దారి దశ తిరిగింది..
- రూ.3 వేల కోట్లతో 216 నేషనల్ హైవే అభివృద్ధి
- కత్తిపూడి-తిమ్మాపురం మధ్య నాలుగులేన్లుగా విస్తరణ
- కాకినాడ సహా జిల్లాలో ఏడు చోట్ల బైపాస్‌లు
- భూసేకరణపై సమీక్షించిన అధికారులు
సాక్షి, కాకినాడ : జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ ఉన్న ఉన్న 216 జాతీయ రహదారికి రూపురేఖలు మారిపోనున్నాయి. అయిదు జిల్లాలను అనుసంధానిస్తూ దాదాపు 370 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారి విస్తరణ, అభివృద్ధుల నిమిత్తం కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసింది. కిలోమీటర్‌కు రూ.7.50 కోట్ల చొప్పున రూ.2,800 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీంతో కోస్తాంధ్రలో రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. తొలిదశలో జిల్లాలోని కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ పనులకు నేషనల్ హైవేస్ అధికారులు శ్రీకారం చుట్టారు.
జిల్లాలో కత్తిపూడి నుంచి దిండి వరకు 125 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ సమీపంలోని తిమ్మాపురంవరకు ఉన్న ప్రస్తుతం రెండు లేన్లను నాలుగులేన్లుగా విస్తరించనున్నారు. తిమ్మాపురం నుంచి మాధవపట్నం-ఇంద్రపాలెం-మేడలైను-తూరంగిల మీదుగా కాకినాడ-యానాం రహదారిలోని ఉప్పలంక వరకు కాకినాడ బైపాస్ రహదారిని నిర్మించనున్నారు. అక్కడ నుంచి చించినాడ వరకు ప్రస్తుతం ఉన్న ఏడు మీటర్ల రహదారిని పదిమీటర్ల రహదారిగా విస్తరించనున్నారు. కాకినాడ బైపాస్ మాదిరే.. కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులలో బైపాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.
చించినాడ నుంచి పామర్రు మీదుగా ఒంగోలు వరకు రహదారిని పదిమీటర్ల మేర విస్తరించనున్నారు. కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణ కోసం 970 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. తిమ్మాపురం నుంచి మేడలైన్ మీదుగా ఉప్పలంక వరకు 17 కిలోమీటర్ల మేర కాకినాడ బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. కత్తిపూడి నుంచి తిమ్మాపురం వరకు ప్రతిపాదించిన నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా చిత్రాడ వద్ద మరో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. కాకినాడ బైపాస్ రహదారిలో కూడా మాధవపట్నం వద్ద రైల్వే ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. కాకినాడ నుంచి కోనసీమ మీదుగా చించినాడ వరకు వశిష్ట, వైనతేయ, ఆత్రేయగోదావరిలపై పలుచోట్ల వంతెనలూ నిర్మించనున్నారు.
గ్రామాలవారీ జాబితాలు రూపొందించండి : జేసీ
తొలిదశలో కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణపై శుక్రవారం సంబంధిత శాఖాధికారులు తొలిసారి కాకినాడలో భేటీ అయ్యారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ హైవేస్ ఉన్నతాధికారులతో పాటు ఆర్ అండ్ బి, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే శాఖాధికారులు ప్రాజెక్టు కోసం చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. రైతులతో మాట్లాడి భూసేకరణకు సర్వే చేయాలని నిర్ణయించారు.
గ్రామాల వారీగా ల్యాండ్ రిక్విజిషన్ జాబితాలు తయారుచేసి తదనుగుణంగా మార్కింగ్ చేయాలని ఏజేసీ ఆదేశించారు.
ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమి సేకరించాలో జాబితాలు తయారుచేయాలని సూచించారు. ఇందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, డ్రాఫ్ట్స్‌మెన్ ఎంతమంది అవసరమవుతారో ప్రతిపాదనలు సమర్పించాలని హైవేస్ అధికారులను జేసీ ఆదేశించారు. నిధులు సిద్ధంగా ఉన్నాయని, భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే టెండర్లు పిలుస్తామని వారు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, నేషనల్ హైవే సర్కిల్ విజయవాడ ఎస్‌ఈ పీడీ విజయ్‌కుమార్, కాకినాడ ఈఈ టి.సత్యనారాయణ, ఈఈ జి.హరికృష్ణ, ఫీడ్ బ్యాక్ ఇన్‌ఫ్రా సీహెచ్ మురళీకృష్ణ, డీఈ జీడీ ప్రభాకరరావు, ఏఈ ఎన్.శ్రీనివాసరావు, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే అధికారులు పాల్గొన్నారు.