కూర‘గాయాలు’
కూరగాయాల ధరలు చుక్కల్ని అంటడంతో ఈ ఏడాది వినియోగదారులు సర్దుకుపోవాల్సి వచ్చింది. కిలో కూరగాయలు కొనే బదులు పావుకిలోతో సరిపెట్టుకున్నారు. ఒక దశలో కూరగాయలకంటే మాంసం తినడమే సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ.15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ.70, వంకా య రూ.15 నుంచి రూ. 40, బెండ రూ.20 నుంచి 40, మిర్చి రూ.20 నుంచి 80, బీర రూ.25 నుంచి రూ. 40, క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, క్యారెట్ రూ.24 నుంచి రూ. 60కి ఎగబాకింది. అయితే ఏడాది చివర డిసెంబర్‌లో కొంత తగ్గుముఖం పట్టాయి.
కన్నీరు పెట్టించిన ఉల్లి
ఉల్లి జనాన్ని కంటతడి పెట్టించింది. అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్ర దిగుమతుల పనే ఎక్కువగా ఆధారపడడంతో ఒక్కసారిగా ఉల్లి రేటు పెరిగిపోయింది. మరోవపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడుతుండడంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ. 30 నుంచి ఒక దశలో రూ.70 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది
.పెట్రోల్, డీజిల్ దడ
జనవరిలో లీటరు డీజిల్ ధర రూ.50.23 ఉండగా ప్రస్తుతం రూ. 57.97 చేరుకుంది. రూ.7.74 అదనంగా పెరగడంతో ట్రాన్స్‌పోర్ట్ రంగంపై పెనుభారం పడింది. నిత్యావసర సరుకుల రవాణా చార్జీలు పెరిగిపోవడంతో పరోక్షంగా సామాన్యుడిపై భారం పడింది. జిల్లాలో రోజుకు 2.20లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.18లక్షల అదనపు భారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 120 వరకు పెట్రోలియం ఔట్‌లెట్లున్నాయి. జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.72 ఉండగా.. ప్రస్తుతం రూ.78.20కి చేరుకుంది. అంటే లీటరుకు ఏకంగా రూ.6 పెరిగింది. జిల్లాలో రోజుకు 1లక్ష 20 వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. పెరిగిన ధరతో రోజుకు రూ.7లక్షల 20వేల అదనపు భారం ప్రజలు మోయాల్సి వచ్చింది.
బస్సు భారం
డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్ చార్జీలను పెంచేసింది. రెండుసార్లు ఆర్టీసీ అధికారులు చార్జీలను పెంచారు. విద్యార్థుల బస్సు పాస్‌ల చార్జీలు కూడా పెంచడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షల చొప్పున అదనపు భారం మోయాల్సి వచ్చింది. తద్వారా ఏడాదికి కోట్ల భారం ప్రజలపై పడింది.
సర్‌చార్జీల పిడుగు
సర్‌చార్జీల పేరుతో సర్కారు విద్యుత్ వినియోగదారులపై పెను భారమే మోపింది. బడ్డీ కొట్టు నుంచి మొదలుకుంటే పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ భారం పడింది. స్లాబులు విభజించి సాధారణంగా 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారిని కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా చార్జీలను పెంచేసింది. 2013 సంవత్సరంలో జిల్లా ప్రజలపై అదనంగా సుమారు రూ.200 కోట్ల భారం పడింది. కోతల కారణంగా పరిశ్రమల యజమానులు ఇక్కట్లు పడ్డారు. పీక్ సమయాల్లో ఎవరైనా విద్యుత్ వినియోగానికి పూనుకుంటే వారికి 3 రేట్ల అపరాధ రుసుం విధించారు. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి.
గ్యాస్ మంటలు
ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆధార్ తప్పనిసరి చేయడంతో సబ్సిడీ సిలిండర్‌కు మొదట వినియోగదారుడు పూర్తిస్థాయిలో ధర చెల్లించాల్సి వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. ప్రస్తుతం రూ.1,107లకు సబ్సిడీ సిలిండర్ ధర పెరిగింది. రూ.633 సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. కాగా ఆధార్ సీడింగ్ కాని వినియోగదారులకు రూ.419కి సిలిండర్ లభిస్తుంది. ఆధార్ సీడింగ్, సీడింగ్ కాని వినియోగదారులకు మధ్య రూ.60కి పైగా వ్యత్యాసం రావడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షలకు పైగా సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా సబ్సిడీ సిలిండర్లను 9కి మాత్రమే పరిమితం చేయడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్లపై వినియోగదారుడికి పెను భారం పడుతోంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు సుమారు రూ.700 వ్యత్యాసం ఉండటం గమనార్హం.
బియ్యం, నూనెలతో కంగారు
పేదలకు అందుబాటులో ఉండే పామాయిల్ కూడా కంగారు పెట్టించింది. ప్రస్తుతం కిలో రూ.65కు లభ్యం అవుతున్నా.. నిన్న మొన్నటి దాకా రూ.88 పలకడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ఇక వేరుశెనగ నూనె అయితే ఏకంగా రూ.110 వరకు చేరింది. బియ్యం ధర గుబులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మొదట్లో రూ.3,800 నుంచి క్రమంగా క్వింటాలు బియ్యం ధర రూ.5 వేలకు చేరాయి.
పాల ధర కూడా...
ఈ ఏడాది లీటరు పాల ధర రెండు రూపాయల చొప్పున పెంచారు. సరాసరిన రోజుకు వేల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విధంగా లక్షల రూపాయల భారం ప్రజలపై పడింది.
2013లో బెంబేలెత్తించిన ధరలు
Published Sun, Dec 29 2013 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement