కుమ్మరిస్తున్నారు..
- నోట్లతో ఓట్ల కోసం టీడీపీ ఎర
- కుప్పంలో ఆకు, వక్కతోపాటు డబ్బు పంపిణీ
- పీలేరులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ
- పోలింగ్ రోజున మాంసం కోసం టీడీపీ టోకన్లు
సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారా విజయం సాధించేం దుకు తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. డబ్బుతోపాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకమైన ప్రలోభాలకు తెరతీసింది. పోలింగ్‌కు ఇక 24 గంటలు మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. మదనపల్లెలో డబ్బు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ పోలీసులకు చిక్కారు. దీన్నిబట్టి ఓట్ల కోసం ప్రలోభాలపైనే టీడీపీ ఎంతగా ఆధారపడిందో అర్థమవుతోంది.
పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 31 జెడ్పీటీసీ, 447 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడును ఎదుర్కొనేందుకు ఆ పార్టీ శ్రేణులు డబ్బు కుమ్మరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కుప్పంలో ఏదో రకంగా గెలుపు సాధించాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్‌లోనూ ఓటుకు రేటు కట్టారు.
కుప్పం మండల సెగ్మెంట్‌లో మహిళలకు ఆకు, వక్కతో పాటు డబ్బు పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా వెయ్యి రూపాయలు కూడా పం పిణీ చేసినట్టు సమాచారం. పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో యువతను ఆక ర్షించేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో యువతకు ప్రత్యేకంగా యూత్ డిన్నర్స్ ఏర్పాటు చేశారు. ఈ విందులో మందు, మాంసాహారం అందించారు. బెరైడ్డిపల్లెలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. గంగవరం మండలంలో పది మందికి పైగా ఓట్లు ఉన్న ఇళ్లకు టోకుగా ప్యాకేజీలు నిర్ణయించి ఆ మేరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు.
పలమనేరు మండలంలో పోలింగ్ జరిగే ఆదివారం రోజున మాంసం తెచ్చుకునేందుకు వీలుగా టోకెన్లు పంపిణీ చేశారు. కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి రెండు నుంచి మూడు కేజీల చికెన్, మటన్ టోకెన్లు ఇచ్చారు. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేశారు. చౌడేపల్లె మండలంలో టీడీపీ అభ్యర్థులు తెప్పించినదిగా భావిస్తున్న 210 కేసుల బీరు, బ్రాందీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్
మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. కోటపోలు గ్రామంలో స్వయంగా డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. రామసముద్రం మండలంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు. నిమ్మనపల్లెలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఓటుకు రేటు కట్టారు.
కిక్కెక్కించిన జై సమైక్యాంధ్ర పార్టీ
పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మందు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల డబ్బు పంపిణీ చేసినప్పటికీ మద్యం పంపిణీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హవా ఉన్న సెగ్మెంట్లలో జై సమైక్యాంధ్ర వారు ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బు పంపిణీ చేశారు.