బైపాస్ రోడ్డు పనులు పూర్తి
బైపాస్ రోడ్డు పనులు పూర్తి
Published Sun, May 28 2017 10:04 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
– ఇప్పటికే అనధికారంగా వాహనాల రాకపోకలు
– తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
– ఇక భారీ వాహనాలన్నీ బైపాస్‌లో వెళ్లాల్సిందే!
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగర శివారులో రెండు జాతీయ రహదారులను కలుపుతూ నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాదాపు ఏడేళ్లపాటు కొనసాగిన పనులు ఏడాది నుంచి వేగం పుంజుకొని ఈ మధ్యనే పూర్తికావడంతో అనధికారంగా వాహనాలు పరుగులుతీస్తున్నాయి. బైపాస్ పూర్తవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశముందని పోలీసులు, రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఏడేళ్లపాటు కొనసాగిన నిర్మాణ పనులు
కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణ కోసం నగర శివారులో జాతీయ రహదారులు 18, 44 కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2010 నవంబర్‌లో పునాది పడింది. జాతీయరహదారి 18లోని సఫా ఇంజినీరింగ్ కళాశాల నుంచి జాతీయ రహదారి 44లో కేశవరెడ్డి స్కూల్ సమీపం వరకు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 50.53 కోట్లతో పనులను కేఎంసీ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. పనుల పూర్తికి రెండేళ్ల గడువును విధించారు. రహదారి నిర్మాణానికి భూమిని సేకరించడంలో స్థానిక రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోడవడంతో రెండేళ్లలో పూర్తికావల్సిన పనులు ఏడేళ్ల పాటు కొనసాగాయి.
నగరంలోకి భారీ వాహనాలకు నో ఎంట్రీ!
బైపాస్ రోడ్డు పూర్తవడంతో త్వరలో నగరంలోకి భారీ వాహనాలను అనుమతించరు. ప్రస్తుతం హైదారబాద్, బెంగుళూరు నుంచి వచ్చే వాహనాలు కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, శ్రీశైలం వెళ్లాలంటే సీక్యాంపు మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో నగరంలో భారీ వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ రహదారి పూర్తికావడంతో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశముంది.
శంషాబాద్ రింగ్ రోడ్డును తలపిస్తున్న నిర్మాణం...
బైపాస్ రోడ్డు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ రింగు రోడ్డు నిర్మాణాన్ని తలిపిస్తోంది. ఎక్కడి వాహనాలక్కడే వెళ్లేందుకు వీలుగా రహదారి మొత్తం నాలుగు రహదారులుగా విడిపోయింది. నంద్యాల–కర్నూలు, బెంగుళూరు–నంద్యాల, హైదరాబాద్, కర్నూలు–నంద్యాల, నంద్యాల–బెంగుళూరుగా విడిపోయింది. త్వరలోనే ప్రజాప్రతినిధులతో ప్రారంభింపజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement