శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన
నూతన రాజధానిని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినశివరామకృష్ణన్ కమిటీ సభ్యుల రాకను విద్యార్థి, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు,మేధావులు స్వాగతించలేకపోయారు. కేవలంకంటితుడుపు చర్యగానే కమిటీ సభ్యుల పర్యటన ఉన్నట్లు పెదవి విరిచారు.
సాక్షి ప్రతినిధి, కడప: గుంటూరు-విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందనున్నాయి.. రాజధాని ఏర్పాటుకు అక్కడే అనువైన ప్రాంతం. పన్నెండున్నర వేల ఎకరాలు ఉంటే చాలు రాజధానిని ఏర్పాటు చేయవచ్చు అంటూ నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గం ఉపసంఘం ప్రకటనలు చేస్తోంది. అలాంటి తరుణంలో శివరామకృష్ణన్ కమిటీ జిల్లా పర్యటన కంటితుడుపు చర్యేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మమ అన్పించేందుకు చిట్టచివరన జిల్లాలో పర్యటించారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు.. ఇప్పటి వరకూ చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపధ్యంలో ఇప్పటికే రాజధాని ఏర్పాటులో నిర్ణయం జరిగిపోయిందనే భావన వ్యక్తం అవుతోంది. విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన నేపధ్యంలో విభజన బిల్లులో రాజధాని అంశం పొందుపర్చాల్సి ఉంది.
రాజధాని అంశం చేర్చకుండా పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు తెరపైకి వచ్చాయని ఆమేరకే మునపటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేయలేదని మేధావులు వాపోతున్నారు. రాజధాని ఏప్రాంతంలో బాగుంటుందో సూచించాలని శివరామకృష్ణన్ కమిటీని వేసిన ప్రభుత్వ పెద్దలు ముందే తొందరపడుతున్నారు. కమిటీ సిఫార్సులు అందకమునుపే రాజధాని అంశంపై వారికి తోచిన ప్రాంతాన్ని సూచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజధాని కమిటీ సలహా మండలిని నియమించింది. వారు సైతం ఇప్పటికే ఒక అవగాహనకొచ్చి ప్రకటలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిట్టచివరన వైఎస్సార్ జిల్లాలో శివరామకృష్ణన్ కమిటీ సోమవారం పర్యటన చేసింది. మమ అన్పించుకునేందుకు మినహా సహేతుకంగా కమిటీ చర్యలు లేవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మభ్యపెట్టేందుకే పాలకుల కుయుక్తులు....
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడైతే బాగుంటుందో సూచించాలని ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలలో పర్యటించింది. కమిటీ నిర్ధారణకు రాకమునుపే గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆప్రకటన వెలువడ్డాక పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మంత్రి వర్గం నేతృత్వంలో రాజధాని ఏర్పాటు సలహా కమిటీని నియమించారు. రాష్ట్ర విభజనకు మరోమారు అస్కారం లేకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా నినాదం అందుకుంది.
ఇలాంటి తరుణంలో ప్రభుత్వ భూములు 50వేల ఎకరాలున్నచోట రాజధాని ఏర్పాటు చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. అయితే 12500 ఎకరాల్లోనే రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మండలి ఎటుతిరిగి గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలనే తలంపు ఉన్నట్లు రూఢీ అవుతోంది. ఈ నేపధ్యంలో రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసేందుకు, మభ్యపెట్టేందుకు పాలకుల కుయుక్తులే శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయమని పలువురు ఆరోపిస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలోని మేధావులు, రాజకీయ నేతలు, ఉద్యోగ, విద్యార్థి వర్గాల నుంచి వ్యతిరేక వ్యక్తం కాకుండా ఉండేందుకు వ్యూహత్మకంగా పాలకులు అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. భాషా ప్రయోక్త రాష్ట్రం ఏర్పాటు నాటినుంచి రాయలసీమకు అన్యాయం చేస్తున్న కోస్తానాయకులు రాజధాని విషయంలో మరోమారు వంచనకు గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. సీమ భూములను బీళ్లుగా మార్చి కృష్ణా జలాలను తరలించుకెళ్తున్న కోస్తా నేతల కబంధ హస్తాల్లో పసుపునేత చిక్కుకుపోయారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఆకారణంగా కర్నూలు రాజధాని అంశాన్ని తెరమరుగు చేస్తున్నారని సీమ వాసులు వాపోతున్నారు.