parvathipuram Division
-
ఏకలవ్య.. వసతులేవయ్యా..!
పార్వతీపురం: ఏకలవ్య పాఠశాలలంటే ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండేవి. ఇందులో సీటు కావాలంటే ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి సిఫార్సులు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 2017లో కేంద్రప్రభుత్వం ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకోసం ఒక్కోదానికి రూ.12 కోట్ల చొప్పున రాష్ట్రంలో పది పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు అన్ని జిల్లాల్లోనూ తాత్కాలిక భవనాల్లో హడావుడిగా వీటిని ప్రారంభించారు. అప్పట్లో ఆరో తరగతి ప్రవేశానికి విద్యార్థులు లేకపోవడంతో గురుకులాల నుంచి కొందరిని, గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి కొందరిని తెచ్చి వీటిలో ప్రవేశాలు కల్పించారు. ఉద్యోగుల క్వార్టర్లలో తరగతులు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కురుపాంనకు ఒక ఏకలవ్య పాఠశాల మంజూరైంది. దీనిని 2017లో కురుపాంలో ప్రారంభించాల్సి ఉండగా.. భవనాలు అందుబాటులో లేక పార్వతీపురం చాకలి బెలగాంలో అప్పట్లో నడుస్తున్న కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో కొన్ని గదులను తీసుకుని హడావుడిగా ప్రారంభించారు. ఈ ఏడాది గురుకుల పాఠశాలను కురుపాంనకు తరలించడంతో ఖాళీ అయిన ఈ భవనానికి పార్వతీపురం బైపాస్ రోడ్డులో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను తరలించారు. ఒక వైపు బాలుర పాఠశాల నడుస్తుండటం.. అదే ప్రాంగణంలో మరో పక్క బాలికల ఏకలవ్య పాఠశాలను కొనసాగిస్తుండటంతో ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు.. బాలికల ఏకలవ్య పాఠశాలను ఐటీడీఏ ఉద్యోగుల కోసం నిర్మించిన నివాసగృహాల(క్వార్టర్సు)లోకి తరలించారు. అక్కడ రెండు గదుల్లో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాలమైన గదుల్లేకపోవడంతో పిల్లలు వంటగదుల్లో సైతం కూర్చోవాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల కరువు ఏకలవ్య పాఠశాలలు కొత్తగా మంజూరయితే.. వాటికి అవసరమైన అ«ధ్యాపకులతో పాటు విద్యార్థులకు బెంచీలు, ఉపాధ్యాయులకు కుర్చీలు మొదలుకుని.. రికార్డుల నిర్వహణకు బీరువాలు, బోర్టులు, టేబుళ్లు వంటి మౌలికవసతులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఒక్క కుర్చీ కూడా మంజూరు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు బలవంతంగా తెచ్చి ఇక్కడ పనిచేయిస్తున్నా.. ఎలాంటి సౌకర్యాలూ కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్ఎంను కూడా నియమించలేదు. పుస్తకాలెక్కడ? విద్యాసంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. పార్వతీపురం ఏకలవ్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు 80 మంది వరకూ ఉండగా వారికి నేటికీ తెలుగు, సోషల్ సబ్జెక్టుల పుస్తకాలు అందలేదని చెబుతున్నారు. ఈ పాఠశాలల్లో ఇదివరకు స్టేట్ సిలబస్‌నే బోధించేవారు. ప్రస్తుతం సీబీఎస్ఈ సిలబస్‌ను బోధించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ఇంగ్లిష్‌లో బోధించగల అధ్యాపకులను కేటాయించాలి. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక్కడున్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేస్తున్నారు. బెంచీలు, కుర్చీలు కూడా లేవు పాఠశాలల్లో ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదు. ఉపాధ్యాయులు కూర్చునేందుకు కుర్చీలు, విద్యార్థులకు బెంచీల్లేవు. శాశ్వత భవనాలు కూడా లేవు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పిస్తే మంచి విద్యనందించగలం. ప్రస్తుతం ఇక్కడ వ్యాయామ, సోషల్ ఉపాధ్యాయులు, ఆఫీస్ సబార్డినేట్, కుక్, వాచ్‌మేన్ వంటి సిబ్బందిని నియమించాలి. –హేమలత, ప్రిన్సిపల్, ఏకలవ్య పాఠశాల, పార్వతీపురం ఒత్తిడికి గురవుతున్నాం మాకు ఏడో తరగతికి సంబంధించి తెలుగు, సోషల్ సబ్టెక్టుల పాఠ్యపుస్తకాలు ఇంకా ఇవ్వలేదు. ఒక్కసారిగా సీబీఎస్ఈ సిలబస్‌కు మార్చడంతో ఒత్తిడికి గురవుతున్నాం. పాఠశాల ఒక చోట, వసతి మరో చోట ఉండటంతో రోజూ తిరగడం ఇబ్బందిగా ఉంది. – బిడ్డిక అలేఖ్య, విద్యార్థిని, 7వ తరగతి న్యాయపరమైన సమస్యల వల్లే ఇబ్బంది ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవగా కొంతమంది కాంట్రాక్టర్లు తమకు అన్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టునాశ్రయించారు. దీంతో ఎక్కడా భవన నిర్మాణాలు ప్రారంభంకాలేదు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్లరాదన్న ఉద్దేశంతో తాత్కాలిక భవనాల్లో తరగతులను ప్రారంభించాల్సి వచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపుతో పాటు.. మౌలిక వసతులను మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ జి.లక్ష్మిశ, ఐటీడీఏ పీవో, పార్వతీపురం -
22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రామభద్రపురం(తెర్లాం రూరల్) : పార్వతీపురం డివిజన్లో ఏర్పాటుచేసిన 86 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) రోణంకి గోవిందరావు చెప్పారు. ఆయన బుధవారం రామభద్రపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పార్వతీపురం డివిజన్లోని 2,957 మంది రైతుల నుంచి రూ.31.86 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. రైతులకు డబ్బు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులకు కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. పార్వతీపురం డివిజన్లో 12 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలోని పీఆర్ డిపోల్లో 41 డీలర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు : ఆర్డీవో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తిపై దర్యాప్తు చేస్తున్నామని ఆర్డీవో గోవిందరావు తెలిపారు. రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన పీవీ మల్లికార్జునరాజు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇటీవల ఆయనపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగంలో చేరాడని గుర్తించారన్నారు. దీనిపై తనను దర్యాప్తు అధికారిగా కలెక్టర్ నియమించారని తెలిపారు. ఆయన ఎస్టీ కాదని తమ దర్యాప్తులో తేలిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. లోకాయుక్త ఫిర్యాదుపై దర్యాప్తు తనకు రామభద్రపురం తహశీల్దార్, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని రొంపిల్లి గ్రామానికి చెందిన బి.నీలకంఠరాజు లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. తహశీల్దార్ ఎం.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్‌కు నీరెలా ?
కొట్టుకుపోయిన షట్టర్లు... పూడుకు పోయిన కాలువలతో ఆనకట్టల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో రైతన్న కంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఖరీఫ్‌కు చుక్కనీరైనా వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాము ఎలా సాగు చేయాలని, ఇప్పటి వరకూ చేసిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి: పార్వతీపురం డివిజన్లోని ఏ ఆనకట్ట, ప్రాజెక్టును చూసినా దయనీయంగా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్ సాగునీరందే అవకాశం ఏ కోశానా కనిపించడంలేదు. గత ఏడాది అక్టోబరులో వచ్చిన తుపాను వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ మూలకు చే రాయి. వాటికి ఈ వేసవి కాలంలో మరమ్మతులు చేస్తేనే ఖరీఫ్ సీజనుకు నీరును ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పటివరకూ అటువంటి పరిస్థితులు కనిపించకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. సీతానగరం, పారాది ఆనకట్టలకు వెంటనే షట్టర్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే నీరు కూడా నిల్వ ఉండదు. సీతానగరం ఆనకట్ట పరిధిలో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి సంబంధించి మూడు షట్టర్లు తుపాను దెబ్బకు పాడైపోయాయి. వాటిని సరిచేయడానికి కూడా ఆస్కారం లేదు. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షలతోప్రతిపాదనలు పంపారు. అలాగే రామభద్రపురం మండలం రొంపల్లి వద్ద ఉన్న పారాది ఆనకట్ట పరిస్థితి కూడా అలాగే ఉంది. దీన్ని నుంచి బొ బ్బిలి, బాడంగి మండలాల్లో 7,218 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎడ మ కాలువ ద్వారా 4,176 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 3,042 ఎకరాలకు సా గునీరు అందుతుంది. వేగావతి నది ఆనకట్టలో దాదాపు 50 షట్టర్లు ద్వారా సా గునీటికి అడ్డుకట్టవేసి కుడి, ఎడమల కాలువ ద్వారా పంపిస్తారు. అయితే ఆనకట్టకు ఉన్న దాదాపు అన్ని షట్టర్లు వరద నీటికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు వీటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. అనుమతులు, డిజైన్ వస్తేనే.. : గతంలో శ్రీకాకుళం జిల్లాలో షట్టర్ల కుంభకోణం జరిగిన తరువాత ఇప్పుడు వీటి ఏర్పాటుపై నీటిపారుదల శాఖాధికారులు నిశితంగా పరిశీస్తున్నారు. విజ యవాడ సమీపాన ఉన్న సీతానగరంలో గల నీటిపారుదలశాఖ మెకానికల్ డివిజన్ అధికారులు అనుమతించిన షట్టర్లను మాత్రమే ఏర్పాటు చేయాలి. అక్కడ నుంచి అనుమతి, డిజైన్ వస్తేగాని ఇక్కడ షట్టర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ రెండు ఆనకట్టలకు ఇంత తొందరగా అనుమతులు లభించి, టెండర్లు పూర్తయి పనులు జరుగుతాయన్న ఆశ అన్నదాతల్లో కనిపిం చడం లేదు.. చెంతనే నీళ్లున్నా.. : నారాయణప్పవలస వద్ద ఉన్న కంచరగెడ్డ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జలాశయం నిర్మాణం పూర్తయినా, ఇప్పటి వరకూ కాలువలు నిర్మించలేదు. దీంతో కళ్లెదురుగా నీళ్లున్నా పంట పోలాలకు చేరే అవకాశం లే క దాదాపు 700 ఎకరాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రెం డు వైపులా కాలువ నిర్మాణానికి రూ.కోటీ 20 లక్షలతో ప్రతిపాదనలు పం పినా అవి మంజూరుకు నోచుకోలేదు.. ఇక వెంగళరాయసాగర్ ఆనకట్ట ఆదనపు జలాలు పరిస్థితి కూడా అలాగే ఉంది. రూ. 11 కోట్ల మంజూరైనా ఇప్పటివరకూ రూ. 30 లక్షల విలువైన పనులనే నిర్వహించారు. భైరవసాగరం వద్ద, కలవరాయి, వాకాడవలస గ్రామాల మధ్య కాలువల నిర్మాణం ప్రారంభించినా అవి ఎప్పటికి పూర్తవుతాయో అంతుపట్టని పరిస్థితి. కాాంట్రాక్టర్లు దీనిపై శ్రద్ధ చూపకపోవడం, సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడానికి రంగంలోనికి దిగడం వంటి సమస్యల వల్ల ఈ జాప్యం ఏర్పడింది. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పక్క నుంచి వయోడెక్ట్ నిర్మాణం చేయాల్సి ఉంది. దానికి భూసేకరణ సమస్య కూడా ఏర్పడింది. దాదాపు ఐదు వేల ఎకరాలకు అందాల్సిన అదనపు జలాలు ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాగే చిత్రకోట బోడ్డవలస వద్ద జలాశయం ఉందన్న సంగతిని కూడా ఇరిగేషన్ అధికారులు మరిచిపోయినట్టున్నారు.. ఈ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి వినియోగంలోకి రాకుండా పడి ఉంది.. -
ఆనందం దక్కేనా..?
నెల్లిమర్ల : ఎయిమ్స్ విద్యా సంస్థల చైర్మన్, టీడీపీ నాయకుడు కడగళ ఆనంద్‌కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. విజయనగరం డివిజన్‌కు సంబంధించి వేరెవరూ ఆ పదవికి పోటీ పడకపోవడంతో ఎమ్మెల్యే లు పతివాడ నారాయణస్వామినాయుడుతో పాటు మీ సాల గీత కూడా ఆయనకే మద్దతు ప్రకటిస్తున్నట్టు స మాచారం. అయితే పార్వతీపురం డివిజన్‌కు చెందిన ఆ పార్టీ నేతలు కొంతమంది ఆయనకు అడ్డు తగులుతున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డివిజన్‌కే ఆ పదవి కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో ఆనంద్‌కుమార్‌కు పదవి దక్కుతుందా.. లేదా అన్నది జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. నెల్లిమర్ల మండలం బొడ్డపేట గ్రా మానికి చెందిన కడగళ ఆనంద్‌కుమార్ స్వయానా నెల్లిమర్ల ఎంపీపీ సువ్వాడ వనజాక్షికి తమ్ముడు. అం తేకాకుండా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్‌కు బావమరిది. ఇటీవల జరిగిన స్థానిక, సా ధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున బాగా పని చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో తన సోదరి గె లుపులో కీలకపాత్ర పోషించారు. కొన్ని పంచాయతీలను దత్తత తీసుకుని పార్టీ గెలుపునకు కృషి చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులో ఆయన ఉన్నట్టు తెలిసింది. విజయనగరం డివిజన్ నుంచి ఈ పదవికి ఎవరూ పోటీ లేకపోవడంతో తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యేలను ఆయన కోరిన ట్టు సమాచారం. వారు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. * అయితే ఇదే పదవి కోసం పార్వతీపురం డివిజన్ నుంచి మరో ఇద్దరు నేతలు పోటీలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి తమ డివిజన్‌కు ఇవ్వాలని ఆ నేతలు పట్టుబడుతున్నట్టు తెలిసింది. * ఈ మేరకు వారిని బుజ్జగించేందుకు విజయనగరం డివిజన్‌కు చెందిన కొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంద్‌కుమార్ పార్టీ కి కావాల్సిన వ్యక్తని, ఈసారికి డ్రాప్ అయిసొమ్మని వారిని వారిస్తున్నట్టు తెలిసింది. -
15న జిల్లాకు సీఎం?
విజయనగరం కంటోన్మెంట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని తెలిసింది. ఈనెల 15న ఆయన జిల్లాలో పర్యటించనున్నారని పలు వర్గాలు వెల్లడించాయి. జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురం డివిజన్లో ఆయన పర్యటించే అవకాశముందని అంటున్నారు. దీనిపై జేసీ రామారావును వివరణ కోరగా ఇంకా కార్యక్రమం ఖరారు కాలేదని తెలిపారు.