వైసీపీ దూకుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహాలకు పదును పెడుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావుడి చేస్తున్నా వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు తేలిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనీసం 20 శాతం వార్డుల్లో కూడా అభ్యర్థులను పోటీకి దింపలేక చేతులెత్తేసింది.
జిల్లా కేంద్రమైన ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ అన్నీ తానై నడిపిస్తున్నారు. డివిజన్లలో విసృ్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో వెనుకబడింది. ఆ పార్టీ నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎస్‌ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత పెదబాబు భార్య నూర్జహాన్‌ను పోటీకి దింపగా, అంతగా ప్రభావం చూపలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భీమవరంలో వైసీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నేతృత్వంలో కౌన్సిలర్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తారస్థారుుకి చేరారుు. ఈ పరిస్థితి ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. జనాదరణ పెంచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది. పాలకొల్లులో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరడంతో అక్కడ రాజకీయం ఏకపక్షంగా మారింది.
టీడీపీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోం ది. తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. రెండు పార్టీలు విసృ్తతంగా ప్రచారం చేస్తున్నాయి. కొవ్వూరు మునిసిపాలిటీలోనూ వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైసీపీ నేతలు ఏకతాటిపై నిలబడి అభ్యర్థుల గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే టీవీ రామారావుపై టీడీపీ నేతల మధ్య నెలకొన్న వ్యతిరేకత అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. నిడదవోలును చేజిక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ తిప్పికొడుతున్నారు.
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో వైసీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పట్టణ ప్రముఖుడైన తల్లాడి సత్తిపండు సతీమణి వరలక్ష్మిని ప్రకటించడంతో టీడీపీ ఆందోళనలో మునిగిపోయింది. ఇక అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. 291 వార్డులుండగా, ఆ పార్టీ 47వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలపగలిగింది. మొత్తంగా మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ముందంజలో పయనిస్తోంది.