నీరిచ్చి ప్రాణాలు నిలిపే గోదారమ్మ ఒడిలో ఘోరం జరిగింది. ఆనకట్టపై మృత్యుదేవత వికటాట్టహాసం చేసింది. బిడ్డను బలి తీసుకుని తల్లిపై దయ చూపితే.. మనుమలను కబళించి తాతను కరుణిస్తే.. భర్తను కాటేసి భార్యను విడిచిపెడితే.. ఆ శోకంతో వారు పెట్టే శాపనార్థాలు తనకు తగులుతాయనుకుందో ఏమో.. ఆ అవకాశమే లేకుండా కుటుంబాలకు కుటుంబాలనే మింగేసింది. ఐదు పదులు దాటిన ముదురాకు నుంచి రెండు వసంతాల చిగురాకునూ నిర్దాక్షిణ్యంగా రాల్చేసింది. కష్టం, సుఖం కలసి పంచుకున్న.. ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్న.. 22 మందిని ఊచకోత కోసింది. అరుున వారందరినీ పోగొట్టుకున్న ఓ బాలుడు.. మృత్యువును గెలిచినా అనాథలా మిగిలాడు. పొరుగునే ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నదిలోకి వ్యాన్ బోల్తా కొట్టిన ఘోర ప్రమాదం ‘పశ్చిమ’ వాసులను కలవరపాటుకు గురి చేసింది.
ఏలూరు/ తణుకు/ఏలూరు అర్బన్ : రోడ్డు మీద ప్రయూణం చేయూలంటే ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయూణికులు, బాటసారులు ఆందోళన చెందుతున్నారు. అధ్వానంగా ఉన్న రహదారులు, వంతెనల వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, జాతీయ రహదారిపై డివైడర్లు లోపభూయిష్టంగా నిర్మించడం, కండిషన్‌లో లేని వాహనాలు ప్రయాణికుల పాలిట యమదూతలవుతున్నాయి. జిల్లాకు సరిహద్దులో ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం వేకువజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 22మంది మృతువాత పడటం జిల్లా ప్రజలను కలవర పాటుకు గురిచేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, రహదారి సరిగా లేకపోవడమే ఆ ప్రమాదానికి కారణాలని తెలుస్తోంది. జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ చాలాచోట్ల కల్వర్టులకు రక్షణ గోడలు లేవు. మారుమూల గ్రామాల్లో తిరిగే వాహనాల్లో ఎన్ని కండిషన్‌లో ఉన్నాయో ఎవరికీ పట్టదు. ఇక రోడ్లు సంగతి చెప్పనవసరమే లేదు. జిల్లాలో జాతీయ రహదారి పక్కనే కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సరైన కల్వర్టులు లేకపోగా కనీసం బోర్డులు కూడా ఎక్కడా కనిపించవు. ఈ నిర్లక్ష్యం ఏటా పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొంటోంది. ప్రయాణికుల కళ్లలో రుధిరాశ్రువులు నింపుతోంది.
ప్రాణాలు పోయాకనే..
ఎగుడు దిగుడు రహదారులు.. పరిమితికి మించి ప్రయాణికుల తరలింపు.. విశ్రాంతి లేకుండా డ్రైవర్ల విధులు.. నిద్రలేమి.. ఇలా ఎన్నో సమస్యలు ప్రమాదాలకు కారణాలవుతున్నారుు. విలువైన ప్రాణాలు కోల్పోయాక స్పందిం చడం తప్ప అధికారుల్లో ముందుచూపు కొరవడుతోంది. సూచిక బోర్డులు లేకపోవడం.. కల్వర్టుల వద్ద రెయిలింగ్‌లు ఏర్పాటు చేయకపోవడం.. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం.. రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా చిత్తశుద్ధి కనిపించడంలేదు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపేవారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. మరో ధవళేశ్వరం ఘటన జరగకముందే అధికారులు మేల్కోనాల్సి ఉంది. ప్రభుత్వమూ స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
జాతీయ రహదారిపై జరభద్రం
జిల్లాలో ప్రధానంగా పదహారో నంబరు జాతీయ రహదారి ప్రమాదభరింతంగా ఉంది. ఏలూరు సమీపంలోని కలపర్రు నుంచి సిద్ధాంతం వరకు ఈ రహదారి విస్తరించి ఉంది. రోడ్డుకు ఒకవైపు కాలువ ఉండటం కూడా ప్రమాదాలకు కారణంగా మారింది. ఈ మార్గంలో ప్రధానంగా దువ్వ, తేతలి, పెరవలి, సిద్ధాంతం ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయి. తేతలి పరిధిలోని అత్తిలి కాలువ వద్ద జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నరసాపురం కాలువను ఆనుకుని ఆర్ అండ్ బీ రోడ్డు ఉండటంతో ఈ ప్రాంతంలో సైతం పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక పెదతాడేపల్లి-ఏలూరు మధ్య జాతీయ రహదారిపై లెక్కకు మిక్కిలిగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి.
డ్రైవర్లకు రెస్ట్‌హౌస్‌లేవి?
వాహనాలు నడిపే డ్రైవర్లకు తెల్లవారుజామున కచ్చితంగా విశ్రాంతి అవసరం. ప్రధానంగా వేకువజామున 2 గంటల నుంచి 5 గంటలలోపు వారు విశ్రాంతి తీసుకోకుండా వాహనాలు నడపటం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలు, నాలుగు లేన్ల రహదారులపై వాహనాలను ఆపి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెస్ట్‌హౌస్‌లు నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట విశ్రాంతి గృహం ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నా పట్టడం లేదు. గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ఐదెకరాల స్థలంలో రెస్ట్‌హౌస్ ఏర్పాటు ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 22మంది మృతి చెందిన ఘటన చాలా దురదృష్టకరం. ఈ ప్రమాదానికి డ్రైవర్ అలసట, నిద్రమత్తు, అదుపులేని వేగం, పరిమితికి మించినస్థాయిలో ప్రయాణికులు వాహనంలో ఉండటం ప్రధాన కారణాలని తెలుస్తోంది. డ్రైవింగ్‌లో అనుభవరాహిత్యం, నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారుు. హైవేలపై ప్రయాణించే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్తతో కనెక్టింగ్ రోడ్ల నుంచి హైవేపైకి ప్రవేశించే వాహనాలను గమనిస్తుండాలి. జంక్షన్‌లో ప్రవేశించేప్పుడు వాహనవేగాన్ని నియంత్రించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. హైవే అథారిటీ కూడా రహదార్లను మంచి కండిషన్‌లో ఉంచడం, హైవే మార్జిన్లలో ఆక్రమణలు, హోర్డింగలను తొలగించాలి. జంక్షన్‌ల వద్ద విధిగా స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. డ్రైవర్ల కోసం రెస్ట్ జోన్లు, పార్కింగ్ జంక్షన్లు నిర్మించాలి. ఇదే క్రమంలో ట్రాన్స్‌పోర్ట్ అధికారులు కూడా తరచూ హైవేలపై తనిఖీలు నిర్వహించి పరిమితికి మించిన వేగం, లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై కేసులు పెట్టడం వల్ల కూడా ప్రమాదాలను నివారించవచ్చు.
- పి.భాస్కరరావు, ట్రాఫిక్ డీఎస్పీ, ఏలూరు
డ్రైవర్ సామర్థ్యాన్ని గమనిస్తూ ఉండాలి
సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను తరలించే వాహనాల్లో ప్రధానంగా వాహనం ఫిట్‌నెస్‌తో పాటు డ్రైవర్ సామర్థ్యాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. తీర్థయాత్రలు, ఇతరత్రా పుణ్యక్షేత్రాలకు వెళ్లే సమయాల్లో ఇద్దరు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడుపుతున్న సమయంలో అందులోని ప్రయాణికులు ఎప్పటికప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తూ ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో అవగాహన లేకుండా డ్రైవర్‌ను తొందర పెడుతుంటారు. ఈ విధానం మంచిది కాదు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులు వాహనంలో లేకుండా జాగ్రత్తలు వహించాలి.
- పి.సీతాపతిరావు, మోటారు వాహనాల తనిఖీ అధికారి, తణుకు
యజమానుల ఒత్తిడి వల్లే అతివేగం
పచ్చి సరుకులు లారీల్లో తీసుకువెళుతున్న సందర్భంలో సకాలంలో గమ్యం చేర్చాలని యజమానులు ఒత్తిడి చేస్తారు. డ్రైవర్లు ఆ ఒత్తిడి కారణంగా అతివేగంగా వెళుతున్నారు. విరామం లేకుండా డ్రైవింగ్ చేస్తుం డటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నారుు. దీనిపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించాలి. వాహనానికి వాహనానికి మధ్య ప్రతి డ్రైవర్ దూరం పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. - కోట రమేష్, లారీ డ్రైవర్
డ్రైవర్లకు విశ్రాంతి, నిద్ర అవసరం
ప్రతి మనిషికి రోజుకు కనీసం ఆరు గంటల నిద్ర అవసరం. డ్రైవర్ల విషయానికి వస్తే వారికి రోజుకు ఆరు గంటల నిద్రతోపాటు శారీరక దృఢత్వం, ఆరోగ్యం కూడా తప్పనిసరిగా ఉండి తీరాలి. బీపీ, మూర్ఛ వంటివి ఉన్నవారు వాహనాలను నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రైవేటు రవాణా వ్యవస్థలో పనిచేసే డ్రైవర్లు రోజుల తరబడి డ్యూటీ చేయడంతో కొన్ని సమయాల్లో రోజులో రెండు గంటలపాటు కూడా కంటి నిండా మంచి నిద్రకు నోచుకోవడం లేదు. దీనికి తోడు నిర్ణీత సమయంలో వాహనాలను గమ్యానికి చేర్చే హడావుడిలో రేయింబవళ్లు ఏకధాటిగా వాహనాలను విపరీత వేగంతో నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాస్తవ పరిస్థితులను వాహనాల యజమానులకు చెప్పి విశ్రాంతి తీసుకోవడం మేలు. తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
- డాక్టర్ ఏవీఆర్ మోహన్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, ఏలూరు
నిద్ర వస్తే విశ్రాంతి తీసుకోవాలి
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిద్ర వచ్చినప్పుడు వాహనాలు సురక్షిత ప్రాంతంలో ఆపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడం మేలు. దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా సరే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. - యల్లపు రాజేష్, కారు డ్రైవర్
గోదారమ్మ ఒడిలో.. విషాదపు వరద
Published Sun, Jun 14 2015 1:28 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement