రైళ్లన్నీ లేటే! | 3 hours of stalled trains | Sakshi
Sakshi News home page

రైళ్లన్నీ లేటే!

Published Mon, Aug 18 2014 12:57 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

రైళ్లన్నీ లేటే! - Sakshi

రైళ్లన్నీ లేటే!

  •   ఉసూరన్న ప్రయాణి కులు
  •   శివారు స్టేషన్‌లలోరైళ్లు దిగి ఇక్కట్లు
  •   పట్టాలు తప్పిన   రైలింజన్
  •   3 గంటల పాటు స్తంభించిన రైళ్లు
  • వరుసగా మూడు రోజుల సెలవులు ముగిసి పోయాయి. సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరాలన్న ఆత్రుతతో ఆదివారం ప్రయాణికులంతా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. ప్లాట్‌ఫారాలన్నీ కిటకిటలాడాయి. విశాఖ స్టేషన్‌లో షంటింగ్ చేసే రైలింజన్ పట్టాలు తప్పటంతో విశాఖ నుంచి తుని వరకు అన్ని స్టేషన్లలో బళ్లన్నీ మూడు గంటలకు పైగా నిలిచిపోయాయి. ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
     
    విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు బయల్దేరాల్సిన కేప్-హౌరా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నుంచి కదిలినట్టే కదిలి ఆగిపోయింది. అంతకు ముందు పావు గంట నుంచి మరికొద్దిసేపట్లో ఈ రైలు బయల్దేరబోతోందంటూ అనౌన్స్ చేశారు. ఆ ఒక్క రైలే కాదు. 12.05  గంటల నుంచీ ఏ ఒక్క రైలు కూడా కదల్లేదు. అదే వేళకు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం మీదకు చేరుకుంటుందంటూ ప్రకటించిన విజయవాడ-విశాఖపట్నం  రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం వందలాది మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

    మొన్నటి వరకూ పెళ్లిళ్ల హడావిడితో కిక్కిరిసిపోయిన ఈ రైల్లో సీటు సంగతి ఎలా ఉన్నా  నిలబడేందుకైనా కాసింత చోటుంటుందేమోనని ఎదురు చూసే వారంతా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం నిరీక్షిస్తున్నారు. కానీ 12.30 దాటినా ఆ రైలు రాలేదు. అదిగో వస్తుంది..ఇదిగో వస్తుందంటూ గంట చూశారు. 12 గంటలకు రావాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.55 గంటలకు వచ్చింది. తిరిగి 3.35 గంటలకు బయల్దేరింది. ఈ ఒక్క రైలే కాదు. దాదాపు అన్ని రైళ్ల పరిస్థితీ అంతే. దీంతో గంటల తరబడి విశాఖ స్టేషన్‌లో ప్రయాణికులు నిరీక్షించారు. ఉసూరుమంటూ ఎక్కడి వారు అక్కడే చతికిలబడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ శివారు స్టేషన్‌లలో ఆగిపోతుంటే అక్కడే ప్రయాణికులు దిగేసి వెళ్లిపోయారు.

    కానీ విశాఖ స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు మాత్రం గంటల తరబడి నిరీక్షించక తప్పలేదు. రైళ్ల ఆలస్యంతో దూర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు మాత్రం రిజర్వేషన్‌లను రద్దు చేసుకున్నారు.  విశాఖకు చేరుకునే రైళ్లతో బాటు ఇక్కడ నుంచి బయల్దేరే రైళ్లన్నీ మూడు గంటలు ఆలస్యంగా ఉన్నాయి. ర త్నాచల్, ప్రశాంతి, బొకారో, హౌరా మెయిల్, మద్రాస్ మెయిల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, గోదావరి, విశాఖ, వంటి రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
     
    ఘోర ప్రమాదం తప్పిందిలా!


    విశాఖ స్టేషన్‌లో షంటింగ్ చేసే రైలింజన్ (డీజిల్) పట్టాలు తప్పింది. ప్రయాణికులతో వెళ్లే రైలు పట్టాలు తప్పితే ఘోర ప్రమాదం జరిగేది. విశాఖ స్టేషన్ నుంచి యార్డుకు వెళ్లే పాయింట్ వద్ద పట్టాలు త ప్పింది. దీనిని సర్దుబాటు చేసేందుకు బోలెడంత సమయం పట్టేదని రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ స్టేషన్‌లో ఇంజన్‌లను మార్పు చేయడం, అదనపు బోగీలను యార్డు నుంచి తీసుకొచ్చి రైళ్లకు జోడించడం వంటి పనులను పట్టాలు తప్పిన ఈ ఇంజన్ చేస్తుంటుంది.

    దాదాపు ఎనిమిది ప్లాట్‌ఫారాలపై షంటింగ్ చేయడం ఈ ఇంజన్ ప్రత్యేకత. దీంట్లో డీజిల్ అయిపోతుందని గుర్తించి ట్యాంకు నింపుకునేందుకు యార్డుకు వెళుతూ సరిగ్గా ప్రధాన లైన్ నుంచి యార్డు మార్గానికి మలుపు తిరిగే పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ట్రాక్ ఓ వైపు విరిగిపోయి ఇంజన్‌కు ముందు వున్న రెండు వైపులా చక్రాలు భూమిలో కూరుకుపోయాయి. సంఘటన విషయం తెలిసిన వెంటనే డీఆర్‌ఎం అనిల్‌కుమార్‌తో బాటు ఇంజినీరింగ్ అధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి మూడు గంటల్లోనే రైళ్లు పరుగులు పెట్టేలా చర్యలు తీసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement