సూర్యాపేట, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం అర్ధరాత్రి సినీఫక్కీలో భారీ చోరీ జరి గింది. పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో నిలిచిన బస్సులోనుంచి సుమారు 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఆభరణాల విలువ రూ.6కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని శ్రీయాష్ జువెల్లర్స్ దుకాణంలో దినేష్‌ప్రసాద్, రామేందర్ మురళీ మోహన్‌లు సేల్స్ రిప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్నారు. ఈనెల 21న ఈ ఇద్దరు దుకాణం నుంచి సుమారు 20 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని విక్రయించేం దుకు విజయవాడ వెళ్లారు. అక్కడ బాంబే జువెల్లర్స్ దుకాణంలో సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలను విక్రయించారు.
ఆ దుకాణ యజమాని వద్ద అందుకు గాను కొంత బిస్కెట్ బంగారం, సుమారు రూ.4లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విజయవాడ బస్టాండ్‌లో ఆటోనగర్ డిపో సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. బస్సులో మొత్తం 28మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కోదాడకు రాగానే నలుగురు ప్రయాణికులు దిగారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌కు బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వచ్చి నిలిచింది. ఆ సమయంలో బస్సులోనుంచి ముందుగా మురళీమనోహర్ మూత్ర విసర్జన కోసం వెళ్లగా లోపల దినేష్‌ప్రసాద్ ఉన్నాడు. మురళీమనోహర్ రాగానే దినేష్ కిందికి దిగాడు. ఆ సమయంలో మురళీమనోహర్ బస్సు మెట్ల భాగంలో నిలబడి ఉన్నాడు. కాసేపటికి బస్సులోకి వెళ్లి చూసేసరికి ఆభరణాల బ్యాగు కనిపించలేదు. బస్సులో వెతికినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆభరణాలు చోరీకి గురయ్యాయని గ్రహించి పోలీసులకు సమాచారం అందించగా ప్రయాణికులను తనిఖీ చేశారు. కాగా, బస్సు బస్టాం డ్‌లో ఆగగానే ఇద్దరు ప్రయాణికులు వెంటనే కనిపించకుండా పోయారని చెబుతున్నారు.
దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు..
సమాచారం అందుకున్న శ్రీయాష్ జువెల్లర్స్ దుకాణ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ హుటాహుటిన సూర్యాపేటకు వచ్చాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు రెండున్నర కిలోలు మాత్రమేనని, సుమారు రూ.80 లక్షల విలువ ఉంటుందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్పీ టి.ప్రభాకర్‌రావు కూడా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విలువైన బంగారు ఆభరణాలు బస్సులో ఉండగా ఆ వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే చోరీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో వారి ప్రవర్తనపై కొంత అనుమానం ఉందని, ఆ కోణంలోనూ దర్యాప్తు సాగుతుందని చెప్పారు.
సూర్యాపేట బస్టాండ్‌లో భారీ చోరీ
Published Sat, Nov 23 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement