
సంఘటన స్థలంలోనే మృతి చెందిన బొజ్జపు వెంకటలక్ష్మి
సాక్షి తూర్పుగోదావరి(కత్తిపూడి) : విధి నిర్వహణలో ఉండగానే తండ్రి అకాల మరణం చెందడంతో ఆ ఉద్యోగం పొందేందుకు బంధువు సహయంతో బైక్‌పై వెళుతున్న ఓ యువతి గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం మండలం మార్కెండేయపురానికి చెందిన బొజ్జపు వెంకటలక్ష్మి (28) తండ్రి ఇటీవలే అకాల మరణం చెందారు. అయితే తండ్రి ఉద్యోగాన్ని పొందేందుకు ఆమె తన సమీప బంధువు అడ్డతీగల గ్రామానికి చెందిన పడాల నరేష్‌తో కలసి తుని ఆర్టీసీ డిపోకు వెళుతుండగా కత్తిపూడి 16 నంబరు జాతీయ రహదారి ఆర్‌టీఓ కార్యాలయం సమీపంలో తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న మినీవ్యాన్ రాంగ్ రూట్‌లో వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై శంకర్రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment