రామభద్రపురం(తెర్లాం రూరల్) : పార్వతీపురం డివిజన్‌లో ఏర్పాటుచేసిన 86 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) రోణంకి గోవిందరావు చెప్పారు. ఆయన బుధవారం రామభద్రపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పార్వతీపురం డివిజన్‌లోని 2,957 మంది రైతుల నుంచి రూ.31.86 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. రైతులకు డబ్బు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులకు కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. పార్వతీపురం డివిజన్‌లో 12 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలోని పీఆర్ డిపోల్లో 41 డీలర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తప్పుడు కులధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు : ఆర్డీవో
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తిపై దర్యాప్తు చేస్తున్నామని ఆర్డీవో గోవిందరావు తెలిపారు. రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన పీవీ మల్లికార్జునరాజు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇటీవల ఆయనపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగంలో చేరాడని గుర్తించారన్నారు. దీనిపై తనను దర్యాప్తు అధికారిగా కలెక్టర్ నియమించారని తెలిపారు. ఆయన ఎస్టీ కాదని తమ దర్యాప్తులో తేలిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.
లోకాయుక్త ఫిర్యాదుపై దర్యాప్తు
తనకు రామభద్రపురం తహశీల్దార్, వీఆర్‌వోలు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని రొంపిల్లి గ్రామానికి చెందిన బి.నీలకంఠరాజు లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. తహశీల్దార్ ఎం.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
Published Wed, Dec 30 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement