అందిస్తున్నామో, అదే విధంగా రైతుకు కూడా వెంటనే పరిహారాన్ని అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు వైట్ల విద్యాధరరావు, భూపతిరాజు పాండురంగరాజు, మేళం దుర్గాప్రసాద్, గాదిరాజు నాగేశ్వరరాజు, నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు, లంకా కృష్ణమూర్తి తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం చేసిన తీర్మానాల నివేదికలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు అల్లూరి సత్యనారాయణరాజు, మెంటే సోమేశ్వరరాజు, మల్లారెడ్డి శేషుమోహన రంగారావు, శిరిగినీడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement