200 యూపీ స్కూళ్లకు లాంగ్‌బెల్! | 200 schools langbel UP! | Sakshi
Sakshi News home page

200 యూపీ స్కూళ్లకు లాంగ్‌బెల్!

Published Sun, Jul 27 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

200 యూపీ స్కూళ్లకు లాంగ్‌బెల్!

200 యూపీ స్కూళ్లకు లాంగ్‌బెల్!

  • 20మందిలోపు పిల్లలున్న స్కూళ్లు మూసివేయాలని ఉత్తర్వులు
  •  ఒకవైపు బడి పిలుస్తోంది..
  •  మరోవైపు పాఠశాలల మూసివేతకు యత్నం
  •  ఉపాధ్యాయ సంఘ నేతల ఆగ్రహం
  • మచిలీపట్నం : ఒకవైపు ‘బడి పిలుస్తోంది..’ అంటూ హడావుడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని 200 యూపీ స్కూళ్లను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇరవైమందిలోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలని నాలుగు రోజుల క్రితం పాఠశాల విద్యా డెరైక్టర్ ఉత్తర్వులు (ఆర్‌సీ నుంబరు 36) జారీచేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘ నాయకులు అభ్యంతరం చెప్పడంతో 20మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించే పనిని విద్యాశాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేస్తున్నారు.
     
    సగం స్కూళ్లు మూసివేసే ప్రమాదం..

    జిల్లావ్యాప్తంగా 415 యూపీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 200 స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. పాఠశాల విద్య డెరైక్టర్ ఉత్తర్వులను అమలు చేస్తే జిల్లాలో సగం యూపీ పాఠశాలలు మూతబడే ప్రమాదం ఉంది. ఎటువంటి ఉత్తర్వులు రాకపోయినా గత ఏడాది పది మందిలోపు విద్యార్థులు ఉన్న 70 యూపీ పాఠశాలలను మూసివేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది మరో 200 యూపీ పాఠశాలలను రేషనలైజేషన్‌ను సాకుగా చూపి మూసివేసేందుకు ప్రయత్నాలు చేయటం వివాదాస్పదమవుతోంది.
     
    విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్దుబాటు సాధ్యమేనా..!
     
    యూపీ స్కూళ్లలో 20 మంది కన్నా అధికంగా పిల్లలు ఉంటే తెలుగు, హిందీ పండిట్లతోపాటు మరో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. గత ఏడాది పది మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారనే కారణంతో 70 యూపీ పాఠశాలలను మూసివేశారు. దీంతో ఆ స్కూళ్లలో పనిచేస్తున్న 300మంది ఉపాధ్యాయులను పక్క పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో యూపీ పాఠశాల, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలనే నిబంధన ఉంది.

    ఈ క్రమంలో 20 మంది కన్నా తక్కువగా పిల్లలు ఉన్న యూపీ పాఠశాలను మూసివేస్తే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను దగ్గరలోని పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. పాఠశాల మూసివేసిన గ్రామంలో కిలోమీటరు వరకు బస్సు సౌకర్యం లేకపోతే దూరప్రాంతంలోని పాఠశాలకు వెళ్లే ఒక్కొక్క విద్యార్థికి రూ.3వేలు ప్రయాణ ఖర్చులుగా ఇవ్వాలనే నిబంధన ఉంది. 200 యూపీ పాఠశాలల మూసివేస్తే ఇక్కడ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ఎంతమేరకు రవాణా చార్జీలు చెల్లిస్తారనేది విద్యాశాఖ అధికారులే చెప్పాలి.

    మొత్తం 200 యూపీ స్కూళ్లు మూసివేస్తే దాదాపు 800 మంది ఉపాధ్యాయులను వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ అధికారులకు ఈ సర్దుబాటు కత్తిమీద సామే అవుతుంది. ప్రస్తుతం 6, 7 తరగతుల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేస్తారా.. కొనసాగిస్తారా.. అనే అంశం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
     
    నిజమే.. పాఠశాలలు గుర్తిస్తున్నాం : డీఈవో


    జిల్లాలో 20 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తిస్తున్నట్లు డీఈవో దేవానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. స్కూళ్లు మూసివేతపై ఎటువంటి ఉత్తర్వులు అందలేదని ఆయన చెప్పారు. కేవలం గుర్తించాలని మాత్రమే సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement