సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని హుజూర్ నగర్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఇక, సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతో మంది ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. రాజకీయాల కోసం ఎంతో మందిని హుజురాబాద్ పంపించి ఎలాగైనా నన్ను ఓడించాలనే ప్రయత్నం చేసినా.. అక్కడ ప్రజలెవరూ నమ్మక కర్రు కాల్చి వాత పెట్టారు. దళితులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేసి కంటితుడుపు చర్యగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీఆర్ఎస్ అంటూ కొత్తగా మరో నాటకానికి తెరలేపారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మధ్యాహ్న భోజనం కింద నగదును సమకూర్చే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అన్ని ఆధారాలు చూపించినా.. వారిపై చర్యలు తీసుకునే సాహసం లేదు అంటూ విమర్శించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు బీజేపీని ఎదిరించే దమ్ముంది
Comments
Please login to add a commentAdd a comment