‘సీమ’లోనే రాజధాని
లేదంటే మరో విభజనకు పోరు
శివరామకృష్ణన్ కమిటీ ఎదుట నేతల స్పష్టీకరణ
నవ్యాంధ్ర రాజధానిని రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో విభజనకు పోరు మొదలవుతుందని స్పష్టంచేశారు. రాజధాని అంశంపై సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన కమిటీ సభ్యులు అరోమర్ రేవి, కేటీ రవీంద్రన్ కడప కలెక్టరేట్ సభా భవనంలో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.
ఇంకా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎ.రఘునాథరెడ్డి, మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నోలు సుబ్బరాయుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కె.వెంకట్రామిరెడ్డి, బి.ఎన్. బాబు, చిన్న సుబ్బయ్య యాదవ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పులిమి ప్రసాద్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మీగడ నారాయణరెడ్డి, మైదుకూరు రైతు సేవా సమితి అధ్యక్షుడు డి.ఎన్. నారాయణ, తదితరులు తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
- కడప సెవెన్‌రోడ్స్
కడప ఎడ్యుకేషన్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ స్టూడెంట్ యూనియన్ నాయకులు శివరామకృష్ణన్ కమిటీని కోరారు. సోమవారం కడపకు వచ్చిన కమిటీని ఆర్‌ఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. 1953 నుంచి 1956 వరకు రాయలసీమలోని కర్నూలు రాజధానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్‌రెడ్డి అన్నారు. అప్పుడు రాజధానిని త్యాగం చే సిన కర్నూలులోనే ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌యూ అధ్యక్షుడు జయవర్దన్, కోశాధికారి నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఓబయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములున్న చోటే ..
ప్రభుత్వ భూములు లభ్యమయ్యేచోటే రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానికి సేకరించిన భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం వినియోగించుకొని మిగిలిన భూమిని వేలం ద్వారా అమ్మితే రూ.లక్ష కోట్లు వచ్చేందుకు అవకాశముంది. ఆ డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోస్తాలో భూసేకరణ తలకు మించిన భారమే.
- రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు
కాదంటే మరో ఉద్యమమే..
కోస్తాలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉంంది. ఇప్పటికే సీమ అన్ని విధాలా మోసపోయింది. రాజధాని ఏర్పాటుకు కనీసం 50 నుంచి 60 వేల ఎకరాల భూమి సేకరించడం కోస్తాలో సాధ్యపడదు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టు, కొత్త కలెక్టరేట్, రిమ్స్, రవాణా తదితర సౌకర్యాలన్నీ జిల్లాలో ఉన్నాయి. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి
మరో విభజనకు ఆస్కారమివ్వొద్దు
రాజధాని ఏర్పాటు అంశం మరో విభజనకు ఆస్కారం లేకుండా ఎంపిక చేయాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. రాజధానికి కడప అన్ని రకాల యోగ్యకరంగా ఉంది. రాజధాని ఏర్పాటు రాయలసీమ హక్కు. ఇవన్నీ విస్మరించి ఓ వైపు కమిటీ వేస్తూనే మరోవైపు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మరోసారి విభజన కాకుండా నిర్ణయం తీసుకోవాలి.
- పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం