సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్భందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నాయకులు సిద్ధమవుతున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, డోన్, కర్నూలు పరిధిలోని జాతీయ రహదారులతో పాటు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లోని రహదారులను సైతం స్తంభింపజేయాలని స్థానిక నేతలు నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజులుగా కార్యకర్తలతో విసృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం సంప్రదించారు.
ప్రజల భాగస్వామ్యంతో జాతీయ రహదారులను దిగ్భందించాలని సూచించారు. బుధవారం ఉదయం నుంచి 48 గంటల పాటు ఈ దిగ్బంధాన్ని కొనసాగించాలని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఏపీఎన్‌జీఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, వ్యాపారులు, రైతులు కలసి రావాలని కోరారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదని.. రైతులు కూడా పంట దిగుబడుల విక్రయాలను మంగళవారం ముగించుకోవడం, లేదా శుక్రవారానికి వాయిదా వేసుకుని ఉద్యమానికి ఊతమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి నగరంలో వార్డుల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపైన ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను స్తంభింపజేయనున్నారు. అదే విధంగా డోన్ పరిధిలో బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, పాణ్యం గౌరు చరిత, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోనిలో సాయిప్రసాద్‌రెడ్డి, పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఆత్మకూరు పరిధిలో బుడ్డా రాజశేఖరరెడ్డి, బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఆలూరు పరిధిలో గుమ్మనూరు జయరాం, నందికొట్కూరు పరిధిలో ఐజయ్య, బండిజయరాజ్, శివానందరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్భందించనున్నారు.