హనుమంతునిపాడు, న్యూస్‌లైన్ : ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహ్మదాపురం సమీపంలోని నంద్యాల, ఒంగోలు హైవేపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మృతి చెందిన వారిలో కడప జిల్లా వేములవాడ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జెల్ల రామాంజనేయమ్మ(55), అనంతపురం జిల్లా గంగంపెంట మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన పెడబల్లి నిర్మలమ్మ(45) ఉన్నారు.
గాయపడిన వారిలో చంద్రహాసన్‌రెడ్డి, లక్ష్మీ దీప్తి, చిట్టెం రామాంజనేయమ్మ, బెరైడ్డి, జి.సుశీలమ్మ, డి.బయమ్మ ఉన్నారు. క్షతగాత్రులను పొదిలి, ఒంగోలు వైద్యశాలలకు తరలించారు. వివరాలు.. జెల్లె రామాంజనేయమ్మ పెద్ద కుమారుడు జెల్ల చంద్రహాసన్‌రెడ్డి కుమార్తె జాహ్నిరెడ్డి పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు దొనకొండ మండలం గంగ దొనకొండ గంగమ్మ దేవస్థానానికి ఓ లారీ, రెండు తుఫాన్ వాహనాల్లో శనివారం రాత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగింది. సమాచరం అందుకున్న కనిగిరి సీఐ సుధాకర్‌రావు, హనుమంతునిపాడు ఎస్సై ఎంఎస్ బేగ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మిన్నంటిన రోదనలు
రామాంజనేయమ్మ సమీప బంధువు నిర్మలమ్మ. ఈమె అనంతపురం జిల్లా నుంచి బంధువుల ఇంటికి వచ్చి ప్రాణాలు కోల్పోయింది. చంద్రహాసన్‌రెడ్డి రామాంజనేయమ్మ పెద్ద కుమారుడు. ఈయన అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె పుట్టు వెంట్రుకలు దేవుని వద్ద తీసేందుకు మొక్కుబడి ఉండటంతో భార్య లక్ష్మీదీప్తి, కుమార్తె జాహ్నిరెడ్డితో కలిసి ఇటీవల స్వదేశానికి వచ్చారు. స్వగ్రామం కడప జిల్లా గుండ్లపల్లికి బంధువులను ఆహ్వానించారు. అందరూ కలిసి గంగదొనకొండ వె ళ్తుండగా ప్రమాదం జరిగింది. తల్లి, బంధువు మృతి చెందడంతో చంద్రహాసన్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ పరారయ్యాడు. సంఘన స్థలం వద్ద దేవుని వద్దకు తీసుకెళ్తున్న పూజ సామగ్రి చెల్లాచదరయ్యాయి.
మొక్కు చెల్లించేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
Published Mon, Dec 9 2013 3:53 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement