
20 శాతం వృద్ధి రేటు లక్ష్యం
► వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అధిక వృద్ధి సాధించాలి
► వీడియో కాన్షరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం
ఒంగోలు టౌన్ : వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 20 శాతం వృద్ధిరేటు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యానశాఖల్లో నీటి యాజమాన్యం, రెయిన్‌గన్స్, బిందు, తుంపర సేద్యం, మైక్రో ఇరిగేషన్ ద్వారా అధిక శాతం వృద్ధి రేటు సాధించాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో అంతర పంటలు వేసుకొని అధిక దిగుబడులు పొందేలా అవగాహన కలిగించాలన్నారు.
రాష్ట్రాభివృద్ధికి రెండు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి ఆర్థికపరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగస్తుల బదిలీలు పారదర్శకంగా చేపట్టేలా చూడాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడాలని, అవకతవకలకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, సీపీఓ కె.టి.వెంకయ్య, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎస్.మురళి, డ్వామా పీడీ పోలప్ప, ఏపీఎంఐపీ పీడీ విద్యాశంకర్, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ జి.విశాలాక్షి, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.