రాజధాని రేసులో గుంటూరు
సాక్షి, గుంటూరు : సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటు చేసే అంశంలో గుంటూరు ముందు వరుసలో ఉంది. జూన్ 2 నుంచి ఏర్పడే కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడనే విషయంపై కేంద్ర హోం శాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలోని గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో సోమవారం పర్యటించనుంది. విశాఖపట్నంలో పర్యటన పూర్తి చేసుకున్న కమిటీ సభ్యులు విజయవాడ, గుంటూరులలో రాజధాని ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఆరుగురు నిపుణులతో కూడిన ఈ కమిటీ జిల్లాలో ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.
ఊహలకు ఊతమిచ్చిన నేతల ప్రకటనలు..
ఇప్పటికే సీమాంధ్ర రాజధాని ఏర్పాటుపై ఊహాగానాలు, భిన్నవాదనలు తెరపైకి రావడం తెలిసిందే. గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు విభజన సందర్భంగా చెబుతూ వచ్చారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలంలు ప్రకటనలు చేశారు. ఇందుకు ఊతమిస్తూ ఫిబ్రవరిలోనే గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, అమరావతి, తాడికొండ, పెదకాకాని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్‌లు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి.
గుంటూరులో సీమాంధ్ర రాజధాని సాధన సమితి పేరుతో జిల్లాలో పలువురు మేధావులు సదస్సులు నిర్వహించారు. గుంటూరు-విజయవాడ-తెనాలి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. గుంటూరు - విజయవాడ నగరాల మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాన్ని రెడీమేడ్‌గా అసెంబ్లీ, ప్రధాన సచివాలయానికి ఉపయోగించుకోవచ్చని, యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 1000కి పైగా ఐజేఎం అపార్ట్‌మెంట్ విల్లాలను ప్రజాప్రతినిధుల, సచివాలయ అధికారుల క్వార్టర్‌లుగా ఏర్పాటుచేసుకునే వీలుందనే దిశగా రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏఎన్‌యూ తరలింపుపై విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు జరిగాయి.
అభివృద్ధికి అనువైన భూములు.. రాజధానిగా మంగళగిరి ప్రాంతం అనువుగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండగా, గుంటూరు కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంగళగిరి ప్రాంతం విజయవాడకు పది కిలోమీటర్ల లోపే ఉండటం, అభివృద్ధికి అనువైన భూములు ఉండటం, అటవీ భూమి అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశాలు. గుంటూరు నగరాన్ని పరిశీలిస్తే.. పక్కనే ఉన్న ప్రత్తిపాడు మండలంలో పాతమల్లాయపాలెంలో ఇప్పటికే సేకరించిన మినీ ఎయిర్‌పోర్టు భూమిని అభివృద్ధి చేసే అవకాశం, గుంటూరులో ఉన్న భారతీయ పొగాకుబోర్డు, కేంద్ర పొగాకు పరిశోధనాసంస్థ, స్పైసెస్‌పార్క్, జాతీయ లాంఫాం కేంద్రం, భారతీయ కాటన్ కార్పొరేషన్‌లు ఉండటంతో అనువైన ప్రాంతంగా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రాజధానిగా ఎంపిక చేయాలంటూ ఈ-మెయిల్స్‌కు కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. జిల్లాలో సోమవారం పర్యటించనున్న కమిటీని జిల్లాలోని మేధావులు, ప్రజా సంఘాల నేతలు కలిసి గుంటూరు ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని తెలియజేయనున్నారు.