రాజధానికి ‘ప్లాట్‌ఫామ్’ ముప్పు?
♦ సీడ్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతంలో పెరగనున్న ఎత్తు
♦ 5 చ.కిమీల పరిధిలో 8 అడుగుల మేర ఎత్తు పెంచాలని నిర్ణయం
♦ తీవ్ర ఆందోళనలో రాజధాని గ్రామాల ప్రజలు
సాక్షి,హైదరాబాద్ : పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికి.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇపుడు అచ్చం అలానే ఉంది. రాజధానికి ఏ ప్రాంతం పనికి వస్తుందో చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదు అన్న నిపుణుల మాట కొట్టిపడేశారు. అమరావతి లోటుపాట్ల గురించి, అక్కడ రాజధాని పేరుతో జరుగుతున్న వృథా ఖర్చుల గురించి ఎవరు మాట్లాడినా వారు రాజధానికి వ్యతిరేకులు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా అక్కడ రాజధాని నిర్మాణం సరికాదని అనేక రకాలుగా నిరూపణ అవుతూ వస్తోంది.
రాజధానిలో 13,600 ఎకరాలు, సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 10,600 ఎకరాలు వరద నీటిలో మునిగిపోతాయని సీఆర్‌డీఏ తేల్చడం తాజా నిదర్శనం. దాంతో రాష్ర్టప్రభుత్వం నష్టనివారణ చర్యలు హడావిడిగా చేపట్టింది. రాజధానిలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎత్తయిన ఫ్లాట్‌ఫాంను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.750 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం ఎత్తును పెంచాలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆర్వీ అసోసియేట్స్ కన్సల్టెంట్‌ను సీఆర్‌డీఏ నియమించింది. ఈ కన్సల్టెంట్ నివేదిక వస్తే గానీ ఎక్కడ ఎంత మేర ఫ్లాట్ ఫాం స్థాయిని పెంచాలో చెప్పలేమని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.
అయితే దాదాపు 8 అడుగుల మేర నిర్మాణ ప్రాంతం ఎత్తు పెరగనుందని అంటున్నారు. రాజధానిలో మొత్తం వరద నీటి నియంత్రణ పనులు చేపట్టడానికి రూ.2,941 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. వర్షాకాలంలో కొండవీటి వాగు వరద వల్ల రాజధాని ప్రాంతంలో 13,600 ఎకరాలు ముంపునకు గురవుతుందని పేర్కొంది. ఇందులో సీడ్ కాపిటిల్ పరిధిలోనే 10,600 ఎకరాలు వరద నీటితో మునిగిపోతాయని సీఆర్‌డీఏ తేల్చింది. 3.84 టీఎంసీ వరద వస్తుందని, ఇందులో 80 శాతం కేపిటల్ సిటీలోనే వరద ఉంటుందని, అయితే ఈ వరద నీటి వినియోగం ఉండదని, కృష్ణా నది ద్వారా సముద్రంలోకి వెళ్లి పోతుందని సీఆర్‌డీఏ పేర్కొంది.
వరద నియంత్రణ చర్యల్లో భాగంగా కొండవీటి వాగుకు వరద కాల్వను 30 కిలో మీటర్ల మేర నిర్మిస్తారు. అలాగే ఎర్రవాగు, కోటివాగు, అయ్యన్నవాగు, పాలవాగుకు 53 కిలోమీటర్ల మేర వరద కాల్వను నిర్మిస్తారు. అలాగే ఒక్కో టీఎంసీ చొప్పున వరద నీటిని నిలువరించేందుకు నీరుకొండ, కృష్ణయ్యపాలెం వద్ద పాండ్స్ నిర్మాణం చేపడతారు. కృష్ణా నది ఒడ్డున 29 కిలోమీటర్ల మేర వరద నీరు సులువుగా వెళ్లిపోవడానికి వీలుగా నిర్మాణం చేపడతారు. అలాగే 40 కిలోమీటర్ల మేర వరద నీటి డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులను ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని గ్రామాలకు ముప్పే...
క్యాపిటల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎత్తు పెంచితే రాజధానిలోని ఇతర గ్రామాల పరిస్థితి ఏంటనే ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. గ్రామాలు ముంపునకు గురవుతాయని భయపడుతున్నారు. కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న రాజధానికి కొండవీటి వాగు నుంచి వచ్చే వరద ముప్పు పొంచి ఉందని తొలి నుంచే నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా నదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరద వస్తే రాజధాని ప్రాంతం రోజుల తరబడి వరద ముంపులో ఉంటుంది. కృష్ణా నదిలో 4.50 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్న సమయంలో కొండవీటి వాగు వరద నదిలోకి చేరదు. వెనక్కు తన్నుతుంది.
2009లో సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణాకు వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వైపు ఉన్న కరకట్టను వరద తాకింది. అది సముద్ర మట్టానికి సుమారు 24 మీటర్ల ఎత్తున ఉంది. భవిష్యత్తులో రాజధాని భద్రత దృష్ట్యా ఆ మేరకు నిర్మాణాల ఫ్లాట్‌ఫాం 8 అడుగుల మేర పెంచాలనేది ప్రతిపాదన. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా సీడ్ రాజధాని, తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న డౌన్‌టౌన్ ప్రాంతాన్ని సముద్ర మట్టం కన్నా ఎత్తు పెంచాలని నిర్ణయించారు.
ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాల్సి వస్తే రాజధాని పరిధిలోని తక్కిన గ్రామాల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వరద నీరు పోవడానికి కొండవీటి వాగు వరదను మళ్లిస్తామని, రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని చెపుతున్నా ఫ్లాష్‌ఫ్లడ్స్ వస్తే తమ గ్రామాలు మునగక తప్పదని స్థానికులు ఆందోళనకు లోనవుతున్నారు. పైగా రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, ఆర్టీరియల్స్ రోడ్లు నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. అవన్నీ రూపుదిద్దుకుంటే వరదనీరు సాఫీగా నదివైపు, దిగువనకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులంటున్నారు.