Siva Rama Krishnan Committee
-
రాజధానికి ‘ప్లాట్‌ఫామ్’ ముప్పు?
♦ సీడ్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతంలో పెరగనున్న ఎత్తు ♦ 5 చ.కిమీల పరిధిలో 8 అడుగుల మేర ఎత్తు పెంచాలని నిర్ణయం ♦ తీవ్ర ఆందోళనలో రాజధాని గ్రామాల ప్రజలు సాక్షి,హైదరాబాద్ : పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇపుడు అచ్చం అలానే ఉంది. రాజధానికి ఏ ప్రాంతం పనికి వస్తుందో చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదు అన్న నిపుణుల మాట కొట్టిపడేశారు. అమరావతి లోటుపాట్ల గురించి, అక్కడ రాజధాని పేరుతో జరుగుతున్న వృథా ఖర్చుల గురించి ఎవరు మాట్లాడినా వారు రాజధానికి వ్యతిరేకులు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా అక్కడ రాజధాని నిర్మాణం సరికాదని అనేక రకాలుగా నిరూపణ అవుతూ వస్తోంది. రాజధానిలో 13,600 ఎకరాలు, సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 10,600 ఎకరాలు వరద నీటిలో మునిగిపోతాయని సీఆర్డీఏ తేల్చడం తాజా నిదర్శనం. దాంతో రాష్ర్టప్రభుత్వం నష్టనివారణ చర్యలు హడావిడిగా చేపట్టింది. రాజధానిలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎత్తయిన ఫ్లాట్‌ఫాంను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం ఎత్తును పెంచాలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆర్వీ అసోసియేట్స్ కన్సల్టెంట్‌ను సీఆర్డీఏ నియమించింది. ఈ కన్సల్టెంట్ నివేదిక వస్తే గానీ ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం స్థాయిని పెంచాలో చెప్పలేమని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే దాదాపు 8 అడుగుల మేర నిర్మాణ ప్రాంతం ఎత్తు పెరగనుందని అంటున్నారు. రాజధానిలో మొత్తం వరద నీటి నియంత్రణ పనులు చేపట్టడానికి రూ.2,941 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. వర్షాకాలంలో కొండవీటి వాగు వరద వల్ల రాజధాని ప్రాంతంలో 13,600 ఎకరాలు ముంపునకు గురవుతుందని పేర్కొంది. ఇందులో సీడ్ కాపిటిల్ పరిధిలోనే 10,600 ఎకరాలు వరద నీటితో మునిగిపోతాయని సీఆర్డీఏ తేల్చింది. 3.84 టీఎంసీ వరద వస్తుందని, ఇందులో 80 శాతం కేపిటల్ సిటీలోనే వరద ఉంటుందని, అయితే ఈ వరద నీటి వినియోగం ఉండదని, కృష్ణా నది ద్వారా సముద్రంలోకి వెళ్లి పోతుందని సీఆర్డీఏ పేర్కొంది. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా కొండవీటి వాగుకు వరద కాల్వను 30 కిలో మీటర్ల మేర నిర్మిస్తారు. అలాగే ఎర్రవాగు, కోటివాగు, అయ్యన్నవాగు, పాలవాగుకు 53 కిలోమీటర్ల మేర వరద కాల్వను నిర్మిస్తారు. అలాగే ఒక్కో టీఎంసీ చొప్పున వరద నీటిని నిలువరించేందుకు నీరుకొండ, కృష్ణయ్యపాలెం వద్ద పాండ్స్ నిర్మాణం చేపడతారు. కృష్ణా నది ఒడ్డున 29 కిలోమీటర్ల మేర వరద నీరు సులువుగా వెళ్లిపోవడానికి వీలుగా నిర్మాణం చేపడతారు. అలాగే 40 కిలోమీటర్ల మేర వరద నీటి డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులను ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని గ్రామాలకు ముప్పే... క్యాపిటల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎత్తు పెంచితే రాజధానిలోని ఇతర గ్రామాల పరిస్థితి ఏంటనే ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామాలు ముంపునకు గురవుతాయని భయపడుతున్నారు. కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న రాజధానికి కొండవీటి వాగు నుంచి వచ్చే వరద ముప్పు పొంచి ఉందని తొలి నుంచే నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా నదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరద వస్తే రాజధాని ప్రాంతం రోజుల తరబడి వరద ముంపులో ఉంటుంది. కృష్ణా నదిలో 4.50 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్న సమయంలో కొండవీటి వాగు వరద నదిలోకి చేరదు. వెనక్కు తన్నుతుంది. 2009లో సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణాకు వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వైపు ఉన్న కరకట్టను వరద తాకింది. అది సముద్ర మట్టానికి సుమారు 24 మీటర్ల ఎత్తున ఉంది. భవిష్యత్తులో రాజధాని భద్రత దృష్ట్యా ఆ మేరకు నిర్మాణాల ఫ్లాట్‌ఫాం 8 అడుగుల మేర పెంచాలనేది ప్రతిపాదన. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా సీడ్ రాజధాని, తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న డౌన్‌టౌన్ ప్రాంతాన్ని సముద్ర మట్టం కన్నా ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాల్సి వస్తే రాజధాని పరిధిలోని తక్కిన గ్రామాల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వరద నీరు పోవడానికి కొండవీటి వాగు వరదను మళ్లిస్తామని, రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని చెపుతున్నా ఫ్లాష్‌ఫ్లడ్స్ వస్తే తమ గ్రామాలు మునగక తప్పదని స్థానికులు ఆందోళనకు లోనవుతున్నారు. పైగా రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, ఆర్టీరియల్స్ రోడ్లు నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. అవన్నీ రూపుదిద్దుకుంటే వరదనీరు సాఫీగా నదివైపు, దిగువనకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులంటున్నారు. -
చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ!
ఏపీ రాజధాని ప్రకటన వాయిదా వెనుక మతలబిదే... సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై మంగళవారం శాసన సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారంటూ మీడియాకు లీకులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, అంతలోనే అకస్మాత్తుగా దాన్ని వాయిదా వేసుకోవడం సర్వత్రా చర్చనీయంగా మారింది. శాసనసభ ప్రస్తుత సమావేశాలు ఈ నెల 6వ తేదీతో ముగుస్తున్నందున రాజధాని అంశం సభలో ఎక్కువ సమయం పాటు చర్చకు రాకుండా సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తన ప్రకటనను వాయిదా వేసినట్టు చెప్తున్నారు. మంగళవారం ప్రకటన చేయాలని బాబు ముందుగా అనుకున్నప్పటికీ, ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే... రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దానిపై సభలో సమగ్ర చర్చ జరగాలని పార్టీ పట్టుబట్టింది. దాంతో అప్పటికప్పుడు బాబు ప్రకటనను వాయిదా వేసుకున్నారు. కమిటీ సిఫారసులు, నివేదికల వంటి ఏ ప్రాతిపదిక లేకుండా ఏకపక్షంగా రాజధానిపై ఎలా నిర్ణయానికి వస్తారని విపక్షం ప్రశ్నిస్తే ఇబ్బందుల్లో పడతామనే భావనతోనే ఇలా చేశారంటున్నారు. సుదీర్ఘ చర్చకు ఆస్కారం లేకుండా, అసెంబ్లీ సమావేశాల ముగింపు గడువు సమీపిస్తుండగా దాన్ని చర్చకు చేపట్టి సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న ఆలోచనతోనే ఇలా చేశారంటున్నారు. బయటికి మాత్రం... మంగళవారం ముహూర్తం సరిగా లేదన్న సాకు చూపారు. అసెంబ్లీ లాబీల్లో దానికి విస్తృత ప్రచారం కల్పించారు. మంగళవారం అష్టమి మంచిది కాదు కాబట్టే రాజధానిపై ప్రకటనను బాబు వాయిదా వేసుకున్నారని మంత్రులు కూడా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. గురువారం దశమి గనుక ఆ రోజు ప్రకటన చేస్తారంటూ లీకులిచ్చారు. అంతేగాక... శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్రం ఎక్కడ ఆమోదిస్తుందోననే ఆందోళనతో, అలా జరగడానికి ముందుగానే రాజధానిపై ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆ కమిటీ సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టి ‘విజయవాడ-గుంటూరు’ మధ్యలోనే రాజధాని అంటూ ప్రకటన చేయాలని సోమవారం నాటి మంత్రివర్గ భేటీలో నిర్ణయానికి రావడం తెలిసిందే. సన్నిహితులకు లాభం చేకూర్చేలా... రాజధానిపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తీరుపై అధికార టీడీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాంటిది, ఇప్పుడాయన ఏకంగా రాజధానిపై ప్రకటనే చేయడానికి సిద్ధపడటంతో ఆ అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమనే స్థాయికి చేరింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా, తానే వేసిన మంత్రి నారాయణ కమిటీ నివేదిక ఇవ్వకముందే బాబు ఇలా ఇష్టానికి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేమిటని టీడీపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నేతలు భగ్గమంటున్నారు. రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలోనేనంటూ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే అనేకసార్లు బహిరంగ ప్రకటనలు చేయడం, ఆ జిల్లాల మంత్రులు, తదితరులతో పదేపదే ప్రకటనలు చేయించడం తెలిసిందే. దీనిపై ఇతర జిల్లాల్లో తీవ్ర విమర్శలు రేగడంతో తాను మాట్లాడకుండా మంత్రులతో కథ నడిపిస్తున్నారని ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టే తిప్పుతూ తన సన్నిహితులకు, టీడీపీ ముఖ్యులకు, కొందరు బడా రియల్టీ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా బాబు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయంతో ఇబ్బందులే రాజధాని ప్రాంతం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపట్ల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, నేతలు, ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏకపక్షం నిర్ణయమెలా తీసుకుంటారంటూ వారి నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అది తొందరపాటే అవుతుందని మంత్రులు కూడా అభ్యం తరం వ్యక్తంచేశారని సమాచారం. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులపై ఆధారపడాల్సిన తరుణంలో కేంద్రంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తే మున్ముందు ఇబ్బందులు తప్పవని మంత్రులు అంగీకరిస్తున్నారు. ‘పైగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి, బాబే వేసిన నారాయణ కమిటీ కసరత్తయినా పూర్తవకుండానే... రాజధాని ఫలానా చోటేనంటూ ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడిక ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టే’ అని సీనియర్ మంత్రి ఒకరన్నారు. ఆ జిల్లాల నేతల పెత్తనమేంటి? కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల పెత్తనంలోనే రాజధాని ఆలోచనలు సాగడమేమిటని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి ఒకరు మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ప్రశ్నించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడం వెనక మతలబేమిటంటూ ఘాటుగా విమర్శించారు. దీన్ని అసెంబ్లీలోనే ప్రస్తావిస్తానని చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా బాబు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా నేతలూ బాబును తప్పుబడుతున్నారు. రాజధాని ముసుగులో బాబు తన సొంత మనుషులకు లాభం చేకూర్చే వ్యూహంలో ఉన్నారని, వారంతా ఇప్పటికే రైతుల నుంచి వేలాది ఎకరాలను రిజిస్ట్రేషన్లు లేకుండా ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని కొందరు టీడీపీ నేతలే గుర్తు చేస్తున్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా రాజధాని తమకు అనుకూలమైన ప్రాంతంలోనే వచ్చేట్టుగా చూసుకునేందుకు ఆ రెండు జిల్లాల నేతలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండటమూ మరో వివాదానికి దారితీస్తోంది. విజయవాడ నుంచి గుంటూరు వైపు రాజధాని ఉండాలని గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుబడుతున్నారు. ‘‘మంగళగిరి వద్ద భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగాఉన్నారు. రాజధానికి ఎన్టీరామారావు పేరు పెడితే మా జిల్లా రైతులు 8 వేల ఎకరాలిచ్చేందుకు సిద్ధం’’ అని ఆయన మంగళవారం అన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమ రాజధాని తమ ప్రాంతం వైపే ఉండాలని పట్టుబడుతున్నారు. భగ్గుమంటున్న కేఈ రాజధాని భూసేకరణ కమిటీలో ఉండేందుకు ససేమిరా రాజధాని భూ సేకరణకు సీఎం చంద్రబాబు నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యునిగా ఉండేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిరాకరించారు. సోమవారం జరిగిన మంత్రిమండలి భేటీలో ఈ ఉపసంఘాన్ని నియమించడం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కేఈని కూడా సభ్యుడిగా ఉండాలని బాబు సూచిం చగా ఆయన నిరాకరించారు. రాజధాని ప్రాంతం ఎంపిక తీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పైగా గతంలో మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని నిర్మాణ సలహా కమిటీ వేసినప్పుడు తనను విస్మరించడం కూడా ఇందుకు కారణమేనంటున్నారు. ఇప్పటికే ఒకసారి రాజధానిని కోల్పోయిన రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా అలాంటి కమిటీలో ఉంటే తన ప్రాంత ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొనాల్సి ఉంటుం దని కూడా కేఈ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే, సీమ నేతగా మరో చోట రాజధాని ఏర్పాటుకు భూమిని సేకరించే ప్రయత్నాల్లో భాగస్వామిని కాలేనని కేఈ తేల్చిచెప్పినట్టు సమాచారం. దాంతో కేఈ స్థానంలో అచ్చెన్నాయుడుకు కమిటీలో స్థానం కల్పించారు. -
మరో 5 విమానాశ్రయాలు..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాడుకలో ఉన్న 8 విమానాశ్రయాలకు తోడు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలను నిర్మించాల్సిన అవసరముందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని సూచించింది. పుట్టపర్తి, కడప, రాజమండ్రి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలలో విమానాశ్రయాల ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన, కొత్తగా నిర్మించే పోర్టుల నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. విశాఖపట్నం మేజర్ పోర్టు, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ పోర్టులతో పాటు.. నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, మేఘవరం, నక్కపల్లి, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టులను అభివృద్ధి చేసుకోవడానికి.. అలాగే ప్రతిపాదనల్లో ఉన్న కళింగపట్నం, భావనపాడు, దుగ్గరాయపట్నం, రామయపట్నం, భీమునిపట్నం, నర్సాపురం వంటి ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని చెప్పింది. గోల్డెన్ క్వార్డీలేటరల్ ప్రధాన రహదారితో పాటు ఉత్తర - దక్షిణ కారిడార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రహదారి మార్గం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పెరిగే అవసరాల దృష్ట్యా అన్ని ప్రధాన రహదారులను విస్తరించాల్సిన అవసరముందని పేర్కొంది. -
సర్కార్ ల్యాండ్ ఫూలింగ్!
* ల్యాండ్ పూలింగ్‌లో ఎకరాకు రూ. 1.11 కోట్లు ఖర్చు చేయాలి * భూసేకరణకు మూడు నాలుగేళ్లు పడుతుంది * విజయవాడ - గుంటూరు రీజియన్‌లో తీవ్ర సమస్యలు * ఒకే ప్రాంతంలో పెద్ద విస్తీర్ణంలో స్థలాలు లభ్యం కావు సాక్షి, హైదరాబాద్ : ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల నుంచి భూముల సేకరణ ద్వారా తక్కువ ఖర్చుతో రాజధానికి భూములు సమకూర్చుకోవచ్చంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అంచనాలు తప్పని శివరామకృష్ణన్ కమిటీ నిరూపించింది. ఈ విధానంలో సేకరించిన భూమిని అభివృద్ధి చేసి 40 శాతం భూమిని తిరిగి రైతుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే. ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక్క ఎకరా ప్రభుత్వం చేతిలోకి రావాలంటే రూ. 1.11 కోట్లు ఖర్చు చేయాలని కమిటీ విశ్లేషించింది. ‘‘పూర్తిస్థాయిలో భూసేకరణ చేయడానికైనా, ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించడానికైనా సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. పాలనా పరమైన జాప్యం జరిగితే మరింత ఆలస్యమవుతుంది. భూసేకరణలో పట్టే సుదీర్ఘ సమయమే ప్రధాన అవరోధంగా మారుతుంది’’ అని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఎకరా ఇస్తే తమకు 40 సెంట్లు (40 శాతం) తిరిగి వస్తుందనే భావనలో రైతులు ఉన్నారు. వారికి వచ్చేది 24 సెంట్లు (24 శాతం). మరి 24 శాతానికి రైతులు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంలో అనుమానం ఉంది. విజయవాడ - గుంటూరు రీజియన్‌లో ఈ అంశం మీద తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) ఆధారిత ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సేకరించడం ద్వారా భూసేకరణను తక్కువ నిధులతో పూర్తి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కారు పేర్కొంది. ఈ మేరకు డీటీసీపీ (డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) వేసిన అంచనాలు సరిగా లేవు. వీజీటీఎం రీజియన్‌లో 1,458 ఎకరాల భూములు (తర్వాత 5-10 వేల ఎకరాలకు పెంచాల్సి ఉంటుంది) ఈ విధానంలో సేకరించడం సరైన మార్గమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రైతుల వద్ద తీసుకున్న భూమిలోనే వారికి వాటా ఇస్తే.. ప్రభుత్వానికి ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థలాలు లభించడం సాధ్యం కాదు. ఫలితంగా కేంద్రీకృతంగా పరిపాలనా కేంద్రం నిర్మించడానికి వీలు కాదు. ప్రతి ప్రభుత్వ స్థలం పక్కనే ప్రయివేటు భూమి ఉంటుంది. రాజధాని అంతా ఇదే పరిస్థితి ఉంటుంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చేస్తే... కొత్త భూసేకరణ చట్టం (ఎల్ఏఆర్ఆర్) ప్రకారం.. పాలనా పరమైన జాప్యం లేకుండా చేస్తే, భూసేకరణకు కనీసం 3-4 సంవత్సరాల సమయం అవసరం. ల్యాండ్ పూలింగ్ విధానంలో కూడా భూసేకరణకు కనీసం 4 సంవత్సరాలు కావాలి. ఏ కారణం వల్ల అయినా జాప్యం జరిగితే ఐదారేళ్లు పడుతుంది. భూసేకరణ ప్రకటన, వాస్తవ భూసేకరణకు మధ్య సుదీర్ఘ వ్యత్యాసం ఉంటే.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అదే జరిగితే.. కొత్త చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించడం మరీ భారమవుతుంది. భూసేకరణలో జాప్యం జరిగితే వడ్డీలు భారమైపోతాయి. ఫలితంగా రాజధాని నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన భారాన్ని భరించలేకపోతే.. ప్రతికూల ఫలితాలు వస్తాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాల ధరలను కమిటీ పరిశీలించింది. ఈ ధరలు తెలుసుకోవడానికి ‘ఇండియా ప్రాపర్టీ’ లాంటి వాణిజ్య వెబ్సైట్లను వాడుకుంది. విజయవాడ పరిసరాల్లోని రామవరప్పాడులో నివాస స్థలాలు ఎకరా ధర రూ. 3.87 కోట్ల నుంచి 6.98 కోట్లు ఉంది. నున్నలో వ్యవసాయ భూముల ధరలు ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ. 1.12 కోట్లు ఉంది. ఇవి ప్రాథమిక (బేస్) ధరలు. వాస్తవంగా చెబుతున్న రియల్ ఎస్టేట్ ధరలతో పోలిస్తే ఇవి మరీ తక్కువగా ఉన్నాయి. ఈ ధరల్లో భూ సేకరణకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం సాధారణ విషయం కాదు. ల్యాండ్ పూలింగ్ విధానంలో ఈ ధరల ప్రకారం రైతుకు వచ్చే 24 శాతం వాటా భూమి ధర ఆ మేరకు పెరుగుతుందనే విషయంలో రైతులకు అనుమానాలుంటాయి. కొత్త రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూములు సేకరించిన చరిత్ర దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు. పరిమిత అవసరాలకు ఈ విధానాన్ని అనుసరించారు. కొత్త భూసేకరణ చట్టాన్ని వినియోగించి పెద్ద ఎత్తున భూసేకరణ కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఈ రెండు విధానానాల్లో వచ్చే సమస్యలను గత అనుభవాల ఆధారంగా అంచనా వేయలేం. పశ్చిమబెంగాల్ సింగూరులో 2006లో చెలరేగిన భూసేకరణ వ్యతిరేక నిరసనలు తర్వాత దేశవ్యాప్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్త భూసేకరణ చట్టం వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా హర్యానా, రాజస్థాన్‌లలో.. యమునా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుపై నోయిడాలో, జైపూర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై జైపూర్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలపైన రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. బళ్లారిలో విమానాశ్రయం నిర్మాణానికి సారవంతమైన భూముల సేకరణను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భూసేకరణలో వచ్చే ముందస్తు సమస్యలను గుర్తించి అధిగమించాలి. ‘ల్యాండ్ పూలింగ్’కు చట్టబద్ధత తప్పనిసరి రాజధాని కోసం భూసేకరణ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి (ఏపీయూడీ) చట్టంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత ఉండాలంటే చట్టంలో మార్పు తప్పనిసరని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్ నిబంధనలనూ రూపొందించాలని సూచించింది. గతంలో విశాఖపట్నం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (వుడా)కి పరదేశిపాలెం, చెర్లోపాలికందం ప్రాంతంలో భూసేకరణ సమయంలో తగిన చట్టం లేకపోవడం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. హెదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూపొందించిన ల్యాండ్ పూలింగ్ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది. వీజీటీఎం ప్రాంతంలో భూ సేకరణకు హెచ్ఎండీఏ చట్టాన్ని వినియోగించడానికి వీల్లేదు కాబట్టి.. ఏపీయూడీ చట్టానికి చేర్చే అధ్యాయానికి అనుగుణంగా వీజీటీఎం చట్టాన్ని రూపాందించాలని సూచించింది. భూ సేకరణకు అనుగుణంగా చట్టం చేసుకునే అవకాశాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కల్పించిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ‘కొత్త రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు కావాలని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ తొలి దశలో 1,458 కావాలని కమిటీకి టౌన్ ప్లానింగ్ విభాగం నివేదించింది. అంతకంటే ఎక్కువ భూమి కావాల్సి వస్తే దశల వారీగా సేకరించాల్సిన భూమి వివరాలను ఇవ్వలేదు. తొలి దశలో సేకరించిన భూమితోనే రాజధాని నిర్మిస్తారా?’ అని కమిటీ ప్రశ్నిం చింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మూడింట రెండొంతుల మంది రైతులు భూసేకరణకు అంగీకరించాలనే నిబంధన పెద్ద అడ్డంకి అవుతుందనే అనుమానం వ్యక్తంచేసింది. భూ రికార్డులు, ఇతర న్యాయ సమస్యలు ఉన్నప్పుడు అనుసరించాల్సిన మార్గాన్ని ముందే నిర్ధారించుకోవాలని సూచించింది. నిర్వాసితులు ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చే విధానాన్ని దక్షిణాసియాలో అనుసరిస్తున్నారని పేర్కొంది. ఢిల్లీ, గుర్గాం, నవీ ముంబై, మాగరపట్ట, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో భూసేకరణకు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. జపాన్, దక్షిణ కొరియాలో అనుసరించిన ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు విధానాన్ని పరిశీలించాలని సూచించింది. -
ఆ మూడు జోన్లే మేలు
రాజధానికి 3 జోన్లు, 4 ప్రాంతాలను సూచిస్తూ శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదిక 3 జోన్లలో విశాఖ, రాయలసీమ, కాళహస్తి-నడికుడి మార్గం 4 ప్రాంతాల్లో గ్రేటర్ విశాఖ, విజయవాడ-గుంటూరు, నెల్లూరు, తిరుపతి - కాళహస్తి ఏపీ రాజధాని ఏర్పాటుపై అధ్యయన కమిటీ అపాయింటెడ్ డే నుంచి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని విభజన చట్టం చెప్పింది. కానీ కమిటీ ఏర్పాటుకు మార్చి 28న నోటిఫికేషన్ ఇచ్చారు. మధ్యలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో 12 వారాల సమయాన్ని మాత్రమే వినియోగించుకోగలిగాం. 11 జిల్లాలో తిరిగి ప్రజాభిప్రా యాన్ని సేకరించాం. ఈ మెయిళ్ల రూపం లో 4,728 సలహాలు వచ్చాయి. - కమిటీ వైజాగ్ జోన్: ఈ జోన్లో విశాఖపట్నం అభివృద్ధి ప్రాధికార సంస్థ, శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఉంటుంది. ఇది హైటెక్ జోన్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంది. భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పోర్టులు ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో పెట్రోకారిడార్తో భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వందకు పైగా డెరైక్టరేట్లు, కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేయవచ్చు. కాళహస్తి స్పైన్: ప్రతిపాదిత నడికుడి - కాళహస్తి రైలు మార్గం వెంట భారీ అభివృద్ధికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఈ మార్గం దోహదపడుతుంది. 300 కి.మీ. పొడవుండే ఈ మార్గం కృష్ణపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు, వినుకొండ రైల్వే జంక్షన్‌ను కలుపుతుంది. వైజాగ్-చెన్నై కారిడార్‌కు సమాంతరంగా ఈ రైల్వే లైను పనిచేస్తుంది. రాయలసీమ ఆర్క్: కర్నూలు నుంచి చిత్తూరు వయా అనంతపురం, తిరుపతి, కడప ప్రాంతం. ఇక్కడ రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. ఈ ప్రాంతంలో హైదరాబాద్ - కర్నూలు - అనంతపురం - బెంగళూరు రహదారితో పాటు పలు కొత్త రహదారులు భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో ట్రాన్‌పోర్టు కారిడార్‌గా అభివృద్ధి అయ్యేందుకు దోహదపడుతాయి. అయితే ఈ ప్రాంతంలో నీటి లభ్యతకు గల అవకాశాలను తక్షణం సమీక్షించాల్సిన అవసరముంది. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు 3 జోన్లు, 4 పొటెన్షియల్ (మంచి అవకాశాలు గల) ప్రాంతాలను కె. సి. శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ ఈ నెల 27న తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సాయంత్రం ఈ నివేదికను పరిశీలించారు. కమిటీ తన నివేదికలో.. రాజధాని ఏర్పాటుకు సామర్థ్యం కలిగిన జోన్లుగా విజయవాడ-గుంటూరు, గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి-శ్రీకాళహస్తిలను గుర్తించింది. అయితే.. వీటిలో విజయవాడ- గుంటూరు ప్రాంతం అనేక కారణాల దృష్ట్యా సరికాదని వివరించింది. అలాగే.. అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని విశాఖ జోన్, రాయలసీమ ఆర్క్, కాళహస్తి-నడికుడి స్పైన్ రీజియన్లను గుర్తించినట్టు కమిటీ పేర్కొంది. రాజధాని ప్రాంతాన్ని గుర్తించేం దుకు 3 తరహాల్లో ఆలోచించినట్టు కమిటీ తెలిపింది. ఒకటి.. ఒకే చోట సూపర్ సిటీ ఏర్పాటు కోసం గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటు చేయడం. రెండోది.. ఉన్న నగరాలను విస్తరించడం. మూడోది.. అభివృద్ధిని వికేంద్రీకరించడం. ఈ మూడు కోణాల్లో ఆలోచించి పలు సిఫారసులు చేసినట్లు తెలిపింది. అయితే.. ఒకే చోట సూపర్ సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కమిటీ కొట్టిపారేసింది. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే చోట భూమి దొరకడం కష్టమని పేర్కొంది. అందువల్ల ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది. హైదరాబాద్‌లో ఈ తరహా అభివృద్ధి చివరకు ఉమ్మడి రాష్ట్రం విభజనకు దారితీసిందని పేర్కొంది. అలాగే నగరాలను విస్తరించాలనుకున్న ప్రతిపాదనను కార్యరూపంలోకి తెస్తే సరైన అధ్యయనాలు, అంచనాలతో ముందుకు సాగాలని సూచించింది. తాత్కాలిక పద్ధతిలో ముందుకు సాగితే పర్యవసానాలు ప్రతికూలంగా ఉంటాయని చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ మార్గం ఎంచుకుంటే ఏ శాఖ కార్యాలయాలు ఎక్కడ ఉండాలో అధ్యయనం చేయాలని సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఇలా... రాజధాని ఏర్పాటుకు మూడు జోన్లను గుర్తించిన కమిటీ.. ఆయా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాట్లను విస్తరించుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడింది. వైజాగ్ జోన్, శ్రీకాళహస్తి స్పైన్, రాయలసీమ ఆర్క్‌గా వీటిని పేర్కొంది. ఈ మూడు ప్రాంతాల విషయంలో కమిటీ సూచనలు ఇలావున్నాయి... వైజాగ్ జోన్: ఈ జోన్లో విశాఖపట్నం అభివృద్ధి ప్రాధికార సంస్థ, శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఉంటుంది. ఇది హైటెక్ జోన్‌గా ఎదిగేందుకు అవకాశముంది. రాయలసీమ ఆర్క్: కర్నూలు నుంచి చిత్తూరు వయా అనంతపురం, తిరుపతి, కడప ప్రాంతం. ఇక్కడ రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిగా ఉన్న కర్నూలును విస్మరించడం చారిత్రక తప్పిదమే అవుతుందన్న భావన ఈ ప్రాంతంలో అధికంగా ఉంది. శ్రీభాగ్ ఒప్పందం నిర్లక్ష్యానికి గురైందన్న వాదన ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు నీటిని ఎక్కడి నుంచో తెచ్చుకోగా లేనిది రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే తెచ్చుకోలేమా? అన్న వాదన ఉంది. కాళహస్తి స్పైన్: ప్రతిపాదిత నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం వెంట భవిష్యత్తులో భారీ అభివృద్ధికి అవకాశముంది. 300 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం కృష్ణపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు, వినుకొండ రైల్వే జంక్షన్‌ను కలుపుతుంది. గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి ఆధారిత నోడల్ నగరాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. విజయవాడ-గుంటూరు అవాంఛనీయం విజయవాడ-గుంటూరుకు రాజధాని సామర్థ్యం ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు ఎందుకు వాంఛనీయం కాదో శివరామకృష్ణన్ కమిటీ సవివరంగా విశ్లేషించింది. విజయవాడకు నీటి లభ్యత, కనెక్టివిటీ మాత్రమే అనుకూల అంశాలనీ పేర్కొంది. విజయవాడ-గుంటూరు పరిధిలో ఏవైనా కార్యాలయాలు ఏర్పాటు చేయదలిస్తే పరిణామాలు తీవ్రమవుతాయి. ప్రణాళిక లేని మౌలిక వసతుల విస్తరణ కష్టతరమవుతుంది. ఇతర ప్రాంతాల అభివృద్ధిపై పెను ప్రభావం పడుతుంది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేట్ కేంద్రంగా మారుతుంది. దేశంలోనే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి అత్యుత్తమ సాగు భూములను కలిగి ఉండడమే కాకుండా.. దేశం మొత్తం వరి ఉత్పత్తిలో ఒక శాతానికి పైగా వాటా ఉంది. అంతేకాకుండా దేశ ధాన్యాగారంగా కూడా దీనికి పేరుంది. విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం దాదాపు 7,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. వీజీటీఎం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కమిటీ బలంగా సిఫార్సు చేస్తోంది. హైదరాబాద్ తరహాలో ఇక్కడ రింగ్ రోడ్డు ప్రతిపాదన సరికాదని, రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడం మిన హా ఒరిగే దేమీ ఉండదని కమిటీ తేల్చిచెప్పింది. సాగుభూములన్నీ నాశనమవుతాయి... ‘‘కమిటీకి అప్పగించిన విధివిధానాల్లో ప్రధానమైన ‘ప్రస్తుత సాగు భూములకు తక్కువ నష్టం వాటిల్లడం’ అనే అంశం ఆధారంగా చూస్తే.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి దేశంలో అత్యుత్తమ సాగుభూములున్న జిల్లాలు. గుంటూరులో దాదాపు 49 లక్షలు, కృష్ణాలో 45 లక్షల జనాభా ఉండగా.. గుంటూరులో 23.8 లక్షలు, కృష్ణాలో 20.48 లక్షల కార్మికులు, కూలీలున్నారు. ఈ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో గుంటూరులో 65 శాతం, కృష్ణాలో 56 శాతం కేవలం వ్యవసాయదారులు, రైతు కూలీలే. రింగ్ రోడ్డు వెంట ఏదైనా వ్యవసాయ క్షేత్రాల్ని వ్యవసాయేతర భూము లుగా మార్చాలని చూస్తే ఈ వర్క్‌ఫోర్స్ నిరుద్యోగులుగా మారుతారు. విలువైన వ్యవసాయ భూములను కోల్పోతాం.. చిన్న కమతాలు దూరమవుతాయి’’ అని కమిటీ వివరించింది. తాత్కాలికం.. కొనసాగింపు: గుంటూరు, విజయవాడలో అదనపు ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని కమిటీ హెచ్చిరించింది. కేవ లం సీఎం, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాల వరకు పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది. త్వరితగతిన శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాన్ని పూర్తిచేసేలా ప్రయత్నించాలని సూచించింది. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ.. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ.. రాష్ట్ర రాజధానిలో ఈ మూడు కీలకమైనవని.. రాజకీయ రాజధానికి ఇవి సంకేతాలని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. రాజ్‌భవన్‌కు 15 ఎకరాల భూమి అవసరమవుతుందని, ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిలో ఉన్న రాజ్‌భవన్‌ను వినియోగించుకుని.. కొంత కాలం తరువాత దీనిపై నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు విషయంలో కూడా నాలుగైదేళ్ల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడింది. హైకోర్టును, వివిధ ట్రిబ్యునళ్లను విశాఖలో ఏర్పాటుచేసుకోవచ్చని, రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటుచేసుకోవచ్చని సూచించింది. అసెంబ్లీ విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించింది. ఉత్తరాఖండ్‌లో తొలుత గైర్సేన్ను రాజధానిగా అనుకున్నప్పటికీ తాత్కాలికంగా డె హ్రాడూన్లో ఏర్పాటుచేసి దానిని ఇప్పటివరకు అలాగే కొనసాగిస్తున్నారని పేర్కొంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు అత్యవసరం అనుకుంటే తాత్కాలికంగా నూజివీడు, గన్నవరం, ముసునూరులను పరిశీలించవచ్చని పేర్కొంది. డెరైక్టరేట్లు, కమిషనరేట్ల విషయంలో కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంలో, ఒంగోలులో పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత కార్యాలయాలు ప్రకాశం జిల్లాలో, అన ంతపురంలో విద్యకు సంబంధించిన కార్యాలయాలు, నెల్లూరులో సాగునీటికి, వైద్యానికి సంబంధించిన కార్యాలయాలు, కడపలో సంక్షేమానికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవచ్చని సూచించింది. అవి అనధికార సూచనలే... ‘2014 జూలైలో ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కొంత సమాచారం ఇచ్చింది. అలాగే రాజధాని కోసం 8 ప్రాంతాలను సూచించింది. మధ్య ఆంధ్రలో ఉన్న ఈ ప్రాంతాలు విజయవాడ - గుంటూరుకు దగ్గరగా ఉన్నవే. ముసునూరు ఒక్కటే ఏలూరు సమీపంలో ఉంది. మిగిలినవి పులిచింతల, మాచర్ల, బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, మంగళగిరి. అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఈ ప్రతిపాదనలన్నీ అనధికారమేనని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదని మాతో చెప్పింది. అందువల్ల ఈ ప్రాంతాలపై మరింత లోతుగా సమీక్షించలేకపోయాం’’ అని కమిటీ వివరించింది. రాష్ట్ర సర్కారు సమాచారం ఇవ్వలేదు... రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉన్న భారీ క్లస్టర్లను సూచించాలని కమిటీ కోరినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ‘‘దురదృష్టవశాత్తూ కమిటీ కోరిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఇవ్వలేదు. జిల్లా కేంద్రాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను మాత్రమే పంపింది. ఈ భూములూ అసైన్డ్ భూములేనని తెలిసింది’’ అని కమిటీ వెల్లడించింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఆస్పత్రులు కావాలి ‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూనే స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొన్నాయి. ఇక్కడే చాలామంది ఆస్పత్రులపై పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రం విడిపోయాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సరైన ఆస్పత్రులే లేవు. పుట్టపర్తి, తిరుపతిలో మినహా ఎక్కడా స్పెషాలిటీ హాస్పిటళ్లు లేవు. బోధనాసుపత్రులు కూడా వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి.’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. రూ. 27,087 కోట్లు అవసరం రాష్ట్ర రాజధానిలో భవనాలు, మౌలిక వసతులు, వంటి అంశాలకు పెట్టుబడులను శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. క్యాపిటల్ జోన్ భవనాలు, వసతులకు రూ. 10,519 కోట్లు, క్యాపిటల్ జోన్ మౌలిక వసతులకు రూ. 1,536 కోట్లు, నగర మౌలిక వసతుల నవీకరణకు రూ. 5,861 కోట్లు, నగర మౌలిక వసతుల విస్తరణకు రూ. 9,181 కోట్లు.. ఇలా మొత్తంగా 27,097 కోట్లు అవసరమని తెలిపింది. సామర్థ్యం ఉన్న ప్రాంతాలు నాలుగు రాజధాని ఏర్పాటుకు మూడు జోన్లను సూచించడమే కాకుండా.. నాలుగు పొటెన్షియల్ ప్రాంతాలను కూడా శివరామకృష్ణన్ కమిటీ గుర్తించింది. అవి విజయవాడ - గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి - కాళహస్తిలుగా పేర్కొంది. జిల్లా, రాజధాని ప్రాంతం, సరిపోయే సూచీ అనే అంశాలతో వాటిని విశ్లేషించింది. అందుకు.. నీరు, ప్రమాద అవకాశం (రిస్క్), అనుసంధానం (కనెక్టివిటీ), భూమి, ప్రాంతీయ అభివృద్ధి అనే ఐదు కీలక అంశాలను ఆధారంగా చేసుకుంది. నీటి విషయంలో 110 ఏళ్ల వర్షపాతం సగటును, సమీప నదీ జలాలను పరిగణనలోకి తీసుకుంది. రిస్క్ విషయంలో భూకంపాలు, తుపాన్లు, జనసాంద్రత-ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. కనెక్టివిటీ విషయంలో మెట్రో నగరాలు, ఇతర నగరాల దూరాన్ని, రైల్వే, విమాన, రోడ్డు కనెక్టివిటీని పరిగణనలోకి తీసుకుంది. ఆ ప్రాంతాలది వేటికదే ప్రత్యేకత అంశాల ప్రకారంగా చూస్తే.. విజయవాడ-గుంటూరు, గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి-శ్రీకాళహస్తిలను కమిటీ గుర్తించింది. వీటిలో వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయని పేర్కొంది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా, విద్యాసంస్థలకు నెలవుగా ఉందని, నెల్లూరు.. కోస్తాంధ్ర, రాయలసీమకు మధ్యనున్న ముఖ్య నగరమని పేర్కొంది. విశాఖ భారీ పరిశ్రమలకు, పోర్టులకు నెలవుగా ఉందని చెప్పింది. విజయవాడ-గుంటూరు వ్యవసాయాధారిత అభివృద్ధి ప్రాంతమని, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతమని తెలిపింది. విశాఖలో అన్ని హంగులు ఉన్నా.. మిగతాప్రాంతాలతో కనెక్టివిటీ తక్కువని పేర్కొంది. రాయలసీమలోని అన్ని జిల్లా కేంద్రాలు అన్ని అంశాల్లోనూ మైనస్‌లో ఉన్నప్పటికీ ఒక్క కడప, తిరుపతిలో భూమి లభ్యత, కర్నూలులో కనెక్టివిటీ ఉందని పేర్కొంది. భూసేకరణ భరించలేని కష్టం విజయవాడ - గుంటూరులో రాజధాని కార్యకలాపాలు మొదలుపెడితే మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న భూమి చాలా స్వల్పమేనని పేర్కొంది. ‘‘ఏపీ ప్రభుత్వం అనధికారికంగా ఇంకో సూచన కూడా చేసింది. గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో రాజధాని కార్యకలాపాలను ప్రస్తావించింది. అయితే ఇక్కడ భూమి లభ్యత లేదు’’ అని స్పష్టంచేసింది. వీజీటీఎం ప్రాంతంలోని నూజివీడు, ముసునూరు, అమరావతి, పులిచింతల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటును పరిశీలించవచ్చని పేర్కొంది. వీజీటీఎంలోనే రాజధాని కార్యకలాపాలు ఏర్పాటుచేసుకోవాలనుకుంటే భూసేకరణ భరించలేని కష్టంగా మారుతుందని కూడా తేల్చిచెప్పింది. -
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన
నూతన రాజధానిని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినశివరామకృష్ణన్ కమిటీ సభ్యుల రాకను విద్యార్థి, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు,మేధావులు స్వాగతించలేకపోయారు. కేవలంకంటితుడుపు చర్యగానే కమిటీ సభ్యుల పర్యటన ఉన్నట్లు పెదవి విరిచారు. సాక్షి ప్రతినిధి, కడప: గుంటూరు-విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందనున్నాయి.. రాజధాని ఏర్పాటుకు అక్కడే అనువైన ప్రాంతం. పన్నెండున్నర వేల ఎకరాలు ఉంటే చాలు రాజధానిని ఏర్పాటు చేయవచ్చు అంటూ నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గం ఉపసంఘం ప్రకటనలు చేస్తోంది. అలాంటి తరుణంలో శివరామకృష్ణన్ కమిటీ జిల్లా పర్యటన కంటితుడుపు చర్యేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మమ అన్పించేందుకు చిట్టచివరన జిల్లాలో పర్యటించారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు.. ఇప్పటి వరకూ చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపధ్యంలో ఇప్పటికే రాజధాని ఏర్పాటులో నిర్ణయం జరిగిపోయిందనే భావన వ్యక్తం అవుతోంది. విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన నేపధ్యంలో విభజన బిల్లులో రాజధాని అంశం పొందుపర్చాల్సి ఉంది. రాజధాని అంశం చేర్చకుండా పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు తెరపైకి వచ్చాయని ఆమేరకే మునపటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేయలేదని మేధావులు వాపోతున్నారు. రాజధాని ఏప్రాంతంలో బాగుంటుందో సూచించాలని శివరామకృష్ణన్ కమిటీని వేసిన ప్రభుత్వ పెద్దలు ముందే తొందరపడుతున్నారు. కమిటీ సిఫార్సులు అందకమునుపే రాజధాని అంశంపై వారికి తోచిన ప్రాంతాన్ని సూచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజధాని కమిటీ సలహా మండలిని నియమించింది. వారు సైతం ఇప్పటికే ఒక అవగాహనకొచ్చి ప్రకటలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిట్టచివరన వైఎస్సార్ జిల్లాలో శివరామకృష్ణన్ కమిటీ సోమవారం పర్యటన చేసింది. మమ అన్పించుకునేందుకు మినహా సహేతుకంగా కమిటీ చర్యలు లేవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మభ్యపెట్టేందుకే పాలకుల కుయుక్తులు.... ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడైతే బాగుంటుందో సూచించాలని ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలలో పర్యటించింది. కమిటీ నిర్ధారణకు రాకమునుపే గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆప్రకటన వెలువడ్డాక పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మంత్రి వర్గం నేతృత్వంలో రాజధాని ఏర్పాటు సలహా కమిటీని నియమించారు. రాష్ట్ర విభజనకు మరోమారు అస్కారం లేకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా నినాదం అందుకుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ భూములు 50వేల ఎకరాలున్నచోట రాజధాని ఏర్పాటు చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. అయితే 12500 ఎకరాల్లోనే రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మండలి ఎటుతిరిగి గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలనే తలంపు ఉన్నట్లు రూఢీ అవుతోంది. ఈ నేపధ్యంలో రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసేందుకు, మభ్యపెట్టేందుకు పాలకుల కుయుక్తులే శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయమని పలువురు ఆరోపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని మేధావులు, రాజకీయ నేతలు, ఉద్యోగ, విద్యార్థి వర్గాల నుంచి వ్యతిరేక వ్యక్తం కాకుండా ఉండేందుకు వ్యూహత్మకంగా పాలకులు అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. భాషా ప్రయోక్త రాష్ట్రం ఏర్పాటు నాటినుంచి రాయలసీమకు అన్యాయం చేస్తున్న కోస్తానాయకులు రాజధాని విషయంలో మరోమారు వంచనకు గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. సీమ భూములను బీళ్లుగా మార్చి కృష్ణా జలాలను తరలించుకెళ్తున్న కోస్తా నేతల కబంధ హస్తాల్లో పసుపునేత చిక్కుకుపోయారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఆకారణంగా కర్నూలు రాజధాని అంశాన్ని తెరమరుగు చేస్తున్నారని సీమ వాసులు వాపోతున్నారు. -
‘సీమ’లోనే రాజధాని
లేదంటే మరో విభజనకు పోరు శివరామకృష్ణన్ కమిటీ ఎదుట నేతల స్పష్టీకరణ నవ్యాంధ్ర రాజధానిని రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో విభజనకు పోరు మొదలవుతుందని స్పష్టంచేశారు. రాజధాని అంశంపై సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన కమిటీ సభ్యులు అరోమర్ రేవి, కేటీ రవీంద్రన్ కడప కలెక్టరేట్ సభా భవనంలో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఇంకా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎ.రఘునాథరెడ్డి, మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నోలు సుబ్బరాయుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కె.వెంకట్రామిరెడ్డి, బి.ఎన్. బాబు, చిన్న సుబ్బయ్య యాదవ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పులిమి ప్రసాద్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మీగడ నారాయణరెడ్డి, మైదుకూరు రైతు సేవా సమితి అధ్యక్షుడు డి.ఎన్. నారాయణ, తదితరులు తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కడప సెవెన్‌రోడ్స్ కడప ఎడ్యుకేషన్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ స్టూడెంట్ యూనియన్ నాయకులు శివరామకృష్ణన్ కమిటీని కోరారు. సోమవారం కడపకు వచ్చిన కమిటీని ఆర్ఎస్యూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. 1953 నుంచి 1956 వరకు రాయలసీమలోని కర్నూలు రాజధానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్‌రెడ్డి అన్నారు. అప్పుడు రాజధానిని త్యాగం చే సిన కర్నూలులోనే ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్యూ అధ్యక్షుడు జయవర్దన్, కోశాధికారి నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఓబయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ భూములున్న చోటే .. ప్రభుత్వ భూములు లభ్యమయ్యేచోటే రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానికి సేకరించిన భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం వినియోగించుకొని మిగిలిన భూమిని వేలం ద్వారా అమ్మితే రూ.లక్ష కోట్లు వచ్చేందుకు అవకాశముంది. ఆ డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోస్తాలో భూసేకరణ తలకు మించిన భారమే. - రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు కాదంటే మరో ఉద్యమమే.. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉంంది. ఇప్పటికే సీమ అన్ని విధాలా మోసపోయింది. రాజధాని ఏర్పాటుకు కనీసం 50 నుంచి 60 వేల ఎకరాల భూమి సేకరించడం కోస్తాలో సాధ్యపడదు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టు, కొత్త కలెక్టరేట్, రిమ్స్, రవాణా తదితర సౌకర్యాలన్నీ జిల్లాలో ఉన్నాయి. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి మరో విభజనకు ఆస్కారమివ్వొద్దు రాజధాని ఏర్పాటు అంశం మరో విభజనకు ఆస్కారం లేకుండా ఎంపిక చేయాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. రాజధానికి కడప అన్ని రకాల యోగ్యకరంగా ఉంది. రాజధాని ఏర్పాటు రాయలసీమ హక్కు. ఇవన్నీ విస్మరించి ఓ వైపు కమిటీ వేస్తూనే మరోవైపు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మరోసారి విభజన కాకుండా నిర్ణయం తీసుకోవాలి. - పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం -
కర్నూలు కాదంటే ఉద్యమమే
రాజధానిపై తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కర్నూలులో అభిప్రాయాలు సేకరించిన శివరామకృష్ణన్ కమిటీ సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని పరిశీలించడానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే.. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కమిటీ మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నూతన ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలునే రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలులో పర్యటించింది. కలెక్టరేట్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సమయంలో రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ఆడిటోరియంలోకి చొచ్చుకువచ్చి కమిటీ సభ్యుల్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణి గాంధీ, ఐజయ్య తమ అభిప్రాయాలను తెలుపుతూ.. 1956లో కర్నూలు ప్రజలు రాజధానిని త్యాగం చేశారని గుర్తు చేశారు. -
రేపు కర్నూలుకు శివరామకృష్ణన్ కమిటీ రాక
- అభిప్రాయాలను రాత పూర్వకంగా ఇవ్వవచ్చు : కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి - 7వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష కర్నూలు(కలెక్టరేట్): కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈనెల 7వ తేదీ కర్నూలుకు రానుంది. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటించిన ఈ కమిటీ ఎట్టకేలకు కర్నూలు వచ్చి ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు కానుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ కర్నూలుకు వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అప్పుడు త్యాగం చేసి నష్టపోయినందున ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలునే రాజధాని చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ఇందుకు తగిన విధంగా జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అంతేగాక శ్రీశైలం జలాశయం ఉన్నందున నీటికి కొరత లేదు. వివిధ రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. శివరామక్రిష్ణన్ కమిటీ వస్తుండటంతో జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కమిటీ కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకుంటుంది. కొత్త రాజధాని ఎంపిక, విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేస్తున్న ఈ కమిటీకి అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా ఇవ్వవచ్చని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
రాజధాని రేసులో గుంటూరు
సాక్షి, గుంటూరు : సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటు చేసే అంశంలో గుంటూరు ముందు వరుసలో ఉంది. జూన్ 2 నుంచి ఏర్పడే కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడనే విషయంపై కేంద్ర హోం శాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ జిల్లాలోని గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో సోమవారం పర్యటించనుంది. విశాఖపట్నంలో పర్యటన పూర్తి చేసుకున్న కమిటీ సభ్యులు విజయవాడ, గుంటూరులలో రాజధాని ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఆరుగురు నిపుణులతో కూడిన ఈ కమిటీ జిల్లాలో ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఊహలకు ఊతమిచ్చిన నేతల ప్రకటనలు.. ఇప్పటికే సీమాంధ్ర రాజధాని ఏర్పాటుపై ఊహాగానాలు, భిన్నవాదనలు తెరపైకి రావడం తెలిసిందే. గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు విభజన సందర్భంగా చెబుతూ వచ్చారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలంలు ప్రకటనలు చేశారు. ఇందుకు ఊతమిస్తూ ఫిబ్రవరిలోనే గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, అమరావతి, తాడికొండ, పెదకాకాని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. గుంటూరులో సీమాంధ్ర రాజధాని సాధన సమితి పేరుతో జిల్లాలో పలువురు మేధావులు సదస్సులు నిర్వహించారు. గుంటూరు-విజయవాడ-తెనాలి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. గుంటూరు - విజయవాడ నగరాల మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాన్ని రెడీమేడ్‌గా అసెంబ్లీ, ప్రధాన సచివాలయానికి ఉపయోగించుకోవచ్చని, యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 1000కి పైగా ఐజేఎం అపార్ట్మెంట్ విల్లాలను ప్రజాప్రతినిధుల, సచివాలయ అధికారుల క్వార్టర్లుగా ఏర్పాటుచేసుకునే వీలుందనే దిశగా రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏఎన్‌యూ తరలింపుపై విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. అభివృద్ధికి అనువైన భూములు.. రాజధానిగా మంగళగిరి ప్రాంతం అనువుగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండగా, గుంటూరు కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంగళగిరి ప్రాంతం విజయవాడకు పది కిలోమీటర్ల లోపే ఉండటం, అభివృద్ధికి అనువైన భూములు ఉండటం, అటవీ భూమి అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశాలు. గుంటూరు నగరాన్ని పరిశీలిస్తే.. పక్కనే ఉన్న ప్రత్తిపాడు మండలంలో పాతమల్లాయపాలెంలో ఇప్పటికే సేకరించిన మినీ ఎయిర్‌పోర్టు భూమిని అభివృద్ధి చేసే అవకాశం, గుంటూరులో ఉన్న భారతీయ పొగాకుబోర్డు, కేంద్ర పొగాకు పరిశోధనాసంస్థ, స్పైసెస్పార్క్, జాతీయ లాంఫాం కేంద్రం, భారతీయ కాటన్ కార్పొరేషన్లు ఉండటంతో అనువైన ప్రాంతంగా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రాజధానిగా ఎంపిక చేయాలంటూ ఈ-మెయిల్స్‌కు కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. జిల్లాలో సోమవారం పర్యటించనున్న కమిటీని జిల్లాలోని మేధావులు, ప్రజా సంఘాల నేతలు కలిసి గుంటూరు ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని తెలియజేయనున్నారు.