సత్తెన్న దర్శనానికి వెళుతూ...
కాకినాడ క్రైం :అన్నవరం సత్యన్నారాయణ స్వామి దర్శనానికి బయల్దేరిన ఆ కుటుంబాల్లో ఓ మృత్యుశకటం విషాదాన్ని నింపింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో బాలిక ప్రాణాలను బలితీసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం...
అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లికి చెందిన తాడికొండ సత్యనారాయణ మూర్తి తోపుడు బండి మీద గాజులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి తమ్ముడు తాడికొండ వెంకటేశ్వరరావు కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. సత్యనారాయణ మూర్తి భార్య సుబ్బలక్ష్మి, పెద్ద కుమార్తె సుభద్ర, చిన్న కుమార్తె కళ్యాణి (13), అతడి తమ్ముడు వెంకటేశ్వరరావు, భార్య శ్రీదేవి, కుమారుడు మణికంఠ, ప్రవల్లిక అంతా కలసి ముమ్మిడివరం మండలం చింతలమెరకకు చెందిన ఆటో డ్రైవర్ మట్టపర్తి త్రిమూర్తులు (35) ఆటోలో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయల్దేరారు.
తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో సామర్లకోట రూరల్ మండలం పవర సెంటర్‌లోకి వచ్చే సరికి విశాఖపట్నం నుంచి కాకినాడ ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ వారి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ త్రిమూర్తులు, సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ఏడుగురు గాయాలపాలయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వారు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న తిమ్మాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ డ్రైవర్‌కు కునుకు పడడంతోనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న తాము పెద్దగా కేకలు వేసినా లారీ డ్రైవర్‌కు వినిపించుకోలేదని సత్యనారాయణ మూర్తి వాపోయాడు.
భయానకంగా సంఘటన స్థలం
ఆటోను లారీ ఢీ కొట్టిన సంఘటన భయానకంగా ఉంది. ఆటో డ్రైవర్ త్రిమూర్తులు ఆటోలో చిక్కుకుని మృతి చెందడం, కళ్యాణి ఆ పక్కనే పడి మరణించడం చూపరులను కలచివేసింది. ఆటోలో డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా ఇద్దరు మాత్రమే మృతి చెందారు.
కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
తమ చిన్న కుమార్తె కళ్యాణి కళ్లెదుటే మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు, అక్క కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్ త్రిమూర్తులు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు చేరుకుని రోదించిన తీరు కలచివేసింది.
హోం మంత్రి పరామర్శ
ఆటోను లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ త్రిమూర్తులు, బాలిక కళ్యాణిల కుటుంబ సభ్యులను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఫోన్‌లో ఆయన వైద్యులకు సూచించారు.
సాకుర్రు గున్నేపల్లిలో విషాదం
అమలాపురం రూరల్ : కాకినాడ రూరల్ మండలం పవర జంక్షన్ సమీపలో జరిగిన రోడ్డుప్రమాదంలో కళ్యాణి(13) అనే బాలిక మృతిచెందడంతో ఆమె స్వగ్రామం అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లిలో విషాదం అలుముకుంది. అమలాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కళ్యాణి మృత్యువాతతో ఆమె కుటుంబసభ్యులు గుండెలవిసేలా విలపించారు.
ఆ కుటుంబం రోడ్డున పడింది
ముమ్మిడివరం : కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం శివారున జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన ఆటోడ్రైవర్ మట్టపర్తి త్రిమూర్తులు కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకొనే త్రిమూర్తులు ఆకస్మిక మృతి ఆ కుటుంబాన్ని కలచివేసింది. ముమ్మిడివరం నగర పంచాయతీ చింతలమెరకు చెందిన త్రిమూర్తులకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు హరిసూర్య చరణ్, కుమార్తె సౌజన్య ఉన్నారు. రోజులాగే ఆటోతో బయలుదేరిన త్రిమూర్తులు అమలాపురం రూరల్ మండలం సాకుర్రు నుంచి అన్నవరం ప్రయాణికులను తీసుకుని ఆదివారం ఉదయం బయల్దేరాడు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద అతడి ఆటోను గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న త్రిమూర్తులు మృతి చెందాడు.