ఎక్కడి బస్సులక్కడే.. | 23000 RTC Buses Canceled in Telugu States | Sakshi
Sakshi News home page

ఎక్కడి బస్సులక్కడే..

Published Thu, May 7 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

23000 RTC Buses Canceled in Telugu States

 రాజమండ్రి :జిల్లాలో బుధవారం ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వోద్యోగులకు ఇచ్చినట్టు పీఆర్సీ ఫిట్‌మెంట్ 43 శాతం ఇవ్వాలని ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పాలన్న యాజమాన్యం యత్నాలను కార్మికులు విజయవంతంగా అడ్డుకున్నారు. జిల్లాలో తొమ్మిది బస్సు డిపోల్లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి ప్రధాన డిపోలతోపాటు మిగిలిన చోట్ల కూడా ఒకటి రెండు సర్వీసులు మాత్రమే తిరిగాయి. ఒక్క గోకవరం డిపోలో మాత్రమే అత్యధికంగా 22 సర్వీసులు కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం తిరిగాయి. జిల్లాలో 841 బస్సులు రోజుకు వెయ్యికి పైగా సర్వీసులు నడవాల్సి ఉండగా కేవలం 80 బస్సులు మాత్రమే తిరిగాయి.  
 
 ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పేందుకు యత్నించినా కార్మికులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. ధర్నాలు చేయడంతోజిల్లాలో బస్సులు ఎక్కడికక్కడకు  నిలిచిపోయాయి. పాటు టైర్లలో గాలి తీసి ఆందోళనకు దిగారు. వారి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో డిపోలు హోరెత్తాయి. రాజమండ్రి డిపో పరిధిలో మొత్తం 132 సర్వీసులకు 10, కాకినాడ డిపోలో 153 సర్వీసులకు కేవలం రెండు, అమలాపురం డిపోలో 136 సర్వీసులకు రెండు సర్వీసులు తిరిగాయి. ఆర్టీసీ రూ.70 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. తుని డిపోలో కార్మికులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంపూర్ణ మద్దతు తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ధర్నా చేశారు. కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు.
 
 కిటకిటలాడిన లాంచీలు..
 బస్సులు తిరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  చాలా మంది రైళ్లు, లారీలు, ఆటోలను ఆశ్రయించారు. తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రైళ్లు కిక్కిరిశాయి. రిజర్వేషన్ బోగీల్లోకి సైతం మామూలు ప్రయూణికులు చొరబడడంతో  రిజర్వేషన్ చేరుుంచుకున్న వారు ఇబ్బంది పడ్డారు. కొవ్వూరు - రాజమండ్రి మధ్య నడుస్తున్న లాంచిలు సైతం కిటకిటలాడాయి.  లారీలు, ఆటోలలో సైతం సామర్థ్యానికి మించి ప్రయాణించారు. హైవేలపై ప్రయాణికులు గంటల పాటు మండుటెండల్లో వాహనాల కోసం ఎదురు తెన్నులు చూడాల్సి వచ్చింది.
 
 ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ
 సమ్మెతో నిలిచిన బస్సు సర్వీసులను గురువారం నుంచి పునరుద్ధరించాలని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయయత్నాల్లో తలమునకలయ్యారు.  ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించాలని భావిస్తున్నారు. రోజుకు డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇస్తామన్న ఆర్టీసీ ప్రకటనకు స్పందన బాగానే ఉంది. రాజమండ్రి డిపోలో తాత్కాలిక పద్ధతిలో కండక్టర్ల నియూమకానికి సుమారు 100 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 500 మందిని తాత్కాలికంగా నియమించినట్టు తెలిసింది. వారితో రేపు పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతామని యాజమాన్యం ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకుంటే తొలగిస్తామనడంతో వారంతా వస్తారని యాజమాన్యం భావిస్తోంది. దీనికితోడు ‘ఏదో విధంగా బస్సులు తిప్పండి.. వచ్చినంత ఇవ్వండి’అని అధికారులే అనధికారికంగా చెబుతుండడంతో సర్వీసులు తిప్పేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.
 
 అద్దె బస్సులు తిప్పకుంటే పర్మిట్ రద్దు
 అద్దె బస్సులు తిరగకుంటే పర్మిట్ రద్దు చేస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. బస్సు సర్వీసులు తిప్పాల్సిందిగా ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డిపో మేనేజర్లతో కలిసి అద్దె బస్సులను ఏ రూట్‌లో అయినా తిప్పుకునేలా నిబంధనలు సడలించారు. పర్మిట్‌తో సంబంధం లేకుండా సొంతంగా డ్రైవర్లను, కండక్టర్లును ఏర్పాటు చేసుకుని బస్సు యాజమాన్యం తిప్పుకునేందుకు సైతం సిద్ధమవుతోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement